logo

జనగామకు పూర్తిస్థాయి జిల్లా న్యాయస్థానం

జనగామకు పూర్తి స్థాయి జిల్లా న్యాయస్థానం మంజూరైంది. రాష్ట్రంలో కొత్త జిల్లాల ప్రాతిపదికన పూర్తిస్థాయి జిల్లా కోర్టుల ఏర్పాటుకు గతంలోనే హైకోర్టు అనుమతి మంజూరు చేయగా, తాజాగా గురువారం రాష్ట్ర

Published : 21 May 2022 01:50 IST

జూన్‌ 2న ప్రారంభం

న్యూస్‌టుడే, జనగామటౌన్‌

జనగామకు పూర్తి స్థాయి జిల్లా న్యాయస్థానం మంజూరైంది. రాష్ట్రంలో కొత్త జిల్లాల ప్రాతిపదికన పూర్తిస్థాయి జిల్లా కోర్టుల ఏర్పాటుకు గతంలోనే హైకోర్టు అనుమతి మంజూరు చేయగా, తాజాగా గురువారం రాష్ట్ర హోంశాఖ కొత్త జిల్లాల వారీగా పూర్తిస్థాయి జిల్లా న్యాయస్థానాలను మంజూరు చేస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీంతో ఇన్నాళ్లు ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరిధిలో ఉన్న న్యాయస్థానమే జనగామకు కూడా జిల్లా న్యాయస్థానంగా కొనసాగింది. జనగామకు ప్రత్యేకంగా పూర్తిస్థాయి జిల్లా న్యాయస్థానం మంజూరు కావడం.. జూన్‌ 2 నుంచి ఇక్కడే కోర్టు కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి.

జూనియర్‌ సివిల్‌ కోర్టు నుంచి..

జనగామలో గతంలో జూనియర్‌ సివిల్‌ కోర్టు, సబ్‌ కోర్టు, ఏడీఎం కోర్టులు ఏర్పాటయ్యాయి. ఆ తర్వాత ఐదున్నరేళ్ల క్రితం కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా జనగామ జిల్లాగా ఆవిర్భవించింది. చిన్న జిల్లాల్లో తొలుత న్యాయశాఖ పూర్తిస్థాయి జిల్లా కోర్టులను ఏర్పాటు చేయకుండా జనగామలో ఐదో అదనపు న్యాయస్థానాన్ని, ఆ తర్వాత పోక్సో కోర్టును ఏర్పాటు చేసింది. అయితే కొత్త జిల్లాల్లో కూడా పూర్తిస్థాయి జిల్లా కోర్టులను ఏర్పాటు చేయాలని న్యాయ నిపుణులు ప్రభుత్వానికి విన్నవించడంతో ప్రభుత్వ సూచనలు, హైకోర్టు అనుమతితో కొత్త జిల్లాల్లో కూడా పూర్తిస్థాయి జిల్లా కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా జ్యుడీషియల్‌ సేవలను విస్తరిస్తూ అన్ని జిల్లాల్లో పూర్తిస్థాయి జిల్లా కోర్టులను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర హోంశాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీంతో కొత్త జిల్లాల వరుసలో ఉన్న జనగామలో కూడా పూర్తిస్థాయి జిల్లా కోర్టు రానుంది.

ఉమ్మడి జిల్లా న్యాయస్థానం నుంచి కేసుల బదలాయింపు

ఇన్నాళ్లూ వరంగల్‌ ఉమ్మడి జిల్లా కోర్టులో జనగామ జ్యుడీషియల్‌ కేసులకు సంబంధించి కేసులను అక్కడి నుంచి జనగామకు బదిలీ చేయనున్నారు. ఈ నెలలోనే కేసుల బదిలీ ప్రక్రియను పూర్తి చేయడానికి న్యాయాధికారులు చర్యలు తీసుకోనున్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినమైన జూన్‌ 2 నుంచి కొత్త జిల్లాల్లో పూర్తిస్థాయి జిల్లా కోర్టులు పని చేస్తాయని ప్రభుత్వం పేర్కొంది. ఇన్నాళ్లూ జిల్లాస్థాయి కోర్టు కేసులకు దూరంగా ఉన్న వరంగల్‌ ఉమ్మడి కోర్టుకు పలు కేసుల నిమిత్తం తిరిగే కక్షిదారులకు ఇకపై ఊరట లభించనుంది. జనగామ జిల్లా కోర్టుకు ప్రస్తుతం ఉన్న కోర్టు సముదాయంలోనే అందుబాటులో ఉనన భవనాన్ని కేటాయించనున్నట్లు తెలిసింది. కాగా సిద్ధిపేట రోడ్డు వైపు చంపక్‌హిల్స్‌ వద్ద జిల్లా కోర్టు శాశ్వత భవనాన్ని నిర్మించేందుకు ఇప్పటికే ప్రభుత్వం 10 ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించింది.

న్యాయసేవల్లో పురోగతి

- కూరెళ్ల శ్రీనివాస్‌రెడ్డి, బార్‌ అసోసియేషన్‌ పూర్వ అధ్యక్షుడు

జనగామకు పూర్తిస్థాయి జిల్లా కోర్టు మంజూరవడం హర్షణీయం ఎంతో కాలం నుంచి కోరుతున్నట్లుగా జిల్లా కోర్టు ఏర్పాటు కానుండటంతో కక్షిదారులకు ఇక వరంగల్‌ ఉమ్మడి కోర్టుకు వెళ్లే వ్యయ ప్రయాసలు తప్పాయి. జిల్లా కోర్టు ఏర్పాటుతో ఎస్సీ, ఎస్టీ కేసుల విచారణ, కుటుంబ తగాదాలు, ఇతర క్రిమినల్‌ కేసులను ఇక్కడే విచారించనున్నారు. జిల్లా కోర్టు ఏర్పాటు.. న్యాయసేవల్లో పురోగతిగానే చెప్పొచ్ఛు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని