logo

ఓరుగల్లు ‘పంచ్‌’కు పవరెక్కువ..!

బాక్సింగ్‌ అంటే పురుషుల ఆటగానే చూసే వారంతా మేరీకోమ్‌ విజయాలను చూసి అభిప్రాయాన్ని మార్చుకున్నారు. ఇప్పుడు ప్రపంచ మహిళల బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో తొలిసారి తెలుగు అమ్మాయి

Published : 21 May 2022 01:50 IST

ప్రోత్సహిస్తే జరీన్‌లా దూసుకొస్తారు..

న్యూస్‌టుడే, వరంగల్‌ క్రీడావిభాగం, హసన్‌పర్తి

బాక్సింగ్‌ అంటే పురుషుల ఆటగానే చూసే వారంతా మేరీకోమ్‌ విజయాలను చూసి అభిప్రాయాన్ని మార్చుకున్నారు. ఇప్పుడు ప్రపంచ మహిళల బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో తొలిసారి తెలుగు అమ్మాయి నిఖత్‌ జరీన్‌ స్వర్ణ పతకం నెగ్గి కొత్త అధ్యాయానికి నాంది పలికారు. ఈ స్ఫూర్తిని అందిపుచ్చుకొని అంతర్జాతీయ పతకాలే లక్ష్యంగా సాధనలో మరింత వేగం పెంచుతామని ఓరుగల్లు క్రీడాకారులు అంటున్నారు. నిఖత్‌ జరీన్‌ విజయం భావి బాక్సింగ్‌ క్రీడాకారులకు ముఖ్యంగా బాలికలు, మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తోంది.


పల్లె పరిమళం

వరంగల్‌ పైడిపల్లికి చెందిన తాపీ మేస్త్రీ ప్రభాకర్‌ కుమార్తె అరుంధతి. నిరుపేద కుటుంబం. పాఠశాల విద్యను మడికొండలోని ప్రభుత్వ సోషల్‌ వెల్ఫేర్‌ హాస్టల్‌లో ఉంటూ పూర్తి చేశారు. ఈ క్రమంలో కోచ్‌ శ్యాంసన్‌ వద్ద బాక్సింగ్‌ నేర్చుకున్నారు. జిల్లా, రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచి పతకాలు కైవసం చేసుకున్నారు. ఇంటర్‌లో చేరే సరికి జాతీయస్థాయి బాక్సింగ్‌లో రాణించారు. క్రీడా కోటలో కిట్స్‌ కాలేజీలో సీటు పొంది ఇంజినీరింగ్‌ను పూర్తి చేశారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు సాధించడంతో కుటుంబసభ్యులు మరింతగా ఆమెను ప్రోత్సహించారు.

* 2018 రాజస్థాన్‌, 2019 మీరట్‌లో జరిగిన ఆల్‌ ఇండియా యూనివర్సిటీ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పాల్గొని ప్రతిభ చాటారు.


తల్లి సహకారంతో..

వరంగల్‌ కాశీబుగ్గ ప్రాంతానికి చెందిన గణేష్‌ కూతురు నాగసిరి. ఇటీవల ఇంటర్మీడియెట్‌ మొదటి సంవత్సరం పూర్తి చేశారు. హనుమకొండలోని బాక్సింగ్‌ హాల్‌లో శిక్షణ తీసుకుంటున్నారు. డిగ్రీ పూర్తి చేసేలోపు అంతర్జాతీయ స్థాయి బాక్సింగ్‌ పోటీల్లో పతకం కొల్లగొట్టాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. తండ్రి వరంగల్‌ ఎనుమాముల మార్కెట్‌లో అడ్తీ పని చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు వచ్చినా కూతురును అంతర్జాతీయ స్థాయి బాక్సర్‌గా చూడాలన్నదే తల్లిదండ్రుల ఆశ. 2019 దిల్లీలో జరిగిన స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో ప్రతిభ చాటారు.

* 2021 హరియాణాలో జరిగిన జూనియర్‌ నేషనల్స్‌లో ఉత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. 2021 హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయిలో పోటీల్లో జూనియర్‌ విభాగంలో గోల్డ్‌ మెడల్‌ సాధించారు.


తండ్రి చూపిన మార్గంలో..

హసన్‌పర్తికి చెందిన శీలం తనుశ్రీ ఎల్లాపూర్‌ శివారులోని ప్రైవేట్‌ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నారు. తండ్రి శీలం పార్థసారథి ప్రభుత్వ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు. బాక్సింగ్‌లో జాతీయ స్థాయిలో పతకం సాధించారు. స్థానికంగా బాక్సింగ్‌లో శిక్షణ ఇస్తున్నారు. తన కుమార్తె తనుశ్రీని కూడా బాక్సింగ్‌ రింగ్‌లో దింపారు. ఆమె జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నారు.

* ఈ నెల 3న హనుమకొండ జేఎన్‌ఎస్‌లో నిర్వహించిన జిల్లాస్థాయి బాక్సింగ్‌ పోటీలో బంగారు పతకాన్ని సాధించారు. 5 నుంచి 8వ తేదీ వరకు హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి బాక్సింగ్‌ పోటీల్లో తృతీయ స్థానంలో నిలిచారు.


మహిళా బాక్సర్లను తీర్చిదిద్దడమే లక్ష్యం

జనగామకు చెందిన కృష్ణ కూతురు దీపిక. తండ్రి ప్రైవేటు ఉద్యోగం చేస్తూ దీపికను మడికొండ సోషల్‌ వెల్ఫేర్‌ హాస్టల్‌లో చేర్పించారు. అక్కడి శిక్షకుడు శ్యాంసన్‌ వద్ద బాక్సింగ్‌లో శిక్షణ పొందారు. 2014 గ్వాలియర్‌లో జరిగిన అండర్‌-19 ఎస్‌జీఎఫ్‌ పోటీల్లో ప్రతిభ చూపారు. 2014 హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో పసిడి పతకం, 2017 పంజాబ్‌లో జరిగిన సీనియర్‌ నేషనల్‌ బాక్సింగ్‌ పోటీల్లో రాణించారు. 2019 రాజస్థాన్‌లో జరిగిన ఆల్‌ ఇండియా యూనివర్సిటీ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో ప్రతిభ చూపారు. బాక్సింగ్‌లో బాలికలకు ప్రత్యేకంగా శిక్షకులు లేరు. ఆ లోటును భర్తీ చేసి వరంగల్‌ నుంచి నిఖత్‌ జరీన్‌లా దేశం గర్వించదగ్గ మహిళా బాక్సర్లను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.


ఇష్టంతో ముందుకు

ఐనవోలు మండలం వెంకటాపూర్‌కు చెందిన కె.కావ్యకు బాక్సింగ్‌ అంటే ఇష్టం. స్థానిక పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతూ వ్యాయామ ఉపాధ్యాయుడు శీలం పార్థసారథి వద్ద శిక్షణ పొందుతున్నారు. తల్లిదండ్రులు రాజు, లక్ష్మిది వ్యవసాయ కుటుంబం. వీరికి ముగ్గురు ఆడపిల్లలు. చిన్న కుమార్తె కావ్య 2020లో జిల్లాస్థాయి బాక్సింగ్‌ పోటీలో బంగారు పతకాన్ని గెలుచుకున్నారు. అదే ఏడాదిలో రాష్ట్ర స్థాయి పోటీల్లో సత్తా చాటి జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. ఈ నెల 5నుంచి 8 వరకు హైదరాబాద్‌ మల్కాజిగిరిలో జరిగిన రాష్ట్రస్థాయి ఛాంపియన్‌సిప్‌లో ప్రతిభను చాటారు.


ప్రతిభను చాటుతూ..

ఐనవోలు మండలం వెంకటాపూర్‌కు చెందిన మంచాల మేఘన తండ్రి రాజు ట్రాక్టరు డ్రైవర్‌ గా పనిచేస్తున్నారు. తల్లి మల్లికాంబ గృహిణి. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. పెద్ద కుమార్తె మేఘన గ్రామంలోని ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. 2020లో జిల్లాస్థాయిలో బంగారు పతకాన్ని పొందారు.


విద్యార్థుల ఆసక్తి

ధర్మసాగర్‌: వరంగల్‌ జిల్లా స్పోర్ట్స్‌ అథారిటీ ఆధ్వర్యంలో ధర్మసాగర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో నిర్వహిస్తున్న బాక్సింగ్‌ ఉచిత శిక్షణకు విద్యార్థులు ఎక్కువగా హాజరవుతున్నారు. కోచ్‌ మర్రిపెల్లి ప్రవీణ్‌ వీరికి శిక్షణ ఇస్తున్నారు.


ప్రభుత్వం దృష్టి సారించాలి..

బాక్సింగ్‌కు ప్రభుత్వ పరంగా మరింత ప్రోత్సాహం అవసరం. హనుమకొండ జిల్లా యువజన, క్రీడలశాఖ ఆధ్వర్యంలో ఉన్న బాక్సింగ్‌ హాల్‌ శిథిలావస్థకు చేరుకుంది. ఇందులో కనీస వసతులు లేకపోయినా క్రీడాకారులు సర్దుకుపోతున్నారు. జిల్లా క్రీడలశాఖ తరఫున పూర్తిస్థాయిలో శిక్షకులను కేటాయించాలి. ప్రస్తుతం వేసవి శిక్షణ శిబిరానికి సుమారు 30 మంది బాలబాలికలు హాజరవుతున్నారు. ప్రపంచ మహిళల బాక్సింగ్‌లో పసిడిని అందించిన నిఖత్‌ జరీన్‌ స్ఫూర్తిగా నూతన తరం క్రీడాకారులు బాక్సింగ్‌ వైపు అడుగులు వేస్తారు.


ప్రణాళికాబద్ధమైన శిక్షణ అవసరం

- శ్యాంసన్‌, బాక్సింగ్‌ శిక్షకుడు

2008 నుంచి బాక్సింగ్‌లో శిక్షణ అందిస్తున్నా. హనుమకొండలోని బాక్సింగ్‌ హాల్‌లో బాలబాలికలు నేర్చుకుంటున్నారు. స్థిరమైన మానసిక ఆలోచన, ప్రత్యర్థి కదలికలను బట్టి బరిలో పోరాడాల్సి ఉంటుంది. ప్రణాళికాబద్దమైన శిక్షణ అందిస్తే వరంగల్‌ నుంచి ప్రపంచస్థాయి బాక్సర్లను తయారు చేయవచ్ఛు

వసతులు కల్పించాలి..

- పి.నర్సింహరాములు, ఉమ్మడి వరంగల్‌ జిల్లా బాక్సింగ్‌ సంఘం ప్రధాన కార్యదర్శి

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో బాక్సింగ్‌ పట్ల క్రీడాకారులు ఆసక్తిని కలిగి ఉన్నారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకొని జిల్లాస్థాయిలో క్రీడాకారులకు సరైన వసతులు కల్పించాలి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని