logo

యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు.. నిబంధనలకు నీళ్లు

ఏటూరునాగారం మండల పరిధిలోని గోదావరి, జంపన్నవాగులో పట్టా భూముల పేరుతో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు కొనసాగిస్తున్నారు. అక్రమార్కులు నిబంధనలు ఉల్లంఘించి సొమ్ము చేసుకుంటున్నారు.

Published : 24 May 2022 04:17 IST

ఏటూరునాగారం రామన్నగూడెం క్వారీలో లారీలో ఇసుక నింపుతున్న పొక్లెయిన్‌

ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి, ఏటూరునాగారం, న్యూస్‌టుడే: ఏటూరునాగారం మండల పరిధిలోని గోదావరి, జంపన్నవాగులో పట్టా భూముల పేరుతో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు కొనసాగిస్తున్నారు. అక్రమార్కులు నిబంధనలు ఉల్లంఘించి సొమ్ము చేసుకుంటున్నారు. ఏటూరునాగారం పట్టణానికి ఒకవైపు జంపన్నవాగు, మరోవైపు గోదావరి నది ఉంటాయి. ఈనెల 14 తేదీన ఏటూర్‌నాగారం మండలం చిన్నబోయినపల్లిలోని తనిఖీ కేంద్రంలో అదనపు లోడుతో వెళ్తున్న 8 లారీలను అధికారులు పట్టుకున్నారు. అంతకుముందు ఒకసారి 7 లారీలు, మరోసారి 6 లారీలు పట్టుబడ్డాయి. కేవలం నెల రోజుల వ్యవధిలోనే 21 లారీలను పట్టుకున్నారు.

పట్టాభూముల పేరుతో..
ఏటూరునాగారం శివారులో 398/ఏ సర్వే నంబర్‌లోని 1.15 ఎకరాల భూమిలో 9,304 క్యూబిక్‌ మీటర్ల ఇసుక, 392/ఏ సర్వే నంబర్‌లోని 3.38 ఎకరాల్లో 27,372 క్యూబిక్‌ మీటర్లు, 391 సర్వే నంబర్లోని 1.12 ఎకరాల భూమిలో 9,034 క్యూబిక్‌ మీటర్ల ఇసుక, 384/బీ సర్వే నంబర్‌లోని 1.29 ఎకరాల భూమిలో 10,462 క్యూబిక్‌ మీటర్ల ఇసుక మొత్తం 56,172 క్యూబిక్‌ మీటర్ల ఇసుక తవ్వుకునేందుకు అనుమతులిచ్చారు. జంపన్నవాగులో కలిసిన ఈ భూమిని గుర్తిస్తూ రెవెన్యూ అధికారులు ఇష్టారాజ్యంగా హద్దు

రాళ్లను పాతారు. అవి పూర్తిగా ఏటూరునాగారం వైపు ఉన్న ఒడ్డుకు 20 మీటర్ల దూరంలోనే ఉన్నాయి. పట్టాభూముల పేరుతో రైతులు అక్కడి వరకూ ఇసుక తవ్వేస్తున్నారు.

వ్యవసాయానికి పనికొస్తాయా?
రైతుల పట్టా భూముల్లో ఇసుక తొలగిస్తే మేటలు తొలగిపోయి భూములు బయట పడే వరకు తవ్వాల్సి ఉంటుంది. అదే గోదావరిలో ఇసుక క్వారీ నిర్వహిస్తే నిబంధనల ప్రకారం 2 మీటర్లకు దాటి పోయే అవకాశం ఉండదు. జంపన్నవాగు ఇసుక క్వారీలో 2 నుంచి 3 మీటర్ల లోతు వరకు ఇసుక తవ్వుకునేలా అనుమతించారు. ఒక్కో చోట 5 మీటర్ల నుంచి 10 మీటర్ల లోతు వరకు తోడినా మట్టి బయటకు రావడం లేదు. నీళ్లలో నుంచి సైతం ఇసుకను తోడుకుంటున్నారు. 10 మీటర్ల లోతు తవ్వినా మట్టి రాకపోవడంతో వ్యవసాయానికి ఈ భూములు పనికొస్తాయా లేదా అనే సందేహం వ్యక్తమవుతోంది.
కరకట్టకు పొంచి ఉన్న ప్రమాదం
ప్రతి వర్షాకాలం ఏటూరునాగారం వరద ముంపునకు గరయ్యేది. 1986లో గోదావరి, జంపన్నవాగు పోటెత్తడంతో ఊరంతా కొట్టుకుపోయింది. దీంతో 2001లో ప్రభుత్వం  కరకట్టను నిర్మించింది.  ఈ కరకట్టకు 2008లో రూ.10 కోట్లతో మరమ్మతులు చేశారు. తాజాగా మళ్లీ రూ.114 కోట్లతో పాతకట్టకు మరమ్మతులు చేపట్టి, కొత్త పనులు సైతం చేస్తున్నారు. జంపన్నవాగులో ఇసుకను తోడితే ఏటూరునాగారం చుట్టూ ఉన్న కరకట్ట కొట్టుకుపోయే ప్రమాదముంది. కరకట్ట దెబ్బతింటే సగం ఊరు గోదావరిలో కలవడం ఖాయమని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సర్వే నివేదికలపై అనుమానాలెన్నో?
జంపన్నవాగులో సర్వే నివేదికలపై అనుమానాలున్నాయి. ఈ పట్టా భూమిలో ఇసుక తోడితే కరకట్టకు ప్రమాదం లేదని నీటిపారుదలశాఖ అధికారులు ఇచ్చిన నివేదికపై అనుమానాలున్నాయి. వ్యవసాయశాఖ అధికారుల సంయుక్త సర్వేలో ఈ భూముల్లో ఇసుక తీస్తే వ్యవసాయ యోగ్యమవుతాయని నివేదిక ఇవ్వడం, భూగర్భ జలవనరులశాఖ అధికారులు, జాయింట్‌ సర్వే చేసే వివిధశాఖల అధికారులు ఫీజిబులిటీ నివేదికలివ్వడంపై స్థానికంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్వారీ అనుమతులపై విచారణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

అధిక లోడుతో ఆదాయానికి గండి..
అక్రమార్కులు నిబంధనలకు విరుద్ధంగా లారీల్లో అధిక ఇసుక నింపుకుంటూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. సాధారణంగా క్యూబిక్‌ మీటరు ఇసుకకు రూ.600 ధరతో పాటు అదనంగా జీఎస్టీ కలుస్తుంది. నిబంధనల ప్రకారం పది టైర్ల లారీలో 12 క్యూబిక్‌ మీటర్ల ఇసుక, పన్నెండు టైర్ల లారీలో 16 క్యూబిక్‌ మీటర్లు, పద్నాలుగు టైర్ల లారీలో 20 క్యూబిక్‌ మీటర్ల ఇసుక నింపుతారు. ఆ ప్రకారమే ఒక క్యూబిక్‌ మీటరు ఇసుకకు రూ.600 చొప్పున లెక్కించి డీడీ తీయాల్సి ఉంటుంది. గుత్తేదారు పొక్లెయిన్‌ అదనపు బకెట్‌తో ఇసుక నింపి డీడీకి అదనంగా తీసుకుంటున్నారు. ఒక్కో బకెట్‌ ఇసుకకు రూ.2 వేలు అదనంగా తీసుకుంటున్నట్లు సమాచారం. ఇది టీఎస్‌ఎండీసీ అధికారుల కనుసన్నల్లోనే జరుగుతున్నా తమకేమీ తెలియనట్లుగా వ్యవహరిస్తున్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని