logo

ఆ పోస్టులు ఇక ఉండవ్‌

కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో(కేజీబీవీ) ఖాళీలు భర్తీ కానున్నాయి. ఒప్పంద ప్రాతిపదికన నియామకాలు చేపట్టనున్నారు.

Published : 02 Jun 2023 03:12 IST

కేజీబీవీల్లో కొలువుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

విజయనగరం విద్యావిభాగం, న్యూస్‌టుడే: కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో(కేజీబీవీ) ఖాళీలు భర్తీ కానున్నాయి. ఒప్పంద ప్రాతిపదికన నియామకాలు చేపట్టనున్నారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలోని 33 విద్యాలయాలకు 123 మంది అధ్యాపకులు రానున్నారు. అర్హులైన వారు ఈ నెల అయిదో తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలి. అయితే హేతుబద్ధీకరణ, అతిథి బోధకుల తొలగింపు వంటి చర్యలతో నిరుద్యోగ అభ్యర్థినులకు కొంత నష్టం చేకూరుతోంది.

ఎప్పటికప్పుడే..

2018-19లో సీఆర్టీల నియామకానికి కృపా ఏజెన్సీ ద్వారా ప్రకటన ఇచ్చారు. ఎంపిక అనంతరం వారిని ఒప్పంద ప్రాతిపదికన పరిగణనలోకి తీసుకున్నారు. 2021-22లో జిల్లాస్థాయిలో 132 ఖాళీలను భర్తీ చేసేందుకు నిర్ణయించారు. ఈ మేరకు మెరిట్‌ ప్రాతిపదికన ఎంపికలు చేపట్టారు. తుది జాబితాను ప్రకటించిన సమయంలో ధ్రువపత్రాలపై ఆరోపణలు రావడంతో నియామకాలు రద్దు చేశారు. అప్పట్లో 2,390 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ ప్రక్రియ నిలిచిపోవడంతో అప్పట్లో అతిథి బోధకులను నియమించారు. వీరిని 2022-23 విద్యాసంవత్సరం చివరి రోజు తొలగించారు. కొత్తగా వచ్చే వారిని కూడా తొలగిస్తారేమోనన్న ఆందోళన అభ్యర్థుల్లో కనిపిస్తోంది.

రాష్ట్రస్థాయి నుంచే జాబితా

దరఖాస్తుల మేరకు మెరిట్‌ కమ్‌ రోస్టర్‌ ప్రకారం 1:3 నిష్పత్తిలో రాష్ట్రస్థాయిలో మెరిట్‌ జాబితాను తయారు చేసి జిల్లాలోని ఎంపిక కమిటీకి    పంపిస్తారు.

అక్కడ ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తారు. నైపుణ్య, వ్యక్తిత్వ పరీక్ష నిర్వహణ ఆధారంగా కమిటీ ఆమోదంతో తుది జాబితాను ప్రకటిస్తారు.

అతిథి బోధకులకు సంబంధించి ఒక సంవత్సరంలో ఆరు నెలలు పైబడి కేజీబీవీల్లో పనిచేస్తే ఒక సంవత్సరంగా పరిగణించి 0.5 మార్కులు కేటాయిస్తారు.

సర్దుబాటా.. తొలగింపా

హేతుబద్ధీకరణతో తెలుగు, ఆంగ్లం పోస్టులు రద్దు కానున్నాయి. పీజీటీలో తెలుగు, బైపీసీ గ్రూపు ఉన్నచోట ఆంగ్లం పోస్టులు రద్దయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పనిచేస్తున్న వారిని సర్దుబాటు చేస్తారా? తొలగిస్తారా? అన్న దానిపై స్పష్టత కొరవడింది. ఒక కేజీబీవీలో ప్రిన్సిపల్‌, పీఈటీ, నాలుగు పీజీటీ, ఏడు సీఆర్టీ పోస్టులు మాత్రమే ఉంటాయి. సీఆర్టీలతోనే పీజీటీ తెలుగు, బైపీసీలో ఏదో సబ్జెక్టు చెప్పించేలా ప్రణాళిక రూపొందించినట్లు ప్రచారం జరుగుతోంది.


దళారులను నమ్మొద్దు

- బి.లింగేశ్వరరెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి

ప్రకటన కోసం apkgbv.apcfss.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలి. పోస్టుల భర్తీ పారదర్శకంగా జరుగుతుంది. నిబంధనల ప్రకారం మెరిట్‌ ప్రాతిపదికన ఎంపికలుంటాయి. దళారులను నమ్మి మోసపోవద్దు. డబ్బులు ఇస్తే ఉద్యోగం ఇప్పిస్తామని ఎవరైనా చెబితే తన దృష్టికి తీసుకురావాలి. సందేహాలుంటే 08922-276404, 14400 టోల్‌ఫ్రీ నంబర్లను సంప్రదించవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని