logo

ప్రజావేదన.. పరిష్కారం చూపాలిక..!

జిల్లా పాలనాధికారి సీహెచ్‌.శివలింగయ్య అధ్యక్షతన కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు భాస్కర్‌రావు, అబ్దుల్‌ హమీద్‌ ప్రజా సమస్యలను స్వీకరించారు. వాటిని పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులకు బదిలీ చేశారు.

Published : 24 May 2022 04:01 IST

విద్యా సమస్యలు తెలుసుకుంటున్న జిల్లా పాలనాధికారి శివలింగయ్య, చిత్రంలో అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు


జనగామ అర్బన్‌, న్యూస్‌టుడే: జిల్లా పాలనాధికారి సీహెచ్‌.శివలింగయ్య అధ్యక్షతన కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు భాస్కర్‌రావు, అబ్దుల్‌ హమీద్‌ ప్రజా సమస్యలను స్వీకరించారు. వాటిని పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులకు బదిలీ చేశారు. వినతుల విషయంలో ఆయా శాఖల అధికారులు నిర్లక్ష్యం చేయకుండా సత్వరమే పరిశీలించి పరిష్కరించేలా చూడాలని పాలనాధికారి ఆదేశించారు. మొత్తం 46 అర్జీలు అందజేయగా ఇందులో 26 భూ సమస్యలకు సంబంధించినవే ఉన్నాయి.

అర్జీల్లో కొన్ని ఇలా..
* లింగాలఘనపురం మండలం చీటూరుకు చెందిన దివ్యాంగులు కలమ్మ, బుచ్చమ్మ రుణం మంజూరు చేస్తే దుకాణం పెట్టుకుంటానని దరఖాస్తు అందజేశారు. ః  నర్మెట్టకు చెందిన దివ్యాంగుడు గోపగోని శ్రీనివాస్‌గౌడ్‌ తనకు పింఛన్‌ మంజూరు చేయాలని కోరారు. ఇదే మండలానికి చెందిన ఐలేని కృష్ణారెడ్డి తనకు చెందిన 4.26 ఎకరాల భూమిలో అరెకరం భూమిని ఇతరులు ఆక్రమించుకున్నారని చర్యలు తీసుకోవాలని కోరారు. ః  స్టేషన్‌ఘన్‌పూర్‌కు చెందిన రడపాక బంగారు నాని ఉపాధి కోసం ఏదైన రుణం ఇప్పించాలన్నారు. ః  దేవరుప్పుల మండలం నీర్మాలకు చెందిన మేడ సుధాకర్‌ అనే దివ్యాంగుడు ఎస్సీ కార్పొరేషన్‌ కింద చెప్పుల దుకాణం పెట్టుకునేందుకు రుణం మంజూరు చేయాలని కోరారు.


ప్రేమించి, పెళ్లాడి వద్దంటున్నాడు
- చీకటి దివ్య, లింగంపల్లి, బచ్చన్నపేట

ఆమ్‌రాజ్‌ సంపత్‌ నన్ను ఆరు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు నన్ను వదిలేయడానికి ప్రయత్నిస్తున్నాడు. పెళ్లయ్యాక నెల రోజులు బాగానే ఉండి, ఇప్పుడు వేధిస్తూ ఇంటి నుంచి బయటకు పంపించాడు. నన్ను చంపేస్తామని నా భర్త, అత్త, మరిది భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలంటూ ప్రజావాణికి వచ్చాను. నా భర్తకు కౌన్సెలింగ్‌ ఇప్పించాలని అదనపు కలెక్టర్‌ డీడబ్ల్యూవోకు చెప్పారు.


మీసేవకు వెళ్లమంటున్నారు..
- నల్ల లక్ష్మయ్య, నెల్లుట్ల, లింగాలఘనపురం

నా పేరు మీద లింగాలఘనపురం శివారులో సర్వే నెం.228లో 6.38 ఎకరాల భూమి ఉంది. పట్టా పుస్తకంలో మాత్రం సర్వే నెం.232 అని తప్పు పడింది. దీనిని సవరించాలంటూ ప్రజావాణిలో దరఖాస్తు ఇస్తే మీసేవకు వెళ్లి చేసుకోమంటున్నారు. అక్కడికి వెళ్తే ఇంకా సవరించుకునే అవకాశం ఇవ్వలేదని చెబుతున్నారు. భూమి రికార్డులను పరిశీలించి మీసేవ పహాణి, 1బి, పట్టా పుస్తకంలో సర్వే నంబర్‌ను సవరించాలని వేడుకుంటున్నా.


గ్రామంలో నాణ్యతలేని పనులు
- కోట వెంకన్న, ఎదునూతుల, కొడకండ్ల

మా గ్రామంలో ప్రభుత్వ నిధులతో చేపడుతున్న మురుగునీటి కాల్వ, సీసీరోడ్లు నాణ్యతగా ఉండడం లేదు. హరితహారం, శ్మశానవాటిక పనులు సక్రమంగా చేయడం లేదు. సర్పంచి గ్రామంలో లేకున్నా ఆయన భర్త ఫోర్జరీ సంతకాలతో చేస్తూ నిధులు డ్రా చేస్తున్నారు. దీనిపై మా గ్రామస్థులు గతంలో కూడా ఫిర్యాదు చేశారు. ఈ రోజు కూడా మా గ్రామస్థులతో కలిసి నాణ్యతలేని పనులపై క్వాలిటీ కంట్రోల్‌ అధికారులతో దర్యాఫ్తు జరిపించాలని కోరాం.


పోచమ్మ గుడిని కాపాడాలంటూ..
పాలకుర్తిలోని షెడ్యూల్డ్‌ కులాల వారి పోచమ్మ గుడి స్థలాన్ని కాపాడాలంటూ ఆ గ్రామానికి చెందిన పలువురు కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశారు. పట్టాదారైన వీరమన్నేని లక్ష్మినర్సయ్య పోచమ్మ గుడిని నిర్మించుకునేందుకు 12 గుంటల భూమిని ఇచ్చారు. ఆయన మరణాంతరం వారి కుమారుడైన వీరమన్నేని కమలాకర్‌రావు 1975లో రోడ్డు విస్తరణలో పోగా మిగిలిన ఏడు గుంటల భూమిని గుడి నిర్మించుకునేందుకు భూదాన పత్రం రాసి ఇచ్చారు.  ఇప్పుడు ఆ భూమిని పలువురు కొనుగోలు చేశామని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఉన్నతాధికారులకు విన్నవించినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.


శాఖల వారీగా దరఖాస్తులు..
డీపీవో : 7
పురపాలిక : 5
పోలీస్‌ : 3
ఆర్డీవోల  పరిధిలోనివి: 6
తహసీల్దార్ల  రిధిలోనివి: 16
ఎస్సీ  కార్పొరేషన్‌ : 2
‹ఖ : 2
ఇతర : 5

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని