logo

కిలాడి లేడి.. కిడ్నాప్‌ సూత్రధారి

ఆర్థికంగా స్థితివంతుడైన అతడి నుంచి పెద్ద మొత్తంలో వసూళ్లు చేసి సొమ్ము చేసుకోవాలనే తలంపుతో మాజీ ప్రియుడిని కిడ్నాప్‌ చేయించిన కిలా(లే)డి. ఆమె దర్శకత్వంలో నాటకీయ పరిణామాల మధ్య జరిగిన

Updated : 28 Jan 2022 12:15 IST

పోలీసుల అదుపులో ఏడుగురు నిందితులు?

నర్సంపేట, న్యూస్‌టుడే: ఆర్థికంగా స్థితివంతుడైన అతడి నుంచి పెద్ద మొత్తంలో వసూళ్లు చేసి సొమ్ము చేసుకోవాలనే తలంపుతో మాజీ ప్రియుడిని కిడ్నాప్‌ చేయించిన కిలా(లే)డి. ఆమె దర్శకత్వంలో నాటకీయ పరిణామాల మధ్య జరిగిన ఈ ఉదంతం నర్సంపేట ప్రాంతంలో సంచలనం రేపింది. నర్సంపేట పరిధిలోని కమలాపురం గ్రామానికి చెందిన ముత్యం శ్రీనివాస్‌ అనే మద్యం వ్యాపారి కిడ్నాప్‌నకు గురయిన విషయం విధితమే. విశ్వసనీయ సమాచారం మేరకు పట్టణంలో గిరిగిరి(రోజు వారీ ఫైనాన్స్‌)కూడా నడిపే శ్రీనివాస్‌కు మాధన్నపేట రోడ్డులో బజ్జీల కొట్టు నడిపే ఓ వివాహితతో పరిచయమైంది. రోజువారీ ఫైనాన్స్‌ తీసుకోవడంతో వాటి వసూళ్ల కోసం శ్రీనివాస్‌ నిత్యం ఆమె కొట్టుకు వెళ్లేవాడు. అలా వారి మధ్య ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. కొంత కాలంగా వీరి మధ్య ఏర్పడిన తగాదాలు పోలీసుస్టేషన్‌ వరకు వెళ్లాయి. ‘నీ కారణంగా నా భర్త మమ్ముల్ని వదిలేసి వెళ్లాడు. నా కుటుంబం ఆగమైంది మేమెలా బతకడం’ అంటూ ఆమె శ్రీనివాస్‌ను నిలదీయడమేగాక పోలీసులకు ఫిర్యాదు చేయగా అరెస్టు చేశారు. తరువాత కొందరు పెద్దల సమక్షంలో శ్రీనివాస్‌ నుంచి రూ.4లక్షలు ఇప్పించి, ఇకముందు ఎలాంటి సంబంధం లేదని దస్తావేజు రాయించుకొని నోటరీ చేయించుకున్నారు. ఆయితే ఆమె అతడి నుంచి పెద్ద మొత్తంలో నగదు వసూలు చేసుకునేందుకు వ్యూహం రచించింది. ఖానాపురం మండలానికి చెందిన అనిల్‌ అనే యువకుడితో కలిసి కిడ్నాపు పథకం వేసింది. అతడు తనకు తెలిసిన వారితో కలిసి ముఠాగా ఏర్పడి మాధన్నపేట చెరువు పెద్ద కిడ్నాప్‌ చేశారు. శ్రీనివాస్‌ తప్పించుకునే ప్రయత్నం చేస్తుండగా గట్టిగా బంధించి ముఖానికి ముసుగువేసి కారులో తీసుకెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాగా కిడ్నాపర్లు శ్రీనివాస్‌ను కొత్తగూడ మండలం గుంజేడు వైపు తీసుకెళ్లినట్లు తెలిసింది. అక్కడ రూ.20లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేయగా నా వద్ద డబ్బుల్లేవు ఇవ్వనని చెప్పడంతో కొట్టడమేగాక రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇంతలోనే శ్రీనివాస్‌ చరవాణికి నర్సంపేట సీఐ, ఎస్సై నుంచి కాల్స్‌ వెళ్లడంతో పోలీసులకు తెలిసిందని వచ్చిన వారిలో ఇద్దరు కారు తీసుకొని వెళ్లినట్లు తెలిసింది. అనిల్‌, మరికొందరు బెదిరించి గుంజేడులో మహిళకు, శ్రీనివాస్‌కు దండలు మార్పించి మళ్లీ కారులో తీసుకొచ్చి నర్సంపేట పట్టణంలోని ఆమె అద్దె ఇంటి వద్ద దించి వెళ్లారు. కారులో పారిపోయిన ఇద్దరి వద్ద శ్రీనివాస్‌ చరవాణి ఉండగా తిరిగి వచ్చి ఆమె ఇంట్లో పెట్టి బయట తాళం వేసి పారిపోయారు. కాగా పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం సాయంతో కిడ్నాపునకు గురైన శ్రీనివాస్‌ ఉన్న లొకేషన్‌ను గుర్తించి అతడితోపాటు కిలాడి ప్రియురాలు, మరో ఇద్దరు కిడ్నాపర్లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. ఈ కిడ్నాపులో మరో మహిళ ప్రమేయమున్నట్లు పోలీసులు గుర్తించారని తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని