logo

మాల్‌ప్రాక్టీసుకు పాల్పడితే కఠిన చర్యలు

జిల్లాలో ఈ నెల 3 నుంచి జరగనున్న పదోతరగతి పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా విద్యాశాఖాధికారి బి.లింగేశ్వరరెడ్డి తెలిపారు.

Updated : 02 Apr 2023 06:15 IST

చరవాణి, డిజిటల్‌ వాచీలు నిషేధం
హాల్‌టికెట్‌ ఉంటే పల్లెవెలుగులో  ఉచిత ప్రయాణం
‘న్యూస్‌టుడే’తో డీఈవో లింగేశ్వరరెడ్డి

విజయనగరం విద్యావిభాగం, న్యూస్‌టుడే: జిల్లాలో ఈ నెల 3 నుంచి జరగనున్న పదోతరగతి పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా విద్యాశాఖాధికారి బి.లింగేశ్వరరెడ్డి తెలిపారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టామన్నారు. చరవాణి, డిజిటల్‌ వాచీలకు అనుమతి లేదని, మాల్‌ప్రాక్టీసుకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని, ఈ ఏడాది విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారని ఆశిస్తున్నామని ఆయన ‘న్యూస్‌టుడే’కు పలు విషయాలను తెలిపారు.

* రెగ్యులర్‌ విద్యార్థులు 24,099 మంది, ప్రైవేట్‌గా 1428 మంది పరీక్ష రాయనున్నారు. ఏప్రిల్‌ 18వ తేదీ వరకు ఉదయం 9.30 నుంచి 12.45 వరకు జరుగుతాయి.  ఎవరైనా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోకపోతే వారికి ప్రధానోపాధ్యాయులు డౌన్‌లోడ్‌ చేసి ఇవ్వాలని ఆదేశించాం.

బెంచీకి ఒక్కరే..:  చిన్నగా ఉన్న చోట బెంచీకి ఒక్కరు, ఎంపీల్యాడ్స్‌ ద్వారా ఇచ్చిన బెంచీలు పెద్దవి కావడంతో ఇద్దరేసి రాస్తారు. తాగునీరు, విద్యుత్తు, మరుగుదొడ్ల సదుపాయం, ప్రథమ చికిత్స సౌకర్యాలు కల్పించాం. నాడు నేడు పనులు జరిగే చోట పరీక్షా కేంద్రాలు లేవు.  అవి ఉన్నట్లు మా దృష్టికైతే రాలేదు. పరీక్ష వేళల్లో బస్సులు తిరిగేలా అన్ని చర్యలు తీసుకున్నాం. పల్లెవెలుగు బస్సుల్లో విద్యార్థులు హాల్‌  టికెట్‌ చూపించి పరీక్షకు ఉచితంగా వెళ్లొచ్చు.

పర్యవేక్షణ ఇలా..: ఏడు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లను నియమించాం. 35 ‘సి’ కేటగిరీ కేంద్రాల్లో సిట్టింగ్‌ స్క్వాడ్‌లు పర్యవేక్షిస్తారు. ప్రతి కేంద్రానికి ఒక ముఖ్య పర్యవేక్షకుడు, విభాగాధికారులు ఉంటారు. 1311 మంది ఇన్విజిలేటర్లను నియమించాం. కస్టోడియన్ల ఆధ్వర్యంలో ప్రశ్నపత్రాలు ఇప్పటికే 29 స్టోరేజీ పాయింట్లకు తరలించాం. పరీక్షలు జరిగే 200 మీటర్ల వరకు 144 సెక్షన్‌ అమల్లో ఉంటుంది. సమీపంలోని జిరాక్స్‌ దుకాణాలు, అంతర్జాల కేంద్రాలను మూసేయాలని ఆదేశించాం. ప్రాంగణంలోకి విద్యార్థులు, ఇన్విజిలేటర్లు, ముఖ్య పర్యవేక్షకులు, డిపార్ట్‌మెంట్‌ అధికారులు ఏ ఒక్కరూ చరవాణిని తీసుకురాకూడదు. డిజిటల్‌ వాచీలను నిషేధించాలని ప్రభుత్వం ఆదేశించింది. కేంద్రంలో తిరిగే అధికారులు, ఇన్విజిలేటర్లకు ఐడీ కార్డులు తప్పనిసరి చేశాం.

ప్రశ్నపత్రాలకు వరుస నంబరు: తొలిసారిగా ప్రశ్నపత్రాలకు సీరియల్‌ నంబరు ఉంటుంది. పరీక్షకు హాజరుకాని వారి ప్రశ్నపత్రాలు పక్కన పెడతాం. 24 పేజీల బుక్‌లెట్‌ రూపంలో సమాధాన పత్రం ఉంటుంది. అదనంగా కావాలంటే 12పేజీల బుక్‌లెట్‌ ఇస్తారు. భౌతికశాస్త్రం, జీవశాస్త్రం సబ్జెక్టులకు వేర్వేరుగా సమాధాన పత్రాలు ఇస్తాం. విద్యార్థులు సమాధానాలు రాసేటపుడు ఇచ్చిన సబ్జెక్టుకు సంబంధించి బుక్‌లెట్‌లోనే రాయాలి. ఈ మేరకు విద్యార్థులకు పూర్తిగా అవగాహన కల్పించాం. గ్రాఫ్‌, మ్యాప్‌ పాయింటింగ్‌ మీద పేరు రాయకూడదు. సీరియల్‌ నంబరు మాత్రమే వేయాలి.

కోటలో కంట్రోల్‌రూం: పరీక్షల్లో ఏమైనా సమస్యలు ఎదురైతే కోటలోని పరీక్షల విభాగం కార్యాలయంలో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశాం. విద్యార్థులు, తల్లిదండ్రులు 90009 45346 నంబరుకు ఫోన్‌ చేసి సమస్యలు తెలియజేయవచ్చు. తక్షణమే చర్యలు తీసుకుంటాం.

పరిశీలకురాలిగా గీత: కేజీబీవీ సంయుక్త కార్యదర్శి ఎన్‌.గీత పరిశీలకురాలిగా నియమితులయ్యారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఆమె పర్యటించి పరీక్షలు జరిగే తీరును పర్యవేక్షిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని