logo

వైద్య వ్యర్థాలు.. ప్రమాద ఘంటికలు

ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, చిన్నచిన్న ప్రైవేటు ఆసుపత్రులు, ఆర్‌ఎంపీలు, ఇళ్లమధ్య ఉండే క్లినిక్‌ల నుంచి ప్రమాదకర వ్యర్థాలు సాధారణ చెత్త కుండీల్లో కలుస్తున్నాయి. ఇది చాలా ప్రమాదకరం. ఈ  వైద్య వ్యర్థాలు సాధారణ చెత్తలో కలవకుండా చూసే బాధ్యత ఆయా స్థానిక సంస్థలకు ప్రభుత్వం అప్పగించింది

Updated : 24 May 2022 04:59 IST

కనీస నిబంధనలు పాటించని ఆసుపత్రులు
న్యూస్‌టుడే, ఎంజీఎం ఆసుపత్రి, డోర్నకల్‌

వైద్య వ్యర్థాలను ఒక్కరోజు దాటి ఉంచినా.. భరించలేని దుర్వాసన వేస్తాయి. ప్రమాదకరమైన బ్యాక్టీరియా, వైరస్‌లు దాడి చేసే ప్రమాదముంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో వినియోగించే సిరంజీలు, గ్లౌజులు, బ్యాండేజీ, దూది, శస్త్రచికిత్సలు చేసి తొలగించిన మానవ శరీర వ్యర్థభాగాలు, రక్తం వంటి వాటిని సాధారణ చెత్తబుట్టలు, డంపర్‌ బిన్లలో పడేయడం వల్ల గాలిలోకి బ్యాక్టీరియా చేరి, ఊహించని అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. సాధారణ చెత్తతో కలవనీయకుండా వీటిని అత్యధిక ఉష్ణోగ్రత వద్ద మండించి బూడిద చేయడం ద్వారా ఈ వ్యర్థాల సమస్య నుంచి గట్టెక్కవచ్చు.


బాధ్యత స్థానిక సంస్థలదే..

ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, చిన్నచిన్న ప్రైవేటు ఆసుపత్రులు, ఆర్‌ఎంపీలు, ఇళ్లమధ్య ఉండే క్లినిక్‌ల నుంచి ప్రమాదకర వ్యర్థాలు సాధారణ చెత్త కుండీల్లో కలుస్తున్నాయి. ఇది చాలా ప్రమాదకరం. ఈ  వైద్య వ్యర్థాలు సాధారణ చెత్తలో కలవకుండా చూసే బాధ్యత ఆయా స్థానిక సంస్థలకు ప్రభుత్వం అప్పగించింది. వీటిని బయోమెడికల్‌ ట్రీట్‌మెంటు ప్లాంట్లకు పంపించాలి. దీన్ని పాటించని ఆసుపత్రులను గుర్తించి చర్య తీసుకునే బాధ్యత స్థానిక సంస్థలకే ఉంది.
 సాధారణ చెత్తలో కలవకుండా చూడాలి. సాధారణ చెత్తలో జీవ వ్యర్థాలు కలిపేయకూడదు. ఎవరైనా అలా చేస్తున్నారంటే నివారించాల్సిన బాధ్యత సంబంధిత మున్సిపాలిటీలు, పంచాయతీలదేనని  రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్యుడు డాక్టర్‌ వడ్డె రవీందర్‌ తెలిపారు.
సాధారణ చెత్తలో కలవడం వల్ల నష్టాలు
*  పర్యావరణానికి సంబంధించిన సమస్యలు
*  అంటువ్యాధులు, ఇతర జీవుల వ్యాప్తికి దారి తీయొచ్చు.
* హానికరమైన సూక్ష్మజీవులు ఇన్ఫెక్షన్‌ కలిగిస్తాయి.
*  వ్యర్థాల సేకరణ, డబ్బాలపై మూతలు ఉంచకపోవడం వల్ల వైద్యులు, నర్సులు, వార్డు బాయ్‌లు, దుస్తులు శుభ్రం చేసేవారు, పారిశుద్ద్య కార్మికులకు వైరస్‌, ఇన్ఫెక్షన్‌ సోకే ప్రమాదం ఉంది.


ఆసుపత్రి ఆవరణలోనే దహనం

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గదులకు ఆనుకుని తగులబెట్టిన వ్యర్థాలు

మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌లోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోజుకు ఓపీ 60-75 మధ్య ఉంటుంది. బాలింతలు, గర్భిణులు అదనం. ఇందులో వాడేసిన మందులు, పరికరాల తాలూకు వ్యర్థాలను ఏ రోజుకారోజు ఆసుపత్రి ఆవరణలోనే దహనం చేస్తున్నారు. ఆసుపత్రి  పక్కనే గదులు, నివాస గృహాలున్నాయి. ఆసుపత్రి ఆవరణలోని ఒక పాడు పడ్డ బావి తగుల బెట్టిన వ్యర్థాలతో దాదాపు పూడుకుపోయిందంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు.
వ్యర్థాల సేకరణ ఇలా చేపట్టాలి..
పసుపు డబ్బా:  శరీరం నుంచి వేరుచేసిన వ్యర్ధభాగాలు, కాలం చెల్లిన మందులు, రక్తంతో అంటిన బ్యాండేజీ, దూది,  రసాయన వ్యర్థాలు
ఎరుపు: ప్లాస్టిక్‌ బ్యాగులు, సెలైన్‌ బాటిళ్లు, పైప్‌లు లాంటివి  
నీలం: అన్ని రకాల గాజు సీసాలు, టెస్టు ట్యూబులు లాంటివి
నలుపు: స్టీల్‌ సిరంజీలు, సూదులు, మెటల్‌ పరికరాలు, వంటివి
ఇలా సేకరించిన చెత్తను వేర్వేరు పద్ధతుల్లో ప్లాంట్లలో నిర్వీర్యం చేయాలి. 750 నుంచి 1200 డిగ్రీల సెల్సియస్‌ వరకు మండించి బూడిద చేయాలి.

ఏం చేస్తున్నారంటే..
అతి పెద్ద ఆసుపత్రి ఎంజీఎంలో ఈ విషయంలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. వైద్యుల సూచన మేరకు రోగులకు ఇంజెక్షన్లు ఇచ్చాక, జీవ వ్యర్థాలపై అవగాహన ఉన్న నర్సులు, సహాయకులు, వైద్యులు అక్కడ ఏర్పాటుచేసిన ప్రత్యేక రంగుల చెత్త బుట్టల్లో వేయాలి. ఇక్కడ వైద్య సిబ్బంది ఆ పనిని అక్కడున్న రోగుల సహాయకులకు చెబుతున్నారు. వారికి అవగాహన లేక సాధారణ చెత్త డబ్బాల్లో వేస్తున్నారు. దీంతో అది మున్సిపాలిటీ చెత్తలో కలుస్తోంది.
ఏం చేయాలి..
వ్యర్థాలను సేకరించే బయోమెడికల్‌ ట్రీట్‌మెంటు ప్లాంటు వారు ఆసుపత్రుల్లో మంచాల లెక్కన డబ్బులు తీసుకుంటారు. వారు వైద్యసిబ్బందికి జీవ వ్యర్థాలను ఎలా బుట్టల్లో వేయాలో అవగాహన కల్పించాలి. కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలి. వైద్యాధికారుల పర్యవేక్షణ పెరగాలి.  


ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటాం
- వెంకట నర్సు, ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌, కాలుష్య నియంత్రణ మండలి, వరంగల్‌

ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో ఉత్పత్తయ్యే జీవ వ్యర్థాలను సేకరించి, ధ్వంసం చేసేందుకు వరంగల్‌లో కాకతీయ బయోవేస్ట్‌ మేనేజిమెంట్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంటు ఉంది. వారికి జీవవ్యర్థాలను ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్న ఆసుపత్రులకే మా మండలి నుంచి అనుమతి ఇస్తాం. అనుమతిలేని ఆసుపత్రులు, సాధారణ చెత్తలో జీవవ్యర్థాలు వేస్తున్న ఆసుపత్రుల గురించి ఫిర్యాదులు రాలేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం.


అంకెల్లో వివరాలు..
ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాలు: 85
సామాజిక : 12
జిల్లా ఆసుపత్రులు : 6  ఆయుర్వేద : 1
ఆయుష్‌ డిస్పెన్సరీలు: 45
ప్రైవేటు దవాఖానాలు: 1621,    

ఆర్‌ఎంపీలు: 4200

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని