logo

డివిజన్‌కో నర్సరీ, ఆట స్థలం

వరంగల్‌ నగరంలో 66 డివిజన్లు ఉన్నాయని, డివిజన్‌కో నర్సరీ, ఆట స్థలం ఏర్పాటుకు తగిన స్థలాలు గుర్తించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు, వరంగల్‌

Published : 21 May 2022 02:03 IST

పట్టణ ప్రగతిపై సమావేశమైన వరంగల్‌, హనుమకొండ కలెక్టర్లు, కమిషనర్‌

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: వరంగల్‌ నగరంలో 66 డివిజన్లు ఉన్నాయని, డివిజన్‌కో నర్సరీ, ఆట స్థలం ఏర్పాటుకు తగిన స్థలాలు గుర్తించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు, వరంగల్‌ కలెక్టర్‌ బి.గోపి కోరారు. పట్టణ ప్రగతి పెండింగ్‌ సమస్యలు పరిష్కరించాలన్నారు. శుక్రవారం ఉదయం హనుమకొండ కలెక్టరేటు గ్రేటర్‌ వరంగల్‌ కమిషనర్‌ ప్రావీణ్యతో కలిసి నాలుగో విడత పట్టణ ప్రగతి కార్యక్రమం, పెండింగ్‌ సమస్యలు, వైకుంఠ ధామాలు, సమీకృత మార్కెట్లు, క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు, హరితహారం, బస్తీ దవాఖానాల ఏర్పాటు తదితర అంశాలపై చర్చించారు. జూన్‌ 3- 15 తేదీ వరకు పట్టణ ప్రగతి కార్యక్రమం ఉంటుందని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిశానిర్దేశానుసారం పనిచేయాలని కలెక్టర్లు సూచించారు. శానిటేషన్‌, ప్రజామరుగుదొడ్ల నిర్వహణ, భవన నిర్మాణ వ్యర్థాల తొలగింపు, డివిజన్‌కో నర్సరీ, పట్టణ ప్రకృతి వనాలు, ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి డివిజన్‌లో ఆటస్థలం ఉండేలా చూడాలన్నారు. వచ్చే హరితహారం కోసం 17 నర్సరీల్లో 17 లక్షల మొక్కలు సిద్ధమవుతున్నాయని, ఇవేగాక మరో 30 నర్సరీలు ఏర్పాటుకు స్థలాలు గుర్తించినట్లు కమిషనర్‌ ప్రావీణ్య తెలిపారు. తుప్పు పట్టినవి, వంగిన విద్యుత్‌ స్తంభాలు తొలగించాలని, టీఎన్పీడీసీఎల్‌, గ్రేటర్‌ ఇంజినీర్లు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్లు రాజీవ్‌గాంధీ హనుమంతు, బి.గోపి కోరారు. వరంగల్‌ పోతననగర్‌, తిలక్‌రోడ్‌లో వైకుంఠ ధామాల అభివృద్ధి పనులు నిర్ణీత గడువులోపు పూర్తవ్వాలన్నారు. సమీకృత వెజ్‌, నాన్‌ వెజ్‌ మార్కెట్ల నిర్మాణ పనులు మరింత వేగీకరణ చేయాలని, వచ్చే వర్షకాలం దృష్ట్యా నాలాల పూడికతీత పనులు వేగవంతమవ్వాలన్నారు. కొత్తగా మంజూరైన ఐదు బస్తీ దవాఖానాలను వెంటనే ప్రారంభించాలని, పట్టణ ప్రగతి కార్యక్రమం కోసం ప్రత్యేకాధికారులను ఏర్పాటు చేయాలని కలెక్టర్లు సూచించారు. అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, హరిసింగ్‌, ఆర్డీవో మహేందర్‌జీ, ఎస్‌ఈ ప్రవీణ్‌ చంద్ర, సిటీప్లానర్‌ వెంకన్న, సీఎంహెచ్‌వో డాక్టర్‌ రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని