logo

ఆదివాసీలు వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో ఎదగాలి

గిరిజనులు వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో ఎదగాలని ఐటీడీఏ ఏపీవో వసంతరావు జాదవ్‌ సూచించారు. ఏటూరునాగారం ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం గిరిజన పారిశ్రామిక

Published : 21 May 2022 01:50 IST

మాట్లాడుతున్న ఐటీడీఏ ఏపీవో వసంతరావు జాదవ్‌

ఏటూరునాగారం, న్యూస్‌టుడే: గిరిజనులు వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో ఎదగాలని ఐటీడీఏ ఏపీవో వసంతరావు జాదవ్‌ సూచించారు. ఏటూరునాగారం ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం గిరిజన పారిశ్రామిక వేత్తలు, వ్యాపారుల ఎంపిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ట్రైబల్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, వీ హబ్‌ సంస్థలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి. అడవి బిడ్డలు అడవులకే పరిమితం కాకుండా వారిని ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా, వ్యాపారులుగా తీర్చిదిద్ది ఆర్థికంగా ఉన్నత స్థాయికి ఎదిగేలా చర్యలు తీసుకోవాలనే సంకల్పంతో ఈ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా ఎంపిక కార్యక్రమాన్ని చేపట్టింది. ములుగు జిల్లా నుంచి 171 మంది, భూపాలపల్లి 45, మహబూబాబాద్‌ 105, వరంగల్‌, హనుమకొండ, జనగామ జిల్లాల నుంచి 20 మంది చొప్పున మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 340 మంది లబ్ధిదారులు హాజరయ్యారు. ఇప్పటికే వివిధ వ్యాపారాలు చేస్తున్న, చిన్న, మధ్య తరహా, కుటీర పరిశ్రమలు నిర్వహిస్తున్న పారిశ్రామిక వేత్తలను ఇందులో ఎంపిక చేయనున్నారు. వీరికి పరిశ్రమ, వ్యాపారం ఎలా అభివృద్ధిలోకి తీసుకెళ్లాలి, మార్కెట్‌ వసతులను ఎలా అభివృద్ధి చేసుకోవాలి వంటి అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు ఐటీడీఏల నుంచి ఎంపికైన అభ్యర్థులకు వరంగల్‌ వైటీసీలో గాని, హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని వీ హబ్‌ కేంద్రంలో గాని శిక్షణ అందిస్తారు. శిక్షణ తర్వాత స్థానిక బ్యాంకులు, ట్రైకార్‌ సంస్థ నుంచి ఆర్థిక సాయాన్ని సైతం అందేలా చూస్తారు. ముఖ్య అతిథిగా ఏపీవో హాజరై మాట్లాడారు. ప్రభుత్వ ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని సూచించారు. జిల్లా పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల లీడ్‌ బ్యాంకు మేనేజర్లు లక్ష్మణ్‌, శ్రీనివాస్‌, వీ హబ్‌ ప్రోగ్రాం మేనేజర్‌ తరుణ్‌, కోఆర్డినేటర్‌ అన్నపూర్ణ, జేడీఎం కొండలరావు, జేఆర్పీలు భిక్షపతి, పాపారావు, ఐకేపీ డీపీఎం సతీష్‌, ఏపీఎంలు, సీసీలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని