logo

ప్రతిభ ఉంటే.. ఉపకారం మీదే!

చదువులో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ.. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం సరోజని దామోదర్‌ ఫౌండేషన్‌ విద్యాదాన్‌ ఉపకార వేతనం అందిస్తోంది.

Published : 03 Jun 2023 03:39 IST

దరఖాస్తుకు జూన్‌ 15 వరకు గడువు

పార్వతీపురం పట్టణం, న్యూస్‌టుడే: చదువులో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ.. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం సరోజని దామోదర్‌ ఫౌండేషన్‌ విద్యాదాన్‌ ఉపకార వేతనం అందిస్తోంది. కళాశాల విద్యలో సత్తా చాటేవారికి ఈ సాయం వరంలా మారనుంది. 2016లో ఈ పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటక, గోవా, ఒడిశా రాష్ట్రాల్లో అమలవుతోంది. ఇంటర్మీడియట్‌లో రెండేళ్లతో పాటు డిగ్రీలో విద్యార్థులు ఎంచుకున్న కోర్సు ఆధారంగా ఏడాదికి రూ.10 వేల నుంచి రూ.60 వేల వరకు అందజేస్తారు.

జిల్లాలోని 52 కళాశాలల్లో..

జిల్లాలో ఇంటర్‌ ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు 37 వరకు ఉన్నాయి. ప్రథమ, ద్వితీయ ఏడాది విద్యార్థులు 20 వేల మంది, బయట జిల్లాల్లో చదువుతున్న వారు మరో 10 వేల మంది వరకు ఉంటున్నారు. డిగ్రీ కళాశాలలు 15 ఉండగా.. వాటిల్లో 20 వేల మంది వరకు విద్యనభ్యసిస్తున్నారు. వీరిలో ఉత్తమ ప్రతిభ చూపించే విద్యార్థులు ఉపకార వేతనం పొందొచ్చని పార్వతీపురంలోని ఎస్వీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ చలపతిరావు ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.

ఎప్పుడు చేయాలంటే....

విద్యాదాన్‌ ఉపకార వేతనం కోసం ఈ నెల 15 లోగా దరఖాస్తు చేసుకోవాలి. జులై 2న ఆన్‌లైన్‌ పరీక్ష ఉంటుంది. దరఖాస్తుదారులు పదో తరగతి మార్కుల జాబితా, పాస్‌పోర్టు సైజ్‌ ఫోటో, ఈ ఏడాది తీసుకున్న ఆదాయ ధ్రువపత్రం, చదువుతున్న కళాశాల వివరాలు పొందుపర్చాలి. ఆన్‌లైన్లో నమోదు చేసుకునే వారు వ్యక్తిగతంగా సొంత ఈ మెయిల్‌ కలిగి ఉండాలి. మరిన్ని వివరాల కోసం సోమవారం నుంచి శనివారం మధ్య ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల మధ్య విద్యాదాన్‌.ఆంధ్ర.ఎస్‌డీఫౌండేషన్‌.ఓఆర్జీని సంప్రదించాలి.


వీరు అర్హులు.. ఈ ఉపకార వేతనం పొందాలంటే విద్యార్థి కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.2 లక్షలలోపు ఉండాలి. 2022-23 విద్యా సంవత్సరంలో పది ఉత్తీర్ణత సాధించి ఇంటర్మీడియట్‌ చదువుతున్న వారు అర్హులు. పదిలో కనీసం 90 శాతం మార్కులు లేదా 9 శాతం సీజీపీఏ సాధించి ఉండాలి. దివ్యాంగులైతే 75 శాతం మార్కులు లేదా 7.5 సీజీపీఏ తప్పనిసరి.


ఎంపిక విధానం.. చదువులో చూపిన ప్రతిభ, ధ్రువపత్రంలో తెలిపిన సమాచారం ఆధారంగా ఎంపిక చేస్తారు. వీరికి ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహిస్తారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఈ మెయిల్‌ ద్వారా సమాచారం తెలియజేస్తారు.


మంచి అవకాశం.. ప్రతిభ ఉండి ఉన్నత చదువులు చదవాలి అనుకునే పేద విద్యార్థులకు విద్యాదాన్‌ ఉపకార వేతనాలు వరం లాంటివి. ప్రతిభా వంతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

ఆకుల రాజు, ప్రిన్సిపల్‌, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, పార్వతీపురం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని