logo

రైతు భరోసాతో పెరిగిన సాగు విస్తీర్ణం

రైతులకు పెట్టుబడి సాయం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రైతు భరోసా పేరుతో ఏడాదికి రూ.13,500 అందిస్తుండడంతో జిల్లాలో సాగు విస్తీర్ణం పెరిగిందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

Published : 02 Jun 2023 03:12 IST

బొబ్బిలి గ్రామీణం, న్యూస్‌టుడే: రైతులకు పెట్టుబడి సాయం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రైతు భరోసా పేరుతో ఏడాదికి రూ.13,500 అందిస్తుండడంతో జిల్లాలో సాగు విస్తీర్ణం పెరిగిందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గురువారం బొబ్బిలి మండల పరిషత్తు కార్యాలయం వద్ద జిల్లాస్థాయి రైతు భరోసా చెక్కుల పంపిణీ కార్యక్రమం ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు అధ్యక్షతన జరిగింది. దీనిలో ముఖ్య అతిథిగా మంత్రి పాల్గొని మాట్లాడారు. అయిదో ఏడాది మొదటి విడత సాయాన్ని రూ.5,500 చొప్పున అందించామన్నారు. దీంతో సాగు పెట్టుబడికి రైతులు బ్యాంకుల చుట్టూ రుణాల కోసం తిరగాల్సిన అవసరం లేదని, బంగారం తాకట్టు పెట్టాల్సిన పని లేదన్నారు. దళారుల బారిన పడకుండా ఆర్‌బీకేల ద్వారా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి సకాలంలో నగదు చెల్లిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో 2,58,300 మంది రైతులకు రూ.193.74 కోట్లు, వర్షాలకు పంట దెబ్బతిన్న రైతులు 2235 మందికి పెట్టుబడి రాయితీ రూ.73,42,000 చెక్కులను అందజేశారు. లచ్చయ్యపేట చక్కెర కర్మాగారం రైతుల బకాయిలు, సంకిలి కర్మాగారానికి చెరకు తరలించే రైతులకు నగదు చెల్లించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

పశువైద్యానికి సంచార వాహనాలు

పశువులకు అత్యవసర చికిత్స కోసం మొబైల్‌ వాహనాలు ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే శంబంగి అన్నారు. జడ్పీ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ గత ఖరీఫ్‌లో ఆరున్నర లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైతులకు రూ.12 వేల కోట్లు, చెరకు రైతులకు రూ.30 కోట్ల బకాయిలు చెల్లించామన్నారు. కలెక్టర్‌ నాగలక్ష్మి మాట్లాడుతూ రైతులు పండించిన పంటలు భద్రపరుచుకోవడానికి పీఏసీఎస్‌ పరిధిలో గోదాములు నిర్మిస్తున్నామన్నారు. కార్యక్రమంలో జేసీ మయూర్‌ అశోక్‌, జేడీ రామారావు, ఆర్డీవో శేషశైలజ, ఏఎంసీ ఛైర్మన్‌ శ్రీనివాసరావు, బుడా ఛైర్మన్‌ ఇంటి పార్వతి, మున్సిపల్‌ ఛైర్మన్‌ వెంకట మురళీకృష్ణ, ఏడీఏ మజ్జి శ్యామ్‌సుందర్‌, వైకాపా మండల అధ్యక్షుడు వేణుగోపాలనాయుడు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని