logo

ఇకనైనా పాలన పరుగెత్తేనా?

మండల పరిషత్తు కార్యాలయాల్లో అభివృద్ధి అధికారుల కొరత ఎట్టకేలకు తీరింది. ఈవోపీఆర్డీలు, పరిపాలనాధికారులకు ఉద్యోగోన్నతులు కల్పించడంతో పరిషత్తులకు పూర్తిస్థాయి అధికారులొచ్చారు.

Published : 03 Jun 2023 03:39 IST

ఎట్టకేలకు ఎంపీడీవోల నియామకం

విజయనగరం అర్బన్‌, న్యూస్‌టుడే: మండల పరిషత్తు కార్యాలయాల్లో అభివృద్ధి అధికారుల కొరత ఎట్టకేలకు తీరింది. ఈవోపీఆర్డీలు, పరిపాలనాధికారులకు ఉద్యోగోన్నతులు కల్పించడంతో పరిషత్తులకు పూర్తిస్థాయి అధికారులొచ్చారు. ఉమ్మడి జిల్లాలో శుక్రవారం 11 మందికి ఉద్యోగోన్నతులు లభించాయి. విజయనగరంలో ఏడుగురు, మన్యంలో నలుగురు ఉన్నారు. కొందరు విశాఖ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ జిల్లాల నుంచి వచ్చారు.

ఇంతకాలం.. ఇన్‌ఛార్జులతోనే..

మండల స్థాయిలో ప్రజలు, ప్రజాప్రతినిధులను సమన్వయం చేయడంలో ఎంపీడీవోల పాత్ర కీలకం. జడ్పీ ఆధీనంలో ఉండే పరిషత్తులను కొంతకాలంగా అధికారుల కొరత వేధిస్తోంది. ఖాళీల్లో ఇన్‌ఛార్జులుగా నియమితులైన వారు రెండు మండలాల్లో తిరగాల్సి వచ్చేది. దీంతో విధులపై ప్రత్యేక దృష్టి సారించలేని పరిస్థితి నెలకొనేది. రెండు జిల్లాల్లో 42 మండలాలకు 18 మంది ఎంపీడీవోలు మాత్రమే ఉండేవారు. మరో అయిదుగురు ఫౌండేషన్‌ కోర్సు శిక్షణకు వెళ్లారు. 11 ప్రాంతాల్లో విస్తరణాధికారులు, పరిపాలనాధికారులు ఇన్‌ఛార్జులుగా వ్యవహరించేవారు. ప్రస్తుతం ఉద్యోగోన్నతులు రావడంతో ఆయా మండలాలకు పూర్తిస్థాయిలో అధికారులు విధుల్లో చేరనున్నట్లు జడ్పీ సీఈవో ఎం.అశోక్‌కుమార్‌ తెలిపారు. విజయనగరం జిల్లాకు సంబంధించి నియామకం జరిగిందని, మన్యంలో ఇంకా ప్రక్రియ సాగుతోందని చెప్పారు.

పరిష్కారమయ్యేనా..

సంక్షేమ కార్యక్రమాల అమల్లో భాగంగా లబ్ధిదారుల గుర్తింపు నుంచి మంజూరు వరకు ఎంపీడీవోలే పర్యవేక్షించాలి. ప్రజలకు పథకాలు అందించడంలో క్షేత్రస్థాయి అధికారుల ద్వారా సమన్వయంతో ముందుకెళ్లాల్సి ఉంది. ఇళ్లు, పింఛన్లు, అమ్మఒడి తదితర సంక్షేమ పథకాల్లో అర్హులైనా కొందరికి అందడం లేదని ఫిర్యాదులుఉన్నాయి. వీటిని పరిష్కరించడంతో పాటు, ఉపాధి భాగస్వామ్య నిధులతో చేపడుతున్న భవన నిర్మాణాలు, జల్‌జీవన్‌ మిషన్‌ పనులు, ఫ్యామిలీ డాక్టర్‌ వంటి కార్యక్రమాల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. పూర్తిస్థాయిలో అధికారులు రావడంతో ఇప్పటికైనా ప్రగతి  కనిపిస్తుందని భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని