logo

జ్వరంతో ప్రాణాలొదిలిన వివాహిత

వివాహమై ఆరు నెలలైంది. కాపురం సక్రమంగా సాగుతున్న తరుణంలో ఆ వివాహిత జ్వరంతో మృతి చెందింది. ఈ ఘటన మండలంలో జరిగింది.

Updated : 18 Sep 2023 06:24 IST

తులసి (పాతచిత్రం)

గుమ్మలక్ష్మీపురం, న్యూస్‌టుడే: వివాహమై ఆరు నెలలైంది. కాపురం సక్రమంగా సాగుతున్న తరుణంలో ఆ వివాహిత జ్వరంతో మృతి చెందింది. ఈ ఘటన మండలంలో జరిగింది. ఒడిశా రాష్ట్రం కటికి గ్రామానికి చెందిన తులసి(24)కి జ్వరం రావడంతో ఆర్‌ఎంపీ వైద్యులకు చూపించారు. మలేరియా నిర్ధారణ కావడంతో మందులు వాడుతున్నారు. శనివారం అర్ధరాత్రి గట్టిగా కేకలు వేయడంతో భర్త రవికుమార్‌ ఆదివారం కురుపాం మండలం నీలకంఠాపురం పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడ నుంచి భద్రగిరి సీహెచ్‌సీకి తీసుకెళ్లేసరికి మృతి చెందినట్లు వైద్యులు రాజన్‌ తెలిపారు.

పోస్టుమార్టం చేయాలని..: ఒడిశా ప్రాంతం హడియాకు చెందిన వత్యుస్‌ సాహు, దమయంతిల కుమార్తె తులసికి కటికి చెందిన రవికుమార్‌కు ఇచ్చి ఆరునెలల క్రితం వివాహం చేశారు. జ్వరం బారిన పడినట్లు తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో రామన్నగూడ తీసుకురావాలని సూచించారు. కానీ తీసుకురాకుండా ఆంధ్రాలోని ఆసుపత్రికి తీసుకెళ్లారని, మృతిపై బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోస్టుమార్టం చేయాల్సిందేనని పట్టుబట్టారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.


చికిత్స పొందుతూ వృద్ధురాలు..

కొత్తవలస, న్యూస్‌టుడే: విశాఖ-అరకు రహదారిలోని కొత్తవలస రైల్వే స్టేషన్‌ వద్ద ఈనెల 14న రహదారి ప్రమాదంలో తీవ్రంగా గాయపడి విశాఖపట్నం కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న పట్టణానికి చెందిన వృద్ధురాలు కుంచం నర్సుమాంబ(64) ఆదివారం ఉదయం మృతి చెందినట్లు ఏఎస్సై పైడి రాజులు తెలిపారు. ఈమె భర్త విశ్వేశ్వరరావుతో కలిసి ద్విచక్ర వాహనంపై కూడలి నుంచి ఇంటికి వెళుతుండగా వెనుక నుంచి ఆటో ఢీకొనడంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ఈక్రమంలో కేజీహెచ్‌లో చేరిన నర్సుమాంబ మృతి చెందడంతో ఏఎస్సై అక్కడికి వెళ్లి శవ పంచనామ నిర్వహించి పోస్టుమార్టం చేయించారు. ఈమె భర్త విశ్వేశ్వరరావు అక్కడే చికిత్స పొందుతున్నారని ఆయన చెప్పారు.


కాలువలో పడి రైతు మృతి

జగన్మోహనరావు (పాతచిత్రం)

బాడంగి, న్యూస్‌టుడే: ప్రమాదవశాత్తు కాలువలో జారిపడి ఓ రైతు మృతి చెందిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై ఆర్‌.జయంతి తెలిపిన వివరాల ప్రకారం..  జీకేఆర్‌.పురానికి చెందిన  గొట్టాపు జగన్మోహనరావు(47) బొబ్బిలిలోని పూల్‌బాగ్‌ కాలనీలో భార్య రాధ, పిల్లలు సహన, నిర్మిషతో నివాసం ఉంటున్నారు. వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వినాయక చవితి నేపథ్యంలో ఈనెల 16న స్వగ్రామానికి వచ్చారు. కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఆదివారం గ్రామ సరిహద్దుల్లోని తోటపల్లి కాలువ వద్దకు వెళ్లారు. ఎప్పటికీ రాకపోవడంతో బంధువులు వెళ్లి పరిశీలించగా.. కాలువలో విగతజీవిగా కనిపించాడు. పంచనామా నిమిత్తం బాడంగి సీహెచ్‌సీకి తరలించినట్లు ఎస్సై తెలిపారు. ఈత రాకపోవడంతో ప్రమాదవశాత్తు చనిపోయారని ఆయన భార్య ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.


రైలు ఢీకొని చోదకుడి మృత్యువాత

నరేష్‌ (పాతచిత్రం)

కొమరాడ, పార్వతీపురం గ్రామీణం, న్యూస్‌టుడే: పార్వతీపురం మండలంలోని నర్సిపురం రైల్వే గేటు సమీపంలో పట్టాలు దాటుతుండగా గుర్తు తెలియని రైలు ఢీకొని స్థానికుడు తాబేలు నరేష్‌ (30) మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. రైల్వే పోలీసుల వివరాల మేరకు.. నర్సిపురం గ్రామానికి చెందిన నరేష్‌ ట్రాక్టర్‌ చోదకుడిగా పని చేస్తున్నాడు. ఆదివారం ఉదయం బీసీ కాలనీ నుంచి వస్తుండగా గుర్తు తెలియని రైలు ఢీకొట్టింది. అక్కడికక్కడే మృతి చెందగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఈయన తండ్రి ఇటీవల మృతి చెందాడు. ఇప్పుడు కుమారుడు కూడా ప్రాణాలు కోల్పోవడంతో తల్లి సింహాచలం బోరున విలపిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని