logo

సైకిల్‌పై పరుగులు.. ఆరోగ్యానికి దారులు

రయ్‌ రయ్‌మని సాగే ద్విచక్ర వాహనాలు, విలాసవంతంగా నడిచే కార్లు పక్కన పెట్టి సైకిల్‌పై పరుగులు పెడుతున్నారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా దీనిపై సవారీ చేస్తూ ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటున్నారు. ఇంధనం ధరల నుంచీ ఉపశమనం పొందుతున్నారు. అన్ని వర్గాలను ఆకర్షించేలా సరికొత్త మోడళ్లు మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చాయి.

Updated : 23 May 2022 06:51 IST

రయ్‌ రయ్‌మని సాగే ద్విచక్ర వాహనాలు, విలాసవంతంగా నడిచే కార్లు పక్కన పెట్టి సైకిల్‌పై పరుగులు పెడుతున్నారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా దీనిపై సవారీ చేస్తూ ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటున్నారు. ఇంధనం ధరల నుంచీ ఉపశమనం పొందుతున్నారు. అన్ని వర్గాలను ఆకర్షించేలా సరికొత్త మోడళ్లు మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చాయి.

- న్యూస్‌టుడే, బాలసముద్రం


నగరాన్ని చుట్టేస్తున్నారు

వరంగల్‌ నగర యువత బృందాలుగా ఏర్పడి సైకిల్‌ సవారీ చేస్తున్నారు. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం ఒక ప్రాంతం నుంచి బయలుదేరి నగరాన్ని చుట్టేస్తున్నారు. కొందరు రైడర్స్‌ వాట్సాప్‌ వేదికగా గ్రూపులు ఏర్పాటు చేసుకుంటున్నారు. వారాంతపు సెలవుల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. ట్రైసిటీ సైకిల్‌ రైడర్స్‌, వావ్‌ వరంగల్‌ తదితర గ్రూపులు ఇలా పోటీలు నిర్వహిస్తూ సైకిల్‌ వాకర్స్‌ను ప్రోత్సహిస్తున్నాయి. సుమారు 200 మంది రైడర్లు 100కు పైగా పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలను సైకిళ్లపై వెళ్లి సందర్శించారు.


ఆకట్టుకునే మోడళ్లు

యువతను ఆకట్టుకునే కొత్త మోడళ్లు అందుబాటులోకి వచ్చాయి. రెండేళ్ల వయస్సు నిండిన చిన్నారుల నుంచి వృద్ధుల వరకు నడిపేలా అందుబాటులో ఉన్నాయి. రూ.3 వేల నుంచి రూ.65,000 ఖరీదైనవి లభ్యమవుతున్నాయి.

టెక్నాలజీ జోడించే పరికరాలు: సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన పరికరాలు సైకిల్‌కు అమర్చుకోవచ్ఛు ఇంటి నుంచి బయటకు వెళ్లిన పిల్లల ఆచూకీ తెలుసుకోవడానికి జీపీఎస్‌ ట్రాకింగ్‌ పరికరం అందుబాటులోకి వచ్చింది. ప్రయాణించిన సమయం, దూరం తెలుసుకునేలా స్పీడో మీటర్‌ పరికరం ఉంది. రాత్రి సమయంలో ప్రయాణించే వారి కోసం రిఫ్లెక్టింగ్‌ రైడర్‌ బెల్టులు వచ్చాయి.


ప్రత్యేకంగా ట్రాక్‌

వరంగల్‌ మహానగరంలో తొలిసారిగా సైకిల్‌ వాకర్స్‌ కోసం ప్రత్యేకంగా ట్రాక్‌ నిర్మించారు. కాజీపేట ఫాతిమా నుంచి సుబేదారి వరకు ప్రధాన రహదారిపై ఏర్పాటు చేశారు.


కుర్రకారు హుషారు

కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్‌ నిట్‌ కళాశాలలో వేలాది మంది విద్యార్థులు సైకిల్‌ వినియోగిస్తున్నారు. నిట్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థులు అనిమేష్‌, అంకిత్‌, సందీప్‌ కలిసి ప్రతి రోజూ సుమారు 10 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తున్నారు. ఇతర అవసరాలకూ వినియోగిస్తున్నారు. ఇలా నెలకు సగటున రూ.3 వేలు ఆదా చేస్తున్నారు.


పెరుగుతున్న వినియోగం

సైకిల్‌ స్టోర్‌ యజమానులు గతేడాది సగటున నెలకు 10 నుంచి 20 సైకిళ్లు మాత్రమే విక్రయించేవారు. కొవిడ్‌ తర్వాత అమ్మకాలు పెరిగాయి. ప్రస్తుతం నెలకు సుమారు పిల్లల సైకిళ్లు 40, పెద్దవారు వినియోగించేవి 60 సైకిళ్లు విక్రయిస్తున్నట్లు వరంగల్‌ స్టోర్‌ యజమానులు తెలిపారు. గ్రామాల నుంచి వచ్చి ఆధునాతన సైకిళ్లు కొంటున్నారని బాలసముద్రంలోని ఓ సైకిల్‌ స్టొర్‌ యజమాని, చకిలం అవినాష్‌ తెలిపారు.


రోజంతా ఉల్లాసం

-ఎం.సరస్వతి, ఫిట్‌నెస్‌ ట్రైనర్‌, అడ్వకేట్స్‌ కాలనీ

ప్రతి రోజూ సైకిల్‌ తొక్కడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. 45 నిమిషాల పాటు నిరంతరం నడిపితే 400 నుంచి 500 క్యాలరీలు కరిగిపోతాయి. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. రోజంతా ఉల్లాసంగా ఉండవచ్ఛు


రోజూ కళాశాలకు వెళ్తూ..

హనుమకొండ రాంనగర్‌ ప్రాంతానికి చెందిన జంగా గోపాల్‌రెడ్డి ప్రతి రోజు తన నివాసం నుంచి ప్రభుత్వ బీఈడి కళాశాలకు సైకిల్‌పై వెళ్తున్నారు. ఆయన గెస్ట్‌ ఫ్యాకల్టీగా పని చేస్తున్నారు. సైకిల్‌పై ప్రయాణిస్తే రోజంతా ఉల్లాసంగా ఉంటుందని చెబుతున్నారు. గోపాల్‌రెడ్డితో పాటు మరికొందరు కలిసి 2018లో వాకర్స్‌ ఇంటర్నేషనల్‌ అనుబంధంగా వరంగల్‌ నగరంలో సైకిల్‌ వాకర్స్‌ అసోసియేషన్‌ ఏర్పాటు చేశారు.. 25 మంది సభ్యులతో ప్రారంభించిన అసోసియేషన్‌ ఇప్పుడు 150 మందికి పైగా చేరింది. ‘సైకిల్‌ ప్రయాణించండి-పర్యావరణాన్ని కాపాడండి’ అనే నినాదంతో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు..

జిల్లాల వారీగా సైకిల్‌ స్టోర్లు, గత నెల అమ్మకాలు

వరంగల్‌ 61 4768

హనుమకొండ 79 6850

ములుగు 46 2450

మహబూబాబాద్‌ 35 1945

జయశంకర్‌ 27 1545

జనగామ 28 1865

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు