logo

TS News: కరక్కాయ బెల్లం దంచెయ్‌.. ఆలయాన్ని కట్టెయ్‌!

రాజులు కట్టిన కోటలు, ప్రాచీన కాలంలో నిర్మించిన అద్భుతమైన ఆలయాలు వేల ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్నాయి. అందుకు కారణం బండరాళ్లే కాదు.. దృఢమైన ఆ రాళ్లు శతాబ్దాల తరబడి విడిపోకుండా అతుక్కుని

Updated : 28 Jan 2022 11:27 IST

 ప్రాచీన కట్టడాల నిర్మాణానికి డంగు సున్నం తయారీ

ఈనాడు, వరంగల్‌: రాజులు కట్టిన కోటలు, ప్రాచీన కాలంలో నిర్మించిన అద్భుతమైన ఆలయాలు వేల ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్నాయి. అందుకు కారణం బండరాళ్లే కాదు.. దృఢమైన ఆ రాళ్లు శతాబ్దాల తరబడి విడిపోకుండా అతుక్కుని ఉండేందుకు దోహదపడిన డంగు సున్నం కూడా. దీని స్థానంలో సిమెంటు వచ్చినా జీవితకాలం వందేళ్లలోపే. అందుకే ప్రాచీన ఆలయాల పునర్నిర్మాణంలో మన పూర్వీకులు చేసిన విధానంలోనే డంగు సున్నాన్ని ఇప్పుడు ఓపిగ్గా తయారుచేస్తూ ప్రాచీన వైభవానికి సొబగులు అద్దుతున్నారు.

* యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయం ప్రహరీ నిర్మాణానికి డంగు సున్నామే వినియోగించారు. కేంద్ర పురావస్తు శాఖ పునర్నిర్మాణం చేపడుతున్న వరంగల్‌ కోట కట్టడాలు, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న యాదాద్రి ఆలయ నిర్మాణం, జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్‌ కోట పునర్నిర్మాణం కోసం కూడా దీన్ని నిర్మాణ ప్రాంతాల్లోనే తయారుచేస్తూ కట్టడాలకు ప్రాణం పోస్తున్నారు.

ప్రాచీన కాలం తరహాలోనే: డంగు సున్నాన్ని ఇప్పటికీ పాత కాలం నాటి పద్ధతిలోనే తయారుచేస్తున్నారు. అప్పుడు ఎడ్లను ఉపయోగిస్తే ఇప్పుడు చిన్నపాటి యంత్రాలను వాడుతున్నారు. ప్రస్తుతం ఖిలాషాపూర్‌ కోటకు కావాల్సిన డంగు సున్నం తయారీకి కరక్కాయలను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం శ్రీకాకుళం నుంచి తెప్పించారు. యాదాద్రి ఆలయాన్ని కట్టిన శిల్పులే ఈ కోటను నిర్మిస్తున్నారు.

సులువుగా చేసేందుకు మరిన్ని పరిశోధనలు

వరంగల్‌ ఎన్‌ఐటీలో గతేడాది ‘డంగు సున్నం’ పునఃసృష్టించారు. సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి చెందిన ఆచార్య రతీశ్‌కుమార్‌, పరిశోధక విద్యార్థి నిఖిల్‌ కుమార్‌తో కలిపి ప్రయోగశాలలో తయారుచేశారు. లైమ్‌ మోర్టార్‌గా పేరు పెట్టారు. రామప్ప ఆలయ నిర్మాణంలో డంగు సున్నాన్ని వాడడం వల్లే చెక్కు చెదరకుండా ఉందని తేల్చారు. వీరి పరిశోధన ‘జర్నల్‌ ఆఫ్‌ ఆర్కియాలజికల్‌ సైన్స్‌’లో ప్రచురితమైంది. కాలం గడిచే కొద్దీ డంగు సున్నం మరింత దృఢమవుతుందని.. అయోధ్య రామాలయం నిర్మాణంలో సిమెంటు బ్లాకులకు బదులు రాళ్లను అతికించేందుకు డంగు సున్నం వాడాలని ఆలయ కమిటీకి తెలియజేశామని విశ్రాంత జియో ఇంజినీరు, కాకతీయ హెరిటేజ్‌ ట్రస్టు సభ్యుడు ఆచార్య పాండురంగారావు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని