logo

విద్యార్థి.. విజయీభవ..!

హలో విద్యార్థులూ.. నేను మీ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షను. మిమ్మల్ని రేపు కలుసుకోబోతున్నందుకు ఆనందంగా ఉంది. కరోనా తర్వాత రెండేళ్ల విరామం తర్వాత మిమ్ముల్ని కలుస్తున్నా.. అధికారులు సైతం

Published : 22 May 2022 02:03 IST

న్యూస్‌టుడే, జనగామ అర్బన్‌: హలో విద్యార్థులూ.. నేను మీ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షను. మిమ్మల్ని రేపు కలుసుకోబోతున్నందుకు ఆనందంగా ఉంది. కరోనా తర్వాత రెండేళ్ల విరామం తర్వాత మిమ్ముల్ని కలుస్తున్నా.. అధికారులు సైతం అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక మీ రాక కోసం ఎదురు చూస్తున్నా. మరి మీరు కూడా సిద్ధమే కదా? ఇంటికి గడప ఎంత ముఖ్యమో మీ ఉన్నత చదువులకూ నేను అంతే అవసరం. నిర్లక్ష్యాన్ని వీడండి.. భయాన్ని పారదోలండి. సత్ఫలితాలను ఆశించండి. నేను చెప్పే కొన్ని సూచనలు పాటించి పరీక్షల్లో విజయం సాధించండి.

నిద్ర.. ఆహారపు అలవాట్లు కీలకం : ప్రణాళిక ప్రకారంగా చదివితేనే ప్రయోజనం ఉంటుంది. ఉదయం 4 నుంచి 6 గంటల వరకు మనసు ప్రశాంతంగా ఉంటుందని.. చదివిన అంశాలు ఎక్కువ గుర్తుంటాయని విద్యా నిపుణులు సూచిస్తుంటారు. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. కొందరు పరీక్ష ముందు రోజు రాత్రి సమయంలో నిద్రపోకుండా చదువుతుంటారు. ఇలా చేస్తే మర్నాడు పరీక్ష సరిగా రాయలేరు. 7-8 గంటల వరకు నిద్రకు కేటాయించాలి. వెంటవెంటనే రకరకాల సబ్జెక్టులను చదవకూడదు. పరీక్షలు ముగిసే వరకు ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలి. కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండడం మంచిది. ఈ వారం రోజులపాటు వినోదాలకు దూరంగా ఉండి ఏకాగ్రతతో చదివితే మంచి మార్కులు సాధించేందుకు ఆస్కారంగా ఉంటుంది. 

మానసిక ప్రశాంతత.. ఆత్మవిశ్వాసం అవసరం : మీరు మొదటిసారిగా బోర్డు పరీక్షలను ఎదుర్కోవడం కొంత కష్టంగానే ఉంటుంది. అవగాహన లేమి, ఆందోళన ఇతరత్రా కారణాలు మిమ్ముల్ని వేధిస్తుంటాయి. ప్రశ్నపత్రం ఎంత కఠినంగా వస్తుందో, ఎలా రాయాలో, తక్కువ మార్కులు వస్తే చదువులో వెనుకబడి పోతామేమో అనే ప్రశ్నలు ఆందోళనకు గురి చేస్తుంటాయి. వీటి గురించి ఆలోచించకండి.. పరీక్ష బాగా రాయగలను అనే పాజిటివ్‌ దృక్పథంతో ఉండండి. మనసును ప్రశాంతంగా ఉంచుకుంటే ఎలాంటి భయాలూ ఉండవు. కొందరు పరీక్షకు వెళ్లే క్రమంలో బస్సుల్లోనో, ఆటోల్లో చదువుతుంటారు. ఇలా చేయడం సరికాదు. పరీక్ష కేంద్రానికి అరగంట ముందుగా చేరుకునేలా ప్రణాళిక చేసుకోవాలి. 

చక్కని చేతిరాత ప్రధానం..

ఈసారి మీకో చక్కని అవకాశం. గతంలో ఒక సబ్జెక్టుకు రెండు పేపర్లు ఉండేవి. ఈ ఏడాది వాటిని ఆరు పేపర్లకు కుదించడం మీకు మేలు చేకూర్చే అంశం. సిలబస్‌ కూడా డెభ్బై శాతం నిర్ణయించడం, ఛాయిస్‌ ప్రశ్నలు ఎక్కువ వచ్చే అవకాశముంది. ఇంత చక్కని అవకాశాన్ని మీరందరూ వినియోగించుకోవాలి. రాసే ప్రతి అంశాన్ని పాయింట్ల వారీగా చక్కని చేతిరాత ఉంటే మంచి మార్కులు సాధించొచ్చు. పరీక్షల సమయంలో పునశ్చరణపైనే దృష్టి సారించండి. కొత్త అంశాలు చదవాలని ప్రయత్నించకండి. ఇలా చేస్తే అయోమయానికి గురవుతారు. 

ఇట్లు

పదోతరగతి పబ్లిక్‌ పరీక్ష 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని