logo

నకిలీ వ్యాపార సంస్థలపై నిఘా

నకిలీ వ్యాపార సంస్థలు, పన్ను ఎగవేతదారులపై ప్రత్యేక నిఘా పెట్టామని, వాణిజ్య పన్నుల శాఖ విజయనగరం డివిజన్‌ జేడీ బి.నాగార్జునరావు తెలిపారు.

Published : 02 Jun 2023 03:12 IST

‘న్యూస్‌టుడే’తో వాణిజ్య పన్నుల శాఖ జేడీ

విజయనగరం పట్టణం, న్యూస్‌టుడే: నకిలీ వ్యాపార సంస్థలు, పన్ను ఎగవేతదారులపై ప్రత్యేక నిఘా పెట్టామని, వాణిజ్య పన్నుల శాఖ విజయనగరం డివిజన్‌ జేడీ బి.నాగార్జునరావు తెలిపారు. డివిజన్‌ పరిధిలో విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాలు ఉన్నాయని కేంద్రం ఆదేశాల మేరకు ఇటీవల తనిఖీలు ప్రారంభించామని చెప్పారు. ఆయన ‘న్యూస్‌టుడే’ ముఖాముఖిలో పలు విషయాలను వెల్లడించారు.

తనిఖీలు ప్రారంభం

డివిజన్‌ పరిధిలోని 24 వ్యాపార సంస్థల్లో తనిఖీలు చేపట్టాలని విజయవాడ కమిషనరేట్‌ నుంచి ఆదేశాలు వచ్చాయి. ఇందులో శ్రీకాకుళంలో ఎనిమిది, నరసన్నపేటలో ఆరు, ఆమదాలవలసలో మూడు, విజయనగరం దక్షిణ సర్కిల్‌ పరిధిలో మూడు, పశ్చిమ సర్కిల్‌లో రెండు, విజయనగరం తూర్పులో ఒకటి, కాశీబుగ్గలో ఒకటి చొప్పున ఉన్నాయి. ఈనెల 15 నుంచి తనిఖీలు ప్రారంభించాం. ఇప్పటికే రెండు సంస్థల్లో దస్త్రాలను చూశాం. జులై 15 వరకు ప్రక్రియ సాగనుంది.

లక్ష్యం రూ.775.24 కోట్లు

మూడు జిల్లాల్లో వాణిజ్య పన్నుల వసూళ్ల లక్ష్యం ఈ ఆర్థిక ఏడాదిలో రూ.775.24 కోట్లు ఉంది. గతేడాది రూ.792.73 కోట్లకు గానూ రూ.562.94 కోట్లు వచ్చాయి. అంటే 17.9 శాతం వృద్ధి రేటు సాధించాం. ఈసారి 37 శాతానికి చేరాలని ఆదేశించారు. ఆదాయానికి గండి పడకుండా సిబ్బందిని అప్రమత్తం చేశాం. ఎప్పటికప్పుడు తనిఖీలు జరుగుతాయి.

సిబ్బంది నియామకం

అన్ని డివిజన్లు, సర్కిళ్లలో పూర్తిస్థాయిలో అధికారులు, సిబ్బందిని నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. హేతుబద్ధీకరణ ద్వారా భర్తీ చేయనున్నాం. ఇటీవల విజయనగరం జిల్లాలో కారుణ్య నియామకాల కింద 15 మందిని నియమించాం. శ్రీకాకుళంలోనూ 12 మంది చేరనున్నారు.

పాత బకాయిలపై దృష్టి

వర్క్స్‌ కాంట్రాక్టు ద్వారా ఏడాదికి రూ.30 కోట్ల నుంచి రూ.40 కోట్లు వస్తున్నాయి. గతేడాది రూ.5 కోట్ల వరకు బకాయిలున్నాయి. వాటి వసూళ్లపై దృష్టి సారించాం. కొత్త ప్రాజెక్టులు మొదలైతే ఆదాయం పెరుగుతుందని భావిస్తున్నాం. ప్రభుత్వ పరిధిలో చేసే పనులకు 12 శాతం, ప్రైవేటు పరంగా అయితే 18 శాతం జీఎస్టీ చెల్లించాలి. సకాలంలో కట్టకపోతే వడ్డీ భారం తప్పదు. వృత్తి పన్ను కూడా కట్టాల్సిందే.

బిల్లులు తప్పనిసరి

పన్ను ఎగవేతకు ఆస్కారం లేకుండా అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నాం. డ్యాష్‌ బోర్డు విధానం ద్వారా సంస్థల రోజు వారీ కార్యకలాపాలను పక్కాగా పరిశీలిస్తున్నాం. యజమానులంతా ప్రతి నెలా తప్పనిసరిగా రిటర్న్‌లు దాఖలు చేసే విధంగా ఆదేశిలిచ్చాం. ముందు నెల చెల్లిస్తే.. తదుపరి మాసం కట్టే వీలుండదు. దీంతో ఎప్పటికప్పుడు కట్టేందుకు ముందుకొస్తారు. ప్రతి రూ.200 కొనుగోలుపై బిల్లులు తప్పనిసరి. ఆలోపు ఉన్నా.. కొనుగోలుదారులు అడిగితే బిల్లు ఇవ్వాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని