logo

టిడ్కో.. ఆలస్యం ఎందుకో..?

ఉమ్మడి జిల్లాలు విజయనగరం, పార్వతీపురం మన్యంలోని టిడ్కో ఇళ్లను మార్చి నాటికి లబ్ధిదారులకు అందజేయాలని అధికారులు నిర్ణయించారు.

Published : 09 Mar 2023 05:02 IST

సారిపల్లిలో గృహాలు

విజయనగరం పట్టణం, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాలు విజయనగరం, పార్వతీపురం మన్యంలోని టిడ్కో ఇళ్లను మార్చి నాటికి లబ్ధిదారులకు అందజేయాలని అధికారులు నిర్ణయించారు. కానీ.. ఇప్పటి వరకు పూర్తయిన పరిస్థితి కనిపించలేదు. గత ప్రభుత్వం 300, 365, 430 చదరపు అడుగుల్లో గృహాలు నిర్మించాలని నిర్ణయించారు. వైకాపా ప్రభుత్వం 300 చ.అ ఇళ్లను లబ్ధిదారులకు రూ.1కే ఇవ్వనున్నట్లు ప్రకటించింది. 365 చ.అ. నివాసానికి లబ్ధిదారుని వాటా రూ.50 వేలు నుంచి రూ.25 వేలు, 430 చ.అడుగులకు రూ.లక్ష నుంచి రూ.50 వేలకు తగ్గించింది. మిగిలిన మొత్తం బ్యాంకుల ద్వారా రుణాలు ఇచ్చేలా అధికారులు చర్యలు తీసుకున్నారు.

విజయనగరంలోని సారిపల్లిలో 2656 ఇళ్లకు 800 మాత్రమే అప్పగించారు. మరో 640 ఇవ్వడానికి  చర్యలు చేపట్టారు. మరో 1216 తుది దశలో ఉన్నాయి. సోనియానగర్‌లో సివిల్‌ పనులు 85 శాతం పూర్తయినట్లు పేర్కొంటున్నారు. ఇక్కడ మౌలిక సదుపాయాల్లో ఎర్త్‌ పనులు చేపట్టారు. మొత్తం 1120 ఇళ్లను అప్పగించాల్సి ఉంది. బొబ్బిలిలోని గొల్లపల్లి దగ్గర 1680 ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. 1248 రివర్స్‌ టెండర్‌కు వెళ్లాయి. నెల్లిమర్లలో 576 ఇళ్లకు 528 స్లాబులు అయ్యాయి. ఇక్కడ 40 శాతం మాత్రమే సివిల్‌ పనులు, రాజాంలో 336 గృహాలకు 288 స్లాబు పనులు పూర్తయ్యాయి. పార్వతీపురంలో 300 చ.అ ఇళ్లు 768 నిర్మిస్తున్నారు. 648 గృహాలకు స్లాబులు, సాలూరులో 1248 ఇళ్లకు 1200 వాటికి స్లాబులు అయ్యాయి.

 మౌలిక వసతులకూ..

ఉమ్మడి జిల్లాల్లో టిడ్కో ఇళ్ల వద్ద మౌలిక వసతుల కల్పనకు రూ.62.43 కోట్లతో ప్రతిపాదించారు. సారిపల్లిలో రూ.19.54 కోట్లతో పనులు జరుగుతుండగా సోనియానగర్‌లో రూ.3.34 కోట్లతో మొదలయ్యాయి. నెల్లిమర్లలో రూ.5.30 కోట్లు, సాలూరులో రూ.7.67 కోట్లు, బొబ్బిలిలో రూ.13.11 కోట్లు, పార్వతీపురంలో రూ.7.18 కోట్లు, రాజాంలో రూ.6.29 కోట్లతో ప్రతిపాదించారు.


పనులు జరుగుతున్నాయ్‌

- జ్యోతి, ఈఈ, టిడ్కో

ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేస్తాం. గుత్తేదారులకు బిల్లులు త్వరలో చెల్లిస్తాం. నెల్లిమర్లలో చంపావతి దగ్గర నీటి పథకాల పనులు జరుగుతున్నాయి. టిడ్కో ఇళ్లకు అమృత్‌-2.0లో నీటి పథకాల కోసం నిధులు కేటాయించారు. సారిపల్లిలో ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేస్తే మరో 640 ఇళ్లు లబ్ధిదారులకు అందుబాటులోకి రానున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని