logo

హరిత శోభిత రహదారి

భారతమాల ప్రాజెక్టు ఫేజ్‌-1 కింద ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లను కలుపుతూ రాయపూర్‌-విశాఖ మధ్య ఆరు వరుసల గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేను కేంద్రం చేపట్టింది.

Updated : 30 Mar 2023 02:47 IST

ఉభయ జిల్లాలకు ఉపయోగం

జామి వద్ద నిర్మాణంలో ఉన్న రహదారి

పేరు: రాయపూర్‌- విశాఖపట్నం (ఎకనామిక్‌ కారిడార్‌) గ్రీన్‌ఫీల్డ్‌ నేషనల్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే
అంచనా వ్యయం: రూ.20,000 కోట్లు  రోడ్డు నంబరు: ఎన్‌హెచ్‌-130 సీడీ అండ్‌ ఈసీ-157
పొడవు: 464.662 కి.మీ  వెడల్పు: ఆరు వరుసలు, 60 మీటర్లు  నిధులు: ఏడీబీ

న్యూస్‌టుడే, కొత్తవలస: భారతమాల ప్రాజెక్టు ఫేజ్‌-1 కింద ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లను కలుపుతూ రాయపూర్‌-విశాఖ మధ్య ఆరు వరుసల గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేను కేంద్రం చేపట్టింది. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల మీదుగా ఈ రోడ్డు రూపుదిద్దుకుంటోంది.

ప్రస్తుతం రాయపూర్‌- విశాఖ మధ్య విజయనగరం, గజపతినగరం, సాలూరు మీదుగా ఉన్న జాతీయ రహదారితో సంబంధం లేకుండా గ్రీన్‌ఫీల్డు రోడ్డును నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న మార్గంలో ట్రాఫిక్‌ రద్దీ ఎక్కువగా ఉంటోంది. ప్రయాణ సమయం 13 నుంచి 14 గంటలు పడుతోంది. దీనికి ప్రత్యామ్నాయంగా గంటకు 40 నుంచి 100 కి.మీ వేగంతో ప్రయాణించేలా కొత్త మార్గం రూపుదిద్దుకుంటోంది. దీనివల్ల ప్రయాణ సమయం 6-7 గంటలకు తగ్గుతుందని అంచనా. ఫలితంగా ఇంధన వినియోగం, ప్రయాణ ఖర్చు కలిసొస్తుంది. 2025 నాటికి సిద్ధం చేయాలన్నది గడువు కాగా ఆంధ్రప్రదేశ్‌లో 2024 అక్టోబరుకు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.దీన్ని అనకాపల్లి జిల్లా సబ్బవరం వద్ద అనకాపల్లి-రాజాపులోవ ఎన్‌హెచ్‌కు కలుపుతారు.

వర్చువల్‌లో ప్రధాని మోదీ ప్రారంభించిన శిలాఫలకం

ఉమ్మడి జిల్లాల్లో గతేడాది నవంబరు 12న పనులను ప్రధాని మోదీ వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. ఇక్కడ రూ.3,800 కోట్ల అంచనాతో నిర్మిస్తున్న రోడ్డు కోసం 800 హెక్టార్ల భూములను సేకరించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో 11 కి.మీ పొడవున అటవీ భూములున్నాయి. అవసరమైన చోట పంట పొలాలకు, ఇతరత్ర నీటి ప్రవాహానికి అనుగుణంగా చిన్న వంతెనలు, నదులు, గెడ్డలపై పెద్ద వంతెనలు,  అండర్‌/ఓవర్‌ పాస్‌లు నిర్మిస్తున్నారు.

అంతర రోడ్ల అనుసంధానం

రెండు జిల్లాల్లో ఆరు చోట్ల అంతర అనుసంధాన మార్గాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో మొదటిది అనకాపల్లి జిల్లా సబ్బవరం బైపాస్‌ చివరి నుంచి గుల్లిపల్లి-మొగలిపురం మధ్యలో, రెండోది కొత్తవలస మండలం దత్తి వద్ద, మూడోది జామి మండల కేంద్రంలో, నాలుగోది గంట్యాడ మండలం కొర్లాం సమీపంలో విజయనగరం 516ఈ రోడ్డు క్రాస్‌ వద్ద, ఐదోది మెంటాడ మండలం మూసూరు వద్ద, ఆరోది సాలూరు వెళ్లే దారిలో మాతుమూరు వద్ద అంతర రోడ్లను అనుసంధానిస్తున్నారు.

లక్కవరపుకోట మండలం నిడుగట్టు వద్ద గెడ్డపై నిర్మిస్తున్న వంతెన

ప్రధాన ఉద్దేశమిది

ప్రధానంగా కార్గో సేవల కోసం హరిత రహదారిని ఉద్దేశించారు. ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా రాష్ట్రాల్లో ఉన్న బాక్సైట్‌, ఐరన్‌ ఓర్‌, లైమ్‌స్టోన్‌ వంటి ఖనిజ ముడిసరకులను విశాఖ పోర్టుకు రవాణా చేయడానికి వీలుగా ప్రతిపాదించారు. ఈ మార్గం జిల్లాల్లో పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడుతుందని భావిస్తున్నారు.

ఐదు చోట్ల విశ్రాంతి కేంద్రాలు

ఉభయ జిల్లాల పరిధిలో ఐదుచోట్ల రహదారి పక్కన వాహన చోదకులు, ప్రయాణికులకు విశ్రాంతి సౌకర్యం కల్పిస్తున్నారు. ప్రతి 100 కి.మీ దూరంలో ‘రెస్టు ఏరియా’ పేరిట స్టాపేజీలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ పెట్రోల్‌ బంకు, విశ్రాంతి తీసుకోవడానికి వసతులు, ఫలహార-భోజనశాలలు, ఇతర అవసరమైన సదుపాయాలు కల్పిస్తారు. కొత్తవలస మండలం గులివిందాడ-చీపురువలస మధ్య, గంట్యాడ మండలం కొర్లాం వద్ద టోల్‌ప్లాజాలు ఏర్పాటు చేస్తున్నారు.

చినరావుపల్లి-మల్లివీడు మధ్య నిడుగట్టు వద్ద నిర్మించిన ఓవర్‌ పాస్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని