logo

‘పట్టా’ రాని ఆవేదన!

రెవెన్యూ చిక్కులు లేకుండా ఉండేందుకు ప్రభుత్వం భూప్రక్షాళన చేపట్టి కొత్త పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ చేయడంతో పాటు ధరణి పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. అయినప్పటికీ పట్టాదారు పాసుపుస్తకాలు రాక రెవెన్యూ అధికారులు పెడుతున్న కొర్రీలతో అన్నదాతలకు

Published : 24 May 2022 04:01 IST

ఈనాడు డిజిటల్‌, మహబూబాబాద్‌: రెవెన్యూ చిక్కులు లేకుండా ఉండేందుకు ప్రభుత్వం భూప్రక్షాళన చేపట్టి కొత్త పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ చేయడంతో పాటు ధరణి పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. అయినప్పటికీ పట్టాదారు పాసుపుస్తకాలు రాక రెవెన్యూ అధికారులు పెడుతున్న కొర్రీలతో అన్నదాతలకు అవస్థలు తప్పడం లేదు. తహసీల్దార్‌ కార్యాలయం.. కలెక్టరేట్‌లో జరిగే ప్రజావాణికి వెళ్లి అర్జీలు సమర్పించినా ఫలితం కానరాలేదని బాధితుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది.
బాధిత రైతులు సుమారు మూడేళ్ల నుంచి రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. భూ ప్రక్షాళన సమయంలో పట్టాదారు పాసు పుస్తకాలు రాకపోవడంతో వాటి కోసం అధికారుల వద్దకు వెళ్తున్నా ఫలితం కానరావడం లేదు. ధరణి పోర్టల్‌ వచ్చాక కూడా మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్నా పరిష్కారం లభించలేదు. దీంతో బ్యాంకుల్లో రుణాలు రాక.. పెట్టుబడి సాయానికి నోచుకోవడం లేదు.

పెండింగ్‌లో 174 అర్జీలు
జిల్లాలో రెండు రెవెన్యూ డివిజన్లు, 16 మండలాలున్నాయి. వీటి పరిధిలో ప్రస్తుతం వచ్చిన సుమారు 174 అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయి. అందులో అయా మండలాలకు 40 అర్జీలను ఫార్వర్డు చేయగా 138 చేయాల్సి ఉంది.
ఇతను మహబూబాబాద్‌ మండలంలోని నడివాడకు చెందిన మహ్మద్‌ అంకూస్‌. రైల్వే విశ్రాంత ఉద్యోగి. గ్రామంలోని సర్వే నంబరు 149/1/సీ, 150/బి, 182/74/బి, 182/2/బిలో రెండు ఎకరాల పదమూడున్నర గుంటల భూమి ఉంది. భూప్రక్షాళన సమయంలో ఉద్యోగరీత్యా గ్రామంలో అందుబాటులో లేకపోవడంతో రెవెన్యూ అధికారులు కొత్త పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వలేదు. తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. ధరణిలో దరఖాస్తు చేసుకోవాలని చెబితే 2020, నవంబరు 3న చేశారు. అధికారులు పరిశీలించి పట్టాదారు పాసుపుస్తకం జారీ చేయడం లేదు. దీని వల్ల రైతబంధు సాయం అందడం లేదని..ఇప్పటికైనా పట్టాదారు పాసుపుస్తకం అందించాలని కోరుతున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉన్నప్పుడు పంపిణీ చేసిన పట్టాదారు పాసుపుస్తకాన్ని పట్టుకున్న ఇతని పేరు గుగులోతు తిరుపతి. వీరిది మహబూబాబాద్‌ మండలం అమనగల్‌ పరిధిలోని భజనతండా. ఇతని తండ్రి గుగులోతు బావుసింగ్‌ పేరిట ఆరు ఎకరాల ఇరవై గుంటల భూమి ఉంది. భూప్రక్షాళన సమయంలో వీరి భూమిని మరో రైతుకు పట్టా అందించారు. ఈ సమస్య పరిష్కరించాలంటూ బాధితులు రెండేళ్లుకు పైగా తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. పలుమార్లు ప్రజావాణికి వచ్చి అర్జీ సమర్పించినా భూమి తమ పేరిట కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కురవి మండలం తాళ్లసంకీసకు చెందిన భూక్య సుక్యకు అదే మండలంలోని ఉప్పరిగూడెం శివారులో రెండు సర్వేనంబర్లలో రెండు ఎకరాల తొమ్మిది గుంటల భూమి ఉంది. సర్వేనంబరు 541/ఎ/1లోని 1-02 ఎకరాల భూమికి మాత్రమే కొత్త పట్టాదారు పాసుపుస్తకం ఇచ్చారు. సర్వేనంబరు 540/ఈ లోని 1-07 ఎకరాల భూమిని చేర్చాలని ధరణిలో దరఖాస్తు చేసుకున్నారు. డిజిటల్‌ సైన్‌ కోసం మూడేళ్ల నుంచి తహసీల్దార్‌ కార్యాలయానికి 15 సార్లు, ప్రజావాణికి మూడుసార్లు వచ్చారు. కార్యాలయాల చుట్టూ తిరగడానికి, ధరణిలో దరఖాస్తు చేసుకోవడానికి ఇప్పటి వరకు రూ.4 వేల వరకు ఖర్చు అయ్యాయని అయినా అధికారులు కరణించడం లేదని రైతు సుక్య విచారం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని