logo

పది పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా విద్యాశాఖ అధికారి జి.పాణిని తెలిపారు. ఈనెల 23 నుంచి పరీక్షలు ప్రారంభం కానుండగా నిర్వహణపై శనివారం ‘న్యూస్‌టుడే’ ఆయనతో ముఖాముఖి నిర్వహించింది.

Published : 23 May 2022 04:08 IST

‘న్యూస్‌టుడే’తో జిల్లా విద్యాశాఖ అధికారి జి.పాణిని

ములుగు, న్యూస్‌టుడే: పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా విద్యాశాఖ అధికారి జి.పాణిని తెలిపారు. ఈనెల 23 నుంచి పరీక్షలు ప్రారంభం కానుండగా నిర్వహణపై శనివారం ‘న్యూస్‌టుడే’ ఆయనతో ముఖాముఖి నిర్వహించింది. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్ష కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించామని తెలిపారు. ప్రశాంత వాతావరణలో పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

జిల్లాలో ఎంత మంది విద్యార్థులున్నారు? ఎన్ని పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు?

డీఈఓ: జిల్లాలో మొత్తం 21 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశాం. అన్ని కేంద్రాలు ఉన్నత పాఠశాలల్లోనే ఉంటాయి. మొత్తం 3399 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందు కోసం 203 మంది ఉపాధ్యాయులు ఇన్విజిలేటర్లుగా విధులు నిర్వర్తించనున్నారు. 21 మంది చీఫ్‌ సూపరింటెండెంట్‌లు, 21 మంది డిపార్ట్‌మెంటు అధికారులు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ పరీక్షల నిర్వహణలో పాల్గొంటారు.

సజావుగా నిర్వహించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?

పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నాం. అన్ని కేంద్రాల్లోని చీఫ్‌ సూపరింటెండెంట్‌, డిపార్ట్‌మెంటల్‌ అధికారుల గదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. అధికారులు ప్రతి రోజు సీసీ కెమెరాల నిఘాలోనే సీలు వేసిన ప్రశ్నా పత్రాలు తెరవడం, పంపిణీ చేయడం, జవాబు పత్రాలను సీల్‌ చేయడం వంటివి చేయాలని ఆదేశాలు జారీ చేశాం. కేంద్రంలో మొబైల్‌ ఫోన్‌లు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలు, యంత్రాలు వినియోగించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. పరీక్ష జరుగుతున్న సమయంలో మొదటి అరగంట లోగా కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసు ఎస్కార్ట్‌ వారి ఫోన్‌ ద్వారా విద్యార్థుల హాజరును ఉన్నతాధికారులకు వివరిస్తారు. పోలీసుల రక్షణలోనే ప్రశ్నా పత్రాల సీల్‌ తీసి కేంద్రాలకు తీసుకెళతారు. అన్ని వివరాలతో కేంద్రాల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నాం.

విద్యార్థులకు మీరిచ్చే సూచనలు?

విద్యార్థులు ఎటువంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలను కేంద్రంలోకి తీసుకురాకూడదు. హాల్‌ టికెట్‌ తీసుకురాకపోతే కేంద్రలోకి అనుమతించరు. పరీక్ష రోజు ఇబ్బందులు పడకుండా ముందు రోజే వచ్చి కేంద్రాన్ని చూసుకోవాలి. పరీక్ష జరిగే సమయంలో విద్యార్థులు బయటకు రావడానికి వీలు లేదు. హాల్‌ టికెట్‌లోని వివరాలను ముందుగానే పరిశీలించుకోవాలి. ఏమైనా పొరపాట్లుంటే ప్రధానోపాధ్యాయుల ద్వారా పరీక్ష కేంద్రం చీఫ్‌ సూపరింటెండెంట్‌కు సమాచారం ఇచ్చి సరిదిద్దుకోవాలి. ఉదయం 9.30 నుంచి 12.30 గంటల వరకు పరీక్ష ఉంటుంది. ఉదయం 8.30 గంటల లోపే చేరుకోవాలి. ఓఎమ్మార్‌ షీటుపై ఉన్న వివరాలను ప్రతి రోజు సరి చూసుకోవాలి. హాల్‌ టికెట్‌ నెంబర్‌ను ప్రశ్నా పత్రం మీద తప్ప ఎక్కడా రాయకూడదు. ప్రధాన సమాధాన పత్రం నెంబర్‌ను గ్రాఫ్‌ పేపర్‌పై, పార్ట్‌ బీ పేపర్‌పై రాయాలి. మాస్క్‌ ధరించాలి. కొవిడ్‌ నిబంధనలు పాటించాలి. విద్యార్థుల తల్లిదండ్రులు వారి పిల్లలను గంట ముందు కేంద్రం వద్ద విడిచి ప్రశాంతమైన వాతావరణంలో పరీక్ష రాసేలా సహకరించాలి.

చూచిరాతలకు పాల్పడకుండా ఏం చేయనున్నారు?

ప్రతి రోజు పరీక్ష గదిలోకి విద్యార్థులను అనుమతించే ముందు వారిని తనిఖీ చేస్తాం. బాలికలకు సంబంధించి మహిళా ఉపాధ్యాయుల సహాయం తీసుకుంటాం. వారి వద్ద హాల్‌ టికెట్‌ మినహా ఎలాంటి పత్రం ఉన్నా స్వాధీనం చేసుకుంటాం. మాల్‌ప్రాక్టీస్‌కు అవకాశం లేకుండా చూస్తాం.

ఏమైనా ఇబ్బందులుంటే ఎవరిని సంప్రదించాలి?

అత్యవసర సమయంలో జిల్లా విద్యాశాఖ అధికారి 8977924554, ఏసీజీఈ 9912342270, కంట్రోల్‌ రూం. 8919667838 నెంబర్లను సంప్రదించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని