logo

ఉద్యోగార్థులే.. విలేకరులై

పోలీసు, గ్రూప్‌ 1 ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు సోమవారం విలేకరులుగా మారి మహబూబాబాద్‌ ఎస్పీ శరత్‌ చంద్ర పవార్‌తో ముఖాముఖి నిర్వహించారు. ‘ఈనాడు’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి స్థానిక జిల్లా గ్రంథాలయంలో చదువుకునే అభ్యర్థులు హాజరయ్యారు.

Published : 24 May 2022 04:01 IST

ఈనాడు డిజిటల్‌, మహబూబాబాద్‌


అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేసిన ఎస్పీ శరత్‌చంద్రపవార్‌

పోలీసు, గ్రూప్‌ 1 ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు సోమవారం విలేకరులుగా మారి మహబూబాబాద్‌ ఎస్పీ శరత్‌ చంద్ర పవార్‌తో ముఖాముఖి నిర్వహించారు. ‘ఈనాడు’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి స్థానిక జిల్లా గ్రంథాలయంలో చదువుకునే అభ్యర్థులు హాజరయ్యారు.
బి.సురేష్‌:  పోటీ పరీక్షలు రాయడానికి చిన్న నాటి నుంచే లక్ష్యాన్ని ఎంచుకోవాలా?
ఎస్పీ: చిన్నప్పుడే లక్ష్యాన్ని ఎంచుకోవడం మంచిదే. నేనైతే సివిల్స్‌ రాయాలనే లక్ష్యాన్ని 24 ఏళ్ల వయసులో నిర్ణయించుకున్నా. ఆ దిశగా పుస్తకాలను సేకరించి చదివాను. రెండు సార్లు చివరి వరకు వచ్చి తప్పినా నిరాశ చెందలేదు. మూడో ప్రయత్నంలో ఐపీఎస్‌ సాధించాను. ఇప్పుడు మీ ముందు మీ జిల్లా ఎస్పీగా ఉన్నాను.
ఎన్‌.సురేష్‌: అన్ని పోటీ పరీక్షలకు కామన్‌ సిలబస్‌ ఉంటుందా? గ్రూప్స్‌నకు ఎలా సిద్ధం కావాలి. సివిల్స్‌కు సిలబస్‌ ఏవిధంగా ఉంటుంది.
* కామన్‌ సిలబస్‌ ఉంటుంది. జనరల్‌ స్టడీస్‌, ఇంగ్లిష్‌, దేశ, తెలంగాణ చరిత్ర, ఇలా తదితర సబ్జెక్టులుంటాయి. కొన్నింటికి మ్యాథ్స్‌, రీజనింగ్‌ అంశాలుంటాయి. గ్రూప్స్‌ రాసే వారు అకాడమీ పుస్తకాలతో పాటు దినపత్రికలు విధిగా చదవాలి. సివిల్స్‌ రాయాలనుకుంటున్న వారు కూడా అకాడమీతో పాటు ఎన్‌సీఆర్టీ పుస్తకాలను చదవాలి. ప్రాథమిక అంశాలపై పట్టు సాధించాలి.
రంజిత్‌: పోటీ పరీక్షలకు ఇంటి వద్ద ఉంటూ చదువుకోవచ్చా.. కోచింగ్‌ సెంటర్లకు వెళ్లి చదువుకోవడం మంచిదా?
* శిక్షణ కేంద్రానికి వెళ్లడం మంచిదే. దీంతో సిలబస్‌, చదివే విధానం తెలుస్తుంది. ఒకవేళ ఇంట్లో చదువుకున్నా ఇబ్బంది ఉండదు. కాకపోతే అనుకూలమైన వాతావరణం ఉండాలి.
నరేశ్‌: డీఎస్సీతో పాటు పోలీస్‌, గ్రూప్‌ ఉద్యోగాల కోసం చదువుతున్నాం. వాటికి పుస్తకాలు చదివితే సరిపోతుందా..?నోట్స్‌ సిద్ధం చేసుకోవాలా?
* ప్రకటన వచ్చాక పరీక్షలకు ఎంత సమయం ఉందో చూసుకోవాలి. మంచి పుస్తకాలను ఎంచుకుని చదవాలి. అవి గుర్తుండేలా నోట్స్‌ సిద్ధం చేసుకోవడం మంచి ప్రయోజనం. దాని వల్ల ప్రతి అంశం గుర్తుండడంతో పాటు మళ్లీ ఆ నోట్స్‌ను తిరిగేస్తుంటే చదివిన అంశాలు గుర్తుకు వస్తాయి. పోలీసు ఉద్యోగాల కోసం చదివే అభ్యర్థులు ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్‌ కూడా ముఖ్యమే. అందులోనూ నిర్ణీత సమయానికి పూర్తి చేసేలా తర్ఫీదు పొందాలి.

ప్రిలిమ్స్‌కు ముందురోజు సినిమాకెళ్లాను..
షరీఫ్‌: పరీక్ష హాల్‌ అంటే భయం ఉంటుంది. దానిని ఏవిధంగా దూరం చేసుకోవాలి. రోజుకు ఎన్ని గంటల పాటు చదవాలి?
* ఏకాగ్రతతో చదివితే ఎలాంటి భయం ఉండదు. నేను ప్రిలిమ్స్‌కు ముందు రోజు సినిమాకు వెళ్లాను. రోజుల తరబడి చదివిన వారు పరీక్షకు ముందు చదవకున్నా ఫర్వాలేదు. అలాగే రోజుకు ఎన్ని గంటలు చదివాం అన్నది ముఖ్యం కాదు. ఏ రోజు చదివింది.. అదే రోజు రాత్రి రివిజన్‌ చేసుకోవాలి. ఉదయం పూట చదవడం చాలా మంచిది. కొందరు రోజుకు 14, 16 గంటల పాటు చదివే వారున్నారు. నేనైతే రోజుకు 8 నుంచి 9 గంటల పాటు ఒత్తిడి లేకుండా షెడ్యూలు తయారు చేసుకుని చదివాను. మధ్య మధ్యలో అరగంట పాటు విశ్రాంతి తీసుకున్నా. ఆ సమయంలో ఇష్టమైన పనులు చేసేది. మీరు కూడా ఇలా చేస్తే సరిపోతుంది. కానీ ఒక రోజు చదివి..మూడు రోజులు పుస్తకం పట్టకుండా ఉండొద్దు. దాని వల్ల నష్టమే. పరీక్షలకు నాలుగు నెలల సమయం ఉందటే అన్ని రోజులు చదవాల్సిందే.
శ్రీకాంత్‌: పుస్తకాలు చదువుతున్నప్పుడు బాగానే ఉంది. సమయానికి గుర్తుకొస్తాయో..లేదో.. అనే నెగెటివ్‌ ఆలోచన వస్తుంది. ఎలా బయట పడాలి.
* మన మెదడు భూమిలాంటిది. ఎలాంటి విత్తనాలు నాటితే అవే వస్తాయి. నాటకుంటే గడ్డి మొలకెత్తుతుంది. ఏకాగ్రతతో, పాజిటివ్‌ దృక్పథంతో చదివితే చాలు అవే గుర్తుంటాయి. పరీక్ష రాసేటప్పుడు భయాందోళనకు గురికావొద్దు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు