logo

పత్తి సాగుకు ప్రాధాన్యం

వానాకాలం సాగును జిల్లా వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటలను సాగు చేసే విధంగా కార్యాచరణ రూపొందించింది.

Published : 23 May 2022 04:08 IST

వర్షాకాలం సీజన్‌ కార్యాచరణ

 

మహబూబాబాద్‌ రూరల్‌, న్యూస్‌టుడే: వానాకాలం సాగును జిల్లా వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటలను సాగు చేసే విధంగా కార్యాచరణ రూపొందించింది. ఈ ఏడాది పత్తి, ఆయిల్‌పాం సాగుపై దృష్టి సారించారు. ఎరువుల వినియోగం తగ్గించే విధంగా అవగాహన కల్పించేందుకు క్లస్టర్ల వారీగా ప్రదర్శన క్షేత్రాలను నెలకొల్పాలని నిర్ణయించారు. ఇందుకోసం విస్తరణ అధికారులతోపాటు మండల, డివిజన్‌ స్థాయి వ్యవసాయ అధికారులకు లక్ష్యాన్ని నిర్ణయించారు. సాగుకు ముందుగానే నకిలీ విత్తనాలను అరికట్టేందుకు టాస్క్‌ఫోర్స్‌ బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు.

నష్టపరిచిన మిర్చి సాగు పెరిగేనా

గత ఏడాది జిల్లాలో 82,760 ఎకరాల్లో మిరప సాగు చేయగా నల్ల తామర పురుగుతో రైతులు రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టి తీవ్రంగా నష్టపోయారు. తామర పురుగు ఉద్ధృతి ఈసారి కూడా ఉంటుందనే భావనతో ఈసారి మిరప సాగు తగ్గుతుందా అనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈసారి 65,200 ఎకరాల్లో ఆ పంట సాగు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది పత్తికి మంచి ధర రావడంతో ఈసారి ఎక్కువ మంది రైతులు పత్తి వైపు మొగ్గు చూపొచ్చని అధికారుల అంచనా వేస్తున్నారు.

ఎరువుల అవసరం ఇలా

జిల్లాలో యూరియా 69,087 టన్నులు, డీఏపీ 23,030 టన్నులు, కాంప్లెక్స్‌ 46,060 టన్నులు, ఏవీపీ 23,030 టన్నులు

లాభసాటి పంటలపై అవగాహన కల్పిస్తున్నాం : - చత్రునాయక్‌, జిల్లా వ్యవసాయ అధికారి

జిల్లాలో వానాకాలం పంటల సాగు ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి నివేదిక పంపాం. ముందుగా కల్తీ విత్తనాలు అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకొంటున్నాం. క్లస్టర్ల వారీగా ప్రదర్శన క్షేత్రాలను ఏర్పాటు చేస్తున్నాం. విత్తనాల, ఎరువుల కొనుగోలు సమయంలో రాష్ట్ర ప్రభుత్వంచే ఆమోదం పొందిన విత్తనాలు కొనుగోలు చేసేలా వారికి అవగాహన కలిగిస్తున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని