logo

పెట్టు‘బడి’ లేదు!

సర్కారు పాఠశాలల్లో అన్ని మౌలిక వసతులు కల్పించి కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం కోసం ప్రభుత్వం మన ఊరు-మనబడి కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా

Published : 21 May 2022 02:03 IST

నామమాత్రంగా మన ఊరు.. మన బడి

న్యూస్‌టుడే, వరంగల్‌ విద్యావిభాగం

సర్కారు పాఠశాలల్లో అన్ని మౌలిక వసతులు కల్పించి కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం కోసం ప్రభుత్వం మన ఊరు-మనబడి కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా ఎంపికైనా పాఠశాలల్లో పాలకులు, అధికారులు చాలా వరకు పనుల ప్రారంభం కొరకు శంకుస్థాపనలు మాత్రమే చేశారు. ఆ స్థాయిలో పనులు పుంజుకోవడంలేదు. ప్రతిపాదనలు, అంచనాలు, పరిశీలనలు, ఆమోదం వంటి వాటికే ఎక్కువ సమయం పడుతుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. మెజారిటీ బడుల్లో పనులు ప్రారంభం, నిధుల మంజూరు వంటి విషయాల్లో జాప్యమే నెలకొంటోందని అధికారులు చెబుతున్నారు.

రూ.30లక్షల లోపు పనులకు కలెక్టర్‌ అమోదం

జిల్లాలో మొత్తం ప్రభుత్వ పాఠశాలల సంఖ్య 645 కాగా అందులో మొదటి విడతలో భాగంగా 223 పాఠశాలలను ఎంపిక చేయడం జరిగింది. మౌలిక వసలుతులకు రూ.30 లక్షలలోపు పనులు చేపట్టడానికి కలెక్టర్‌ అవకాశం ఉంటుంది. అంతకు మించి వ్యయానికి సంబంధించిన పనులు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి అంచనాలు పంపావలసి ఉంటుంది జిల్లా పరిధిలో 32 బడుల్లో పనులకు శంకుస్థాపనలు చేశారు. 18 పాఠశాలల్లో పనులు జరుగుతున్నాయి. 35 పాఠశాలలకు పనులకు సంబంధించి 15 శాతం నిధులను ఆయా పాఠశాలల ఎస్‌ఎంసీ, ప్రధానోపాధ్యాయుల ఖాతాలకు బదిలీ చేశారు. మిగతా బడుల్లో అంచనాల దశలోనే ఉన్నాయి.

త్వరపడితేనే సాకారం..

పాఠశాలల పునఃప్రారంభానికి సమయం దగ్గర పడింది. జూన్‌ మొదటి వారంలో బడిబాట కార్యక్రమం నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. వేసవిలో సదుపాయాలను అభివృద్ధి చేసి బడుల ప్రారంభానికి వాటిని ఉపయోగంలోకి తీసుకొస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. సౌకర్యాలు మెరుగైతే సర్కారు పాఠశాలల్లో ప్రవేశాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. వేసవి సెలవుల్లోనే పనులు పూర్తి చేస్తే సౌకర్యంగా ఉంటుందని, తరగతులు జరిగే సమయంలో పనులు చేపడితే చదువులకు ఆటంకం కలుగుతుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు.

అదనపు గదుల జాడలేదు

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు నిర్మించాలని ఈ కార్యక్రమంలో పొందుపరిచారు. ప్రస్తుతం నిధులు ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉండటంతో వీటి నిర్మాణాన్ని పక్కనపెట్టారు. కేవలం చిన్న చిన్న మరమ్మతులతో పాటు మౌలిక సదుపాయాలకు నిధులు వెచ్చిస్తున్నారు.

ప్రభుత్వ ఆదేశాల మేరకు..

-డి.వాసంతి, జిల్లా విద్యాశాఖ అధికారి

ఎంపిక చేసిన పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడానికి మన ఊరు మనబడి కార్యక్రమంలో పనులు జరుగుతున్నాయి. కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌ పర్యవేక్షణలో కమిటీలను నియమించాం. ఎప్పటికప్పడు పనులను పర్యవేక్షిస్తున్నాం. త్వరితగతిన పూర్తి చేస్తాం.


అంచనాలతోనే కాలయాపన

నర్సంపేట రూరల్‌,న్యూస్‌టుడే: నర్సంపేట మండలం లక్నేపల్లి ఉన్నత పాఠశాలలో పనులు చేపట్టేందుకు రూ.61లక్షల పనులకు అంచనా వేసి ఉన్నతాధికారులకు నివేదించారు. నిధుల ఆధారంగా మరోమారు రూ.30లక్షలకు అంచనా వేశారు. 170 మంది విద్యార్థులకు యూడైస్‌ ప్రకారం 11 గదులుండాల్సి ఉండగా ప్రస్తుతం 9 మాత్రమే ఉన్నాయి. 9 గదులకు రంగులు, విద్యుత్తు సరఫరా, చాక్‌ బోర్డులు, తాగునీటి ఫ్లాట్‌ఫాం ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇంతవరకు పనులు మొదలు కాలేదు. జూన్‌ 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నా ఇంత తక్కువ సమయంలో అభివృద్ధి పనులు పూర్తి చేయడం కష్టమేనని అధికారులు, ఉపాధ్యాయులు చెబుతున్నారు.


అరకొర నిధులు.. ప్రారంభంకాని పనులు

దుగ్గొండి, న్యూస్‌టుడే: దుగ్గొండి మండలంలో 15 పాఠశాలలను ఎంపిక చేశారు. పూర్వ విద్యార్థులు, ఎన్నారైలు దాతలెవరూ విరాళాలు అందజేయలేదు. 14 పాఠశాలల్లో వంట గదుల నిర్మాణానికి రూ. 47.60 లక్షలు, 66 మూత్రశాలలకు రూ.198 లక్షలు, 12 ప్రహరీలకు రూ.69.16 లక్షలు, నీటి వసతికి రూ163.19 లక్షలు, విద్యుత్తు మరమ్మతులకు రూ.322.74లక్షలు, ప్రత్యేక మరమ్మతులకు రూ.133.83 లక్షలు, అదనపు తరగతి గదులకు రూ. 140.37 లక్షలు ప్రతిపాదనలు పంపారు. కేవలం ఆరు పాఠశాలల్లో పనులకు రూ.117.04 లక్షలకు ప్రతిపాదనలు పంపగా 15 శాతం నిధులు మాత్రమే మంజూరు చేశారు. పనులు మాత్రం ఎక్కడా కార్యరూపం దాల్చలేదు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని