logo

హడావుడిగా కట్టబెట్టారు..!

నాలుగో విడత పట్టణ ప్రగతి కార్యక్రమం సన్నద్ధత పేరుతో హడావుడిగా అభివృద్ధి పనులు చేపడుతున్నారు. సమయం లేదు మిత్రమా.. అంటూ టెండర్లు లేకుండానే నామినేషన్‌ పనులు కేటాయిస్తున్నారు.

Published : 27 May 2022 03:25 IST

రూ.1.20 కోట్లతో 24 క్రీడా ప్రాంగణాలు
కార్పొరేషన్‌, న్యూస్‌టుడే

వరంగల్‌లో ఆట స్థలాన్ని చదును పనులు

నాలుగో విడత పట్టణ ప్రగతి కార్యక్రమం సన్నద్ధత పేరుతో హడావుడిగా అభివృద్ధి పనులు చేపడుతున్నారు. సమయం లేదు మిత్రమా.. అంటూ టెండర్లు లేకుండానే నామినేషన్‌ పనులు కేటాయిస్తున్నారు.
* గ్రేటర్‌ వరంగల్‌లో ఇద్దరు, ముగ్గురు ఇంజినీరింగ్‌ అధికారుల హవా కొనసాగుతోంది. సన్నిహితంగా ఉండే సివిల్‌ గుత్తేదారులకు నామినేషన్‌పై అభివృద్ధి పనులు ఇచ్చేస్తున్నారు. వరంగల్‌, హనుమకొండ ప్రాంతాల్లో 24 క్రీడా ప్రాంగణాల అభివృద్ధి పర్చేందుకు నిర్ణయించారు. వరంగల్‌ ప్రాంతంలో 13, హనుమకొండలో 11 ఉన్నాయి.  ఒక్కో ఆట స్థలానికి రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.1.20 కోట్ల పనులు పంచేశారు. 24 పనులను ఆరుగురు గుత్తేదారులకే కట్టబెట్టారు. వరంగల్‌, హనుమకొండకు ముగ్గురు చొప్పున ఉన్నారు. ఇదేమిటని అడిగితే ఇంజినీరింగ్‌ ఉన్నతాధికారులు టెండర్లు పిలవడానికి సమయం లేదని చెబుతున్నారు. మరోవైపు క్రీడా ప్రాంగణాల పనులు కొందరు గుత్తేదారులకే కేటాయించడంతో మిగతావారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంజినీర్లకు దండిగా కమీషన్లు ముట్టజేప్పిన వారికే నామినేషన్‌ పనులు ఇచ్చారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఏయే పనులు చేస్తారు?: రూ.5 లక్షల నిధులతో ఏయే పనులు చేపట్టాలో డిజైన్‌ చేశారు. ఆట స్థలాన్ని చదను చేసి మట్టి నింపుతారు. వాలీబాల్‌, ఖోఖో, హై జంప్‌, వ్యాయమం చేసే వస్తువులు(ఇనుప బార్లు) తదితర పనులు ప్రతిపాదించారు.
* ఎక్కువ శాతం ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను ఎంపిక చేశారు. మిగిలిన లేఅవుటు ఖాళీ స్థలాలు ఖరారు చేశారు. పట్టణ ప్రగతి నాలుగో విడుత కార్యక్రమం పేరుతో హడావుడిగా ఆట స్థలాలు అభివృద్ధి పరుస్తున్నారు. తర్వాత పర్యవేక్షణ ఎవరు చూస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.

కార్పొరేటర్ల అసంతృప్తి
క్రీడా ప్రాంగణాల పేరుతో నామినేషన్‌ పనులు అప్పగించడంపై కొందరు కార్పొరేటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతేడాది 2021 జూన్‌లో 66 డివిజన్లలో అత్యవసర పనులు చేపట్టేందుకు రూ.5 లక్షల చొప్పున నామినేషన్‌ పనులు కేటాయించాలని గ్రేటర్‌ కౌన్సిల్‌ సమావేశంలో తీర్మానించారు. కార్పొరేటర్లు పనులు ప్రతిపాదిస్తే బల్దియా అధికారులు తిరస్కరించారు. నామినేషన్‌ పనుల్లేవని టెండర్లు పిలిచారు.. ఇప్పుడేలా కేటాయించారని కొంత మంది కార్పొరేటర్లు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై వచ్చే కౌన్సిల్‌ సమావేశంలో తేల్చుకుంటామంటున్నారు.


టెండర్లు పిలవాలని చెప్పాను
- గుండు సుధారాణి, మేయర్‌ గ్రేటర్‌ వరంగల్‌

క్రీడా ప్రాంగణాల అభివృద్ధి పనులు నామినేషన్‌పై కేటాయించిన విషయం నాకు తెలియదు. నా దృష్టికి రాగానే అత్యవసర (షార్ట్‌) టెండర్లు పిలవాలని ఇంజినీర్లకు సూచించారు. ఆరుగురు గుత్తేదారులకే 24 పనులు అప్పగించడం సరైంది కాదు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని