logo

ఓరుగల్లును మరోసారి ముంచొద్దు

2020 సెప్టెంబరు నెలఖారులో నాలుగు రోజుల పాటు వరంగల్‌ త్రినగరాలు వరదనీటిలో చిక్కుకున్నాయి. 45 కాలనీలు నీట మునిగాయి.  25 వేల మంది ఇళ్లు ఖాళీ చేసి సహాయ పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారు.

Updated : 27 May 2022 05:10 IST

 వచ్చేది వర్షాకాలం.. ముందస్తు చర్యలే శ్రీరామరక్ష

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే

2020 సెప్టెంబరు నెలఖారులో నాలుగు రోజుల పాటు వరంగల్‌ త్రినగరాలు వరదనీటిలో చిక్కుకున్నాయి. 45 కాలనీలు నీట మునిగాయి.  25 వేల మంది ఇళ్లు ఖాళీ చేసి సహాయ పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారు.


వరంగల్‌ నగరంలో ముంపు సమస్యే ఉండొద్దు.. శాశ్వత ప్రణాళికలు రచించాలి.  ప్రధాన నాలాలు విస్తరించి.. ఇరువైపులా గోడలు కట్టాలి. ఎన్ని కోట్లు ఖర్చైనా ఫర్వాలేదు.. వరంగల్‌కు ముంపు లేకుండా చూడాలి.

- 2020 అక్టోబరులో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌


వరంగల్‌ మహా నగరం.. వర్షాకాలం వచ్చిందంటే చాలు ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతారు. ఏటా వరద ముంపు ఎక్కువవుతోంది. శివారు వరదనీరు నగరాన్ని అతలాకుతలం చేస్తోంది. మళ్లీ వర్షాకాలం సమీపించింది. ఈసారి ఏమవుతుందోననే ఆందోళన నెలకొంది.
ఇదీ పరిస్థితి.. మంత్రి కేటీఆర్‌ ఆదేశాలతో ముంపు నివారణకు రూ.258 కోట్లతో అంచనాలు రూపొందించారు. ఇందులో రూ.180 కోట్ల నిధులు విడుదలయ్యాయి. రెండేళ్లవుతున్నా ఒక్క పని పూర్తవ్వలేదు. అధికారుల నిర్లక్ష్యంతో నాలాల విస్తరణ, గోడలు కట్టే పనులు ప్రాథమిక దశలోనే ఉన్నాయి.


ఇది అత్యంత ప్రమాదకారి..

బొందివాగు నాలా అత్యంత ప్రమాదకరం. 1.50 కిలో మీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. భారీ వర్షాలు పడితే 15-20 వేల క్యూసెక్కుల వరదనీరు పారుతుంది. బెస్తం చెరువు, మద్దెలకుంట, ఉర్సు చెరువు, భట్టుపల్లి, న్యూశాయంపేట కోటి చెరువు మత్తడి పోస్తే వరదనీరంతా నేరుగా బొందివాగు నాలాకు వస్తాయి. హంటర్‌రోడ్‌, ఎన్టీఆర్‌నగర్‌, సాయినగర్‌, సంతోషిమాత కాలనీ, గాయత్రినగర్‌, భద్రకాళినగర్‌, రామన్నపేట బీసీ కాలనీ, రఘునాథ్‌కాలనీలకు ముంపు సమస్య ఉంటుంది.
* ఇలా చేయాలి: 110-120 అడుగులు విస్తరించాలి. భద్రకాళి చెరువు వద్ద ఫ్వలింగ్‌ షట్టర్లు ఏర్పాటు చేయాలి.


2021 ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో వరదనీరు నగరాన్ని ముంచెత్తింది. 30 కాలనీలు నీటమునిగాయి. 3 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు.  


నయీంనగర్‌ నాలా

హనుమకొండ వడ్డేపల్లి, గోపాల్‌పూర్‌ చెరువులు నిండితే పలు కాలనీలు నీట మునుగుతున్నాయి. జవహార్‌నగర్‌, 100 ఫీట్ల రోడ్డు, సమ్మయ్యనగర్‌, రాజాజీనగర్‌, నయీంనగర్‌, పోచమ్మకుంట మీదుగా కెనాల్‌ వరకు సుమారు 5.50 చదరపు కిలో మీటర్లు విస్తరించింది.
*  నాలా విస్తరణ 50 శాతం పూర్తయింది. ప్రెసీడెన్సీ స్కూల్‌ దగ్గర కొత్తగా అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనులు కొనసాగుతున్నాయి.
వరంగల్‌ భద్రకాళి నాలా: కేఎంజీ పార్కు నుంచి సరస్వతికాలనీ, రంగంపేట, ములుగురోడ్‌, అలంకార్‌, కాకతీయ కాలనీ, పెద్దమ్మగడ్డ వరకు సుమారు 3.63 చదరపు కిలో మీటర్ల విసీˆ్తర్ణంలో ఉంటుంది. బొందివాగు, హంటర్‌రోడ్‌ 12 మోరీల నాలా, పోతననగర్‌ భద్రకాళి మత్తడి ద్వారా వరదనీరు వస్తుంది. 12-15 వేల క్యూసెక్కుల వరదనీరు పారుతోంది. ఐదారేళ్లుగా ప్రమాదకరంగా మారింది. రంగంపేట, సరస్వతి కాలనీ, భద్రకాళిరోడ్‌, పోతననగర్‌, ములుగురోడ్‌ నీట మునుగుతోంది.
* 50-60 అడుగులు విస్తరించారు. ఇరువైపులా గోడలు కట్టాలి.
అన్నీ ఆక్రమణలే: కరీమాబాద్‌ సాకరాశికుంట నాలాను కుదించేశారు. ఇరువైపులా అన్నీ ఆక్రమణలే. ఏకశిలానగర్‌, ఎస్‌ఆర్‌ఆర్‌ తోట మీదుగా హంటర్‌రోడ్‌ బొందివాగు నాలా వరకు 1.50 చదరపు కిలో మీటర్లు ఉంటుంది.
* 40 అడుగులు విస్తరించాలి.
వరంగల్‌ రైల్వేగేటు నాలాకు కొత్త సమస్య వచ్చి పడింది. మూడో రైల్వేలైన్‌ పనులతో దీన్ని కుదించారు. దీంతో వచ్చే వర్షాకాలం దీంతో ముప్పు పొంచి ఉందని భావిస్తున్నారు.
* హనుమకొండ సమ్మయ్యనగర్‌, నయీంనగర్‌ నాలాల ఆధునికీకరణ పనులకు శంకుస్థాపనలు జరిగినా పనులు మొదలవ్వలేదు.
కాజీపేట బంధం చెరువు: కాజీపేట, హనుమకొండ ప్రాంతాల్లోని వరదనీరంతా నేరుగా బంధం చెరువు నాలాలోకి వెళ్తాయి. సుమారు 1.50 చదరపు కిలో మీటర్లు ఉంటుంది.
* రామకృష్ణ కాలనీ నుంచి బంధం చెరువు వరకు నాలా విస్తరించాలి.
చిన్నవడ్డేపల్లి నాలా: దేశాయిపేట చిన్నవడ్డేపల్లి చెరువు నాలా ప్రమాదకరమే. సుమారు 1.80 చదరపు కిలో మీటర్లు ఉంటుంది.  ఇది  ఇరుకుగా ఉంటుంది.
* 40-50 అడుగులు విస్తరించాలి.
ఏం చేయాలంటే..
* నాలాల విస్తరణ పనులు వెంటనే చేపట్టాలి. లోతు పెంచాలి. వరదనీరు సాఫీగా వెళ్లేలా పిచ్చి చెట్లు, వ్యర్థాలు తొలగించాలి. చుట్టూ గోడలు కట్టాలి.
* 66 డివిజన్లలో అంతర్గత డ్రైనేజీల్లో పూడికతీత పనులు చేపట్టాలి.
* 45 ముంపు కాలనీలు గుర్తించారు. ముందస్తుగా కచ్చ కాల్వలు తీయాలి.
* దిగువున ఉన్న కాలనీల్లో మట్టి నింపాలి.
* నగర శివారు నుంచి వచ్చే వరదనీరు సాఫీగా బయటకు వెళ్లేలా చూడాలి.
* ప్రధాన డ్రైనేజీల ఇన్‌, అవుÆట్‌లెట్లు క్లియర్‌ చేయాలి.
* ముంపు కాలనీల్లో నాలుగు నెలల పాటు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.
నగరవాసి మాట: హంటర్‌రోడ్‌ బొందివాగు నాలా అత్యంత ప్రమాదకరం. దీన్ని విస్తరించి చుట్టూ గోడలు కట్టాలి. భద్రకాళి చెరువు దగ్గర ఫ్వలింగ్‌ షట్టర్లు పెద్దవి ఏర్పాటు చేయాలి.        - మర్రి రవీందర్‌, హంటర్‌రోడ్‌
పాలకుల హామీ:  నాలాల విస్తరణపై దృష్టి సారించాం. పనులు వేగవంతం చేస్తాం. వర్షాకాలం ప్రారంభంలోపు  పూర్తి చేసి ఈ వర్షాకాలం ముంపు సమస్య రాకుండా అన్ని చర్యలు తీసుకుంటాం  - మేయర్‌ సుధారాణి

అంకెల్లో వివరాలు..
నగరం విస్తీర్ణం
407 చదరపు కిలో మీటర్లు
డ్రైనేజీ వ్యవస్థ
1433.02 చ.కి.మీ
ప్రధాన నాలాల విస్తీర్ణం
54.58 చ.కి.మీ
ఒక మీటరు మురుగు కాల్వలు
151.06 చ.కి.మీ
పక్కా డ్రైనేజీ
882.21 చ.కి.మీ
కచ్చ కాల్వలు
344.27 చ.కి.మీ.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని