logo

ధాన్యం రైతు కంట కన్నీరు

ఏ గ్రామానికి వెళ్లినా కల్లాల్లోనే ధాన్యం బస్తాలు దర్శనమిస్తున్నాయి. వాటిపై గడ్డి కప్పి భద్రపరిచారు. అధికారులేమో  లక్ష్యం ముగిసింది.. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వస్తే కానీ కొనలేమని చేతులెత్తేస్తున్నారు.

Published : 07 Feb 2023 03:57 IST

ఈనాడు-విజయనగరం, గజపతినగరం, జామి, భోగాపురం బొబ్బిలి, న్యూస్‌టుడే


భోగాపురం మండలం ములగాడలో బస్తాల వద్ద  రైతు

గ్రామానికి వెళ్లినా కల్లాల్లోనే ధాన్యం బస్తాలు దర్శనమిస్తున్నాయి. వాటిపై గడ్డి కప్పి భద్రపరిచారు. అధికారులేమో  లక్ష్యం ముగిసింది.. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వస్తే కానీ కొనలేమని చేతులెత్తేస్తున్నారు. ఇదే అదనుగా ప్రైవేటు వ్యాపారులు, దళారులు రైతులను నిలువునా దోచుకుంటున్నారు. సాధారణ రకం క్వింటాకు రూ.2024, ఏ-గ్రేడ్‌కు రూ.2060 మద్దతు ధర ఉండగా.. రూ.1400 నుంచి రూ.1500లకు కొనుగోలు చేస్తున్నారు.

విజయనగరం జిల్లాలో 2,30,692 ఎకరాల్లో వరి సాగు చేయగా.. 5.11 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఇందులో 2.64 లక్షల టన్నులు కొనాలని లక్ష్యం నిర్దేశించారు. దీన్ని చేరుకొని 20 రోజులు గడిచింది. అప్పటి నుంచి రైతులకు కష్టాలు మొదలయ్యాయి. ఇంకా సేకరించాల్సిన ధాన్యం ఆర్బీకేల పరిధిలో 1.05 లక్షల టన్నులు ఉన్నట్లు గుర్తించి ఆ వివరాలు యాప్‌లో నమోదు చేశారు. ఇందులో 70 వేల టన్నులు సేకరించడానికి అంగీకరించి.. 40 వేల టన్నులకు అనుమతులు ఇచ్చి దాదాపుగా లక్ష్యం చేరుకున్నారు. మిగిలిన 60.05 వేల టన్నుల పంట రైతుల వద్దే ఉండిపోయింది. పార్వతీపురం మన్యం జిల్లాలో 1,71,762 ఎకరాల్లో సాగు చేయగా.. 3.18 లక్షల టన్నులు దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఇందులో 1.91 లక్షల టన్నులు కొనాలని నిర్ణయించారు. లక్ష్యాన్ని ఎప్పుడో చేరుకోగా.. ఇంకా కల్లాల్లో, రైతుల వద్ద 53 వేల టన్నుల ధాన్యం ఉన్నట్లు అధికారులు తేల్చారు. ఇందులో 20 వేల టన్నుల కొనుగోలుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇప్పటి వరకు 15 వేల టన్నులు తీసుకున్నారు. ప్రభుత్వ అనుమతి మేరకు మరో 5 వేల టన్నులు సేకరించినా.. మిగతా 33 వేల టన్నుల పరిస్థితి ఏమిటో ఎవరూ చెప్పడం లేదు.


సర్వం బుగ్గి

పొలాల్లో ఉన్న పంటను ఎలుకలు, పందులు నాశనం చేస్తున్నాయి. దీనికి తోడు ఇటీవల బలిజిపేట, వంగర, గరివిడి మండలాల్లో జరిగిన అగ్నిప్రమాదాల్లో ధాన్యం కాలిపోయింది. అధికారులు కొనుగోలు చేసి ఉంటే పంట కాలి బూడిదయ్యేది కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగులు సంచరిస్తుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని భయపడుతున్నారు.


సీఎం, గవర్నర్‌కు వినతులు

పండించిన ధాన్యం కొనకపోవడంతో నెలరోజులుగా కల్లాల్లో ఉంచి కాపలా కాస్తున్నామని, ఆర్‌బీకేలకు వెళ్తే కొనుగోలుకు మాకెలాంటి ఆదేశాలు లేవని చేతులెత్తేస్తున్నారని బొబ్బిలి మండలం మల్లంపేట రైతులు సోమవారం ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌లకు వినతిపత్రాలను పోస్టులో పంపారు. ఒక్కో రైతు వద్ద సుమారు 150 నుంచి 200 వరకు బస్తాలు ఉండిపోయాయని వాపోయారు.

* గజపతినగరం మండలంలో 4800 టన్నులు, బొండపల్లిలో 4700, దత్తిరాజేరు 5700, మెంటాడలో 3500, గరివిడిలో  1200 , వెదుళ్లవలసలో 380, చీపురుపల్లిలో 400 టన్నులు ఉండిపోయింది.


పెట్రోల్‌తో బైఠాయింపు

భోగాపురం తహసీల్దారు కార్యాలయం ఎదుట అన్నదాతలు పెట్రోల్‌ చేతబట్టి నిరసన తెలిపారు. ఆత్మహత్యకు పాల్పడతామంటూ అక్కడే బైఠాయించారు. విషయం తెలుసుకున్న సీఎస్‌ డీటీ మురళి చేరుకుని ఉన్నతాధికారుల దృష్టికి సమస్య తీసుకెళ్తానని సర్దిచెప్పినా కొనే వరకూ ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించి వెనుదిరిగారు.


ధర్నా చేస్తున్న కె.ఎ.నాయుడు, నాయకులు, కార్యకర్తలు

రైతులు పండించిన ప్రతి గింజ కొనాల్సిందేనని గజపతినగరం మాజీ ఎమ్మెల్యే, తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి కె.ఎ.నాయుడు డిమాండ్‌ చేశారు. సోమవారం ఆయన ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి ధాన్యం బస్తాలను నెత్తిన ఎత్తుకొని జాతీయ రహదారి మీదుగా ర్యాలీ నిర్వహించి తహసీల్దారు కార్యాలయం వద్ద ధర్నా చేశారు. అనంతరం ఉప తహసీల్దారు సత్యనారాయణకు వినతిపత్రం అందించారు. కె.ఎ.నాయుడు మాట్లాడుతూ నియోజకవర్గంలో  12 వేల టన్నుల ధాన్యం పొలాలు, కల్లాల్లో ఉందన్నారు.  మొత్తం కొనుగోలు చేసే వరకు పోరాటం చేస్తామన్నారు. నాయకులు లక్ష్మునాయుడు, కృష్ణ, మోహనరావు, బాలాజీ, శ్రీదేవి, విజయకుమార్‌ పాల్గొన్నారు.


వీరంతా గరివిడి మండలం వెదుళ్లవలస రైతులు. సంక్రాంతి నుంచి ధాన్యం కొనుగోలు ఆపేయడంతో కల్లాల్లోనే ఉంచిన బస్తాల వద్ద రేయింబవళ్లు కాపలా కాయాల్సి వస్తోందని సోమవారం విజయనగరం కలెక్టరేట్‌లో జరిగిన స్పందనలో కలెక్టర్‌ ఎదుట కన్నీరు పెట్టుకున్నారు. అధికారులను అడిగితే తమ లక్ష్యం అయిపోయిందని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.


ఎవరూ కొనుగోలు చేయకపోవడంతో 180 బస్తాలు జనవరి నాలుగు నుంచి కల్లంలోనే ఉన్నాయి. ఆర్బీకే చుట్టూ తిరుగుతున్నా తీసుకోవడం లేదు. పంటను ఏం చేసుకోవాలో తెలియడం లేదు. అప్పు చేసి రూ.60 వేల వరకు పెట్టుబడులు పెట్టాను. వడ్డీ భారం పెరుగుతోంది. అధికారులు త్వరలో కొనుగోళ్లు చేపట్టి రైతులకు న్యాయం చేయాలి.  

బలగ సూర్యారావు, మల్లంపేట, బొబ్బిలి


నాకున్న రెండెకరాలతో పాటు మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని పండించాను. గ్రామంలో పందుల బెడద ఉండటంతో పొలంలోనే పంటంతా ఉంచాను. నా పొలానికి దూరంలో గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టగా ఆ మంటలు వ్యాపించి 43 బస్తాలు కాలిపోయాయి. మిగిలిన 110 బస్తాలు ఇంటికి తీసుకొచ్చి ఆర్బీకేలో అధికారులకు చెప్పినా కొనుగోలు చేయడం లేదు.

గుడివాడ అప్పలనాయుడు, కొప్పరవలస, వంగర మండలం, విజయనగరం


సర్దుబాటు చేస్తున్నాం ... రైతులకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడైనా లక్ష్యం మిగిలితే ఇతర మండలాలకు సర్దుబాటు చేస్తున్నాం. ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం నుంచి మరోసారి అనుమతులు రానున్నాయి.

మీనాకుమారి, డీఎం, పౌర సరఫరాల సంస్థ, విజయనగరం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని