logo

వైద్యం.. మెరుగుపడితేనే ఆరోగ్యం

జిల్లాలో వైద్యరంగంపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. వైద్యులు, సిబ్బంది కొరత, పరికరాలు, యంత్రాలు లేక ప్రజలు మెరుగైన వైద్య సేవలకు దూరమవుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వరంగల్‌ లాంటి నగరాలకు వెళ్లాల్సి వస్తోంది. జిల్లాలోని ఆసుపత్రుల్లో ఆదివారం వైద్యసేవల తీరుపై ‘న్యూస్‌టుడే’ పరిశీలన చేపట్టింది. సాధారణ రోజుల్లోలాగే సెలవు దినాల్లోనూ వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండి సేవలందిస్తున్నారు.

Published : 23 May 2022 05:43 IST

ములుగు, న్యూస్‌టుడే: జిల్లాలో వైద్యరంగంపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. వైద్యులు, సిబ్బంది కొరత, పరికరాలు, యంత్రాలు లేక ప్రజలు మెరుగైన వైద్య సేవలకు దూరమవుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వరంగల్‌ లాంటి నగరాలకు వెళ్లాల్సి వస్తోంది. జిల్లాలోని ఆసుపత్రుల్లో ఆదివారం వైద్యసేవల తీరుపై ‘న్యూస్‌టుడే’ పరిశీలన చేపట్టింది. సాధారణ రోజుల్లోలాగే సెలవు దినాల్లోనూ వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండి సేవలందిస్తున్నారు. అయితే సౌకర్యాలు మెరుగుపరిస్తే జిల్లా ప్రజల ఇబ్బందులు తీరనున్నాయి.

* సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో డ్యూటీ వైద్యులు 24 గంటలు అందుబాటులో ఉండాలి. తమ వద్దకు వచ్చిన కేసుల్లో క్రిటికల్‌గా ఉన్నవారిని జిల్లా ఆసుపత్రులకు రెఫర్‌ చేయాలి. సాధారణ, ప్రసూతి సేవలు అందించాలి.

* పీహెచ్‌సీల్లో ఆదివారం ఉదయం 12 గంటల వరకు ఓపీ సేవలు అందించాలి. సాయంత్రం 4 గంటల వరకు వైద్యుడు, సిబ్బంది అందుబాటులో ఉంటూ గర్భిణులకు, రోగులకు సాధారణ వైద్యసేవలు అందించాలి.

అందుబాటులో ఉన్నా..

జిల్లా అసుపత్రిలో ఆదివారం వైద్య సేవలు అందుబాటులోనే ఉన్నాయి. డాక్టర్‌ విజయ్‌ విధుల్లో ఉండి సేవలందించారు. నూతనంగా ఏర్పాటు చేసిన ఐసీయూలో ఐదుగురు రోగులు వైద్య సేవలు పొందుతున్నారు. ఉదయం 8, 9 గంటల సమయంలో వైద్యులు వార్డుల్లోకి వెళ్లి రోగులను పరీక్షించారు. ఉదయం నలుగురు వైద్యులు విధులు నిర్వర్తించారు. మళ్లీ సాయంత్రం 6 గంటలకు(రౌండ్స్‌) కూడా రోగుల పరిస్థితిని పరిశీలించారు. సిబ్బంది కూడా విధుల్లో ఉన్నారు. అయితే ఆసుపత్రిలో కొన్ని సమస్యలు నెలకొన్నాయి.


వీటిపై దృష్టి సారించాలి..


ఐసీయూలో రోగిని పరీక్షిస్తున్న డాక్టర్‌ విజయ్‌

* ములుగు జిల్లా ఆసుపత్రిలో ఆర్థోపెడిక్‌ సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులో లేవు. ఆర్థోపెడిక్‌ డాక్టర్‌ ఒక్కరే ఉన్నారు. వైద్యులను నయమించాలి.

* ఎముకల సర్జరీలకు సంబంధించి సీఆమ్‌ యంత్రం ఏర్పాటు చేయాల్సి ఉంది. చిన్న చిన్న సర్జరీలు కూడా చేయలేకపోతున్నారు. ఎముకలు విరిగి సర్జరీ అవసరం ఉంటే వరంగల్‌ లాంటి ప్రాంతాలకు పంపిస్తున్నారు. రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు సీఆమ్‌ యంత్రం ఏర్పాటుకు హామీ ఇచ్చినప్పటికీ ఏర్పాటు కాలేదు.

* చెవి, ముక్కు, గొంతు వైద్యులు అందుబాటులో ఉన్నప్పటికీ ఆ వైద్యానికి సంబంధించి వైద్య పరికరాలు లేవు. అవసరమైన సర్జరీలు జరగడం లేదు.

* దంత వైద్యానికి సంబంధించి వైద్యులు అందుబాటులో ఉన్నప్పటికీ సరైన పరికరాలు అందుబాటులో లేవు. * మత్తు వైద్యుల సంఖ్య పెంచాలి. * గదులు లేక వార్డుల కొరత ఉంది.

* కంటి ఆపరేషన్లకు వరంగల్‌ లాంటి నగరాలకు వెళ్లాల్సి వస్తోంది. * విభాగాల వారీగా ఆపరేషన్‌ థియేటర్లు ఏర్పాటు చేయాలి.

- ములుగు


విధుల్లో నలుగురు వైద్యులు


ఓపీ విభాగంలో సిబ్బంది

ఏటూరునాగారం సామాజిక వైద్యశాలలో ‘న్యూస్‌టుడే’ పరిశీలనకు వెళ్లిన సమయంలో 4 వైద్యులు విధుల్లో ఉన్నారు. పిల్లల వైద్య నిపుణుడు డా.ప్రవీణ్‌చందర్‌, జనరల్‌ డ్యూటీ డాక్టర్లు అనీల్‌కుమార్‌, స్వాతి, సుమలత ఉన్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా.సురేష్‌కుమార్‌ మాట్లాడుతూ.. ఆదివారం కూడా అత్యవసర సేవల కోసం రోగులు వస్తుంటారని అందుకే కనీసం నలుగురు వైద్యులను అందుబాటులో ఉంచుతామన్నారు.

దంత వైద్యానికి పరికరాలు కరవు

దంత వైద్యురాలు ఉన్నా వైద్య సేవలు అందడం లేదు. ఆమె విధులకు వస్తున్నప్పటికీ పరికరాలు అందుబాటులో లేక ప్రజలకు సేవలు అందించలేకపోతున్నారు. కేవలం రోగిని కూర్చోబెట్టే కుర్చీ మాత్రమే ఆసుపత్రిలో ఉంది. ఆసుపత్రికి డయాలసిస్‌ కేంద్రం మంజూరైనా ప్రారంభానికి నోచుకోవడం లేదు. కొత్తగా నిర్మించే ఎంసీహెచ్‌ భవనం పూర్తయితే డయాలసిస్‌ సేవలు అందుబాటులోకి వస్తాయని సూపరింటెండెంట్‌ తెలిపారు.

- ఏటూరునాగారం


వైద్యాధికారి, స్టాఫ్‌నర్సు సేవలు


క్షతగాత్రురాలికి చికిత్స చేస్తున్న డాక్టర్‌ సాయికృష్ణ, సిబ్బంది భారతమ్మ

వెంకటాపురం సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఆధునిక వైద్య సేవలు అందని ద్రాక్షగానే మారాయి. ప్రభుత్వ ఆసుపత్రిగా ఉన్న ఈ దవాఖానాను ప్రభుత్వ వైద్యవిధాన పరిషత్‌కు బదలాయిస్తూ సీహెచ్‌సీగా ఉన్నతీకరించారు. స్థాయి పెంచినా రోగులకు అరకొర వైద్యమే అందుతోంది. ఆదివారం వైద్యాధికారి, స్టాఫ్‌నర్సు విధుల్లో ఉన్నారు. ప్రమాదవశాత్తు గాయాలైన మహిళకు వైద్యాధికారి సాయికృష్ణ ఎఫ్‌ఎన్‌వోగా సేవలందించాల్సిన పరిస్థితి నెలకొంది. కాంటింజెంట్‌ వర్కర్‌ భారతమ్మ ఆయనకు సహకారం అందించారు. రోగులు సుమారు 20 మంది సేవలు పొందగా మరో 10 మంది దవాఖానాలోనే వైద్యం తీసుకుంటున్నారు.

* యాంటీబయాటిక్‌ ఇంజక్షన్లు, శ్వాస సంబంధిత రోగులకు ఆవిరి పట్టే మందులు అందుబాటులో లేవు.

* సిబ్బంది లేకపోవడం, అవసరమైన రసాయనాలు లేక ఈసీజీ పరికరం నిరుపయోగంగా మారింది. వైద్యులు, సిబ్బంది కొరత ఉన్నా సాధ్యమైనంత వరకు రోగులకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్నామని వైద్యాధికారి సాయికృష్ణ తెలిపారు.

- వెంకటాపురం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని