logo

క్షణికావేశం..అనుబంధాలకు అనర్థం

కొందరు మనుషుల్లో బంధాలు, అనుబంధాలు మృగ్యమైపోతున్నాయి. రక్త సంబంధీకులు, దగ్గరి బంధువులనే క్షణికావేశంలో దూరం చేసుకుంటున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఇటీవల జరిగిన ఘటనలే దీనికి నిదర్శనం. ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేయాలంటే మానవ సంబంధాల

Published : 27 May 2022 03:25 IST

డోర్నకల్‌, న్యూస్‌టుడే

కొందరు మనుషుల్లో బంధాలు, అనుబంధాలు మృగ్యమైపోతున్నాయి. రక్త సంబంధీకులు, దగ్గరి బంధువులనే క్షణికావేశంలో దూరం చేసుకుంటున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఇటీవల జరిగిన ఘటనలే దీనికి నిదర్శనం. ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేయాలంటే మానవ సంబంధాల విలువ ప్రతి కుటుంబలోనూ తెలియాలి. అప్పుడప్పుడు బంధువులు ఒకచోట చేరి ఆత్మీయ పలకరింపులతో ఉమ్మడి భావన  నిలబెట్టే ప్రయత్నం చేయాలి.

ఇటీవల జరిగిన ఘటనలు..
* మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం ఇంటికన్నెలో పిల్లనిచ్చిన మామను అల్లుడు హతమార్చాడు. కన్న కొడుకులను వెంట తీసుకెళ్లమన్నందుకు అల్లుడు ఈ దారుణానికి పాల్పడ్డారు
* మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలం ఏపూరు శివారు కోడిపుంజుల   తండాలో నిద్రిస్తున్న భార్యను భర్త మద్యం మత్తులో గొడ్డలితో నరికి చంపేశాడు.
* వరంగల్‌ జిల్లా గీసుకొండ  మండలంలో ఓ కుమారుడు ఆస్తి కోసం తండ్రిపై రోకలి బండతో మోది కడతేర్చాడు.
* కొత్తగూడ మండలం రామన్నగూడెంలో వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భార్య.. భర్తను హతమార్చింది.
* బంధాలన్నింటినీ మరిచి హత్యల వరకు వెళ్లడం వెనక స్వల్ప కారణాలే ఉంటున్నాయని పోలీసులు చెబుతున్నారు. భూమి పంచి ఇవ్వలేదనో, జీవిత భాగస్వామిపై అనుమానంతోనే, వివాహేతర సంబంధాలో ఇలాంటి దుర్ఘటనలకు కారణమవుతున్నాయి. దీనికి తోడు టీవీ సీరియళ్లు, సామాజిక మాధ్యమాలు,  పరిసర వాతావరణం ఈ తరహా పోకడకు కారణ‘భూత’మవుతున్నాయి.
* బంధాలన్నింటినీ మరిచి హత్యల వరకు వెళ్లడం వెనక స్వల్ప కారణాలే ఉంటున్నాయని పోలీసులు చెబుతున్నారు. భూమి పంచి ఇవ్వలేదనో, జీవిత భాగస్వామిపై అనుమానంతోనే, వివాహేతర సంబంధాలో ఇలాంటి దుర్ఘటనలకు కారణమవుతున్నాయి. దీనికి తోడు టీవీ సీరియళ్లు, సామాజిక మాధ్యమాలు,  పరిసర వాతావరణం ఈ తరహా పోకడకు కారణ‘భూత’మవుతున్నాయి.

ఎక్సైజ్‌కాలనీ వన్‌స్టాప్‌ సెంటర్‌లో దంపతులకు కౌన్సెలింగ్‌ ఇస్తున్న సెంటర్‌ డైరెక్టర్‌ దామోదర్‌, కౌన్సెలర్లు

అందరికీ సంకటమే..
పూర్వం ఉమ్మడి కుటుంబంలో ఎంత ఎక్కువ మంది ఉంటే అంత బలం అనుకునేవారు. ఒకరి మీద ఆధారపడటం, ఒకరికొకరు తోడుగా ఉండటం, కలిసి మెలిసి జీవించడం ఆ రోజుల్లోనే సాధ్యమైంది. ప్రపంచం చిన్నదైపోతున్న ఈ రోజుల్లో చిన్న చిన్న కుటుంబాలు, వాటి మధ్య సంబంధాలు క్రమేణా దూరమవుతుండటం బాధిస్తోంది.  ప్రతి సమస్యకు ఒక పరిష్కార మార్గం ఉంటుంది.   క్షణికావేశంలో తీసుకునే నిర్ణయం ఎదుటి కుటుంబానికే కాదు మన ఆప్తులకూ సంకటమే! క్షేత్రస్థాయిలో ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు, పాఠశాలల్లో గురువులు నైతిక విలువలు, బాధ్యతలు, భావిభారత పౌరులు పోషించాల్సిన పాత్రపై చైతన్య పరిస్తే కొంత మేర ఫలితం ఉంటుంది.  
సమస్యలా.. వీరిని సంప్రదించండి
వరంగల్‌క్రైం, న్యూస్‌టుడే: ఇంట్లో గొడవలు, వరకట్న వేధింపులు, ప్రేమ పేరుతో ఇబ్బందులు... ఇలా సమస్య ఏదైనా వీరిని సంప్రదిస్తే న్యాయం జరుగుతుంది.
వన్‌స్టాప్‌ సెంటర్‌  
బాధితులకు ఎలాంటి రుసుం లేకుండా హనుమకొండ ఎక్సైజ్‌కాలనీలో వన్‌స్టాప్‌  కేంద్రం ద్వారా సేవలు అందిస్తున్నారు. కుటుంబ సభ్యులకు కేంద్రంలోని నిపుణులైనవారితో కౌన్సెలింగ్‌ ఇప్పిస్తారు. క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోకుండా కుటుంబ బంధాల గురించి అవగాహన కల్పిస్తారు. ఈ కేంద్రం 24 గంటలు పనిచేస్తుంది.
* టోల్‌ఫ్రీ నెంబరు 181 లేదా నేరుగా ఈ కేంద్రానికి వచ్చి సంప్రదించవచ్చు. కేంద్ర ప్రభుత్వ పథకం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో దీన్ని నిర్వహిస్తున్నారు.

భరోసా కేంద్రం
వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో ఎక్సైజ్‌కాలనీలో భరోసా కేంద్రం ఉంది. అత్యాచారానికి గురైన మహిళలు, బాలికలకు ఇందులో రక్షణ కల్పిస్తారు.
సేవల కోసం డయల్‌ 100, కమిషనరేట్‌ వాట్సప్‌ నెంబర్‌ 94910-89257,  షీ బృందాలకు 73822-94057 నెంబరు ద్వారా సంప్రదించవచ్చు. నేరుగా వచ్చి ఫిర్యాదు చేయొచ్చు. ఆన్‌లైన్‌ హాక్‌ఐ యాప్‌ అందుబాటులో ఉంది.

 


సామాజిక మాధ్యమాల ఫలితమే
-డా.విత్తనాల సుధాకర్‌, సైకాలజిస్టు

సామాజిక మాధ్యమాల పుణ్యమాని.. పిల్లలతో తల్లిదండ్రులు, భార్యాభర్తలు, తోబుట్టువులు, ఒకరితో మరొకరు మాట్లాడుకునే సమయం ఉండటం లేదు. సామాజిక పరిస్థితుల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న క్రమంలో మనుషుల అలవాట్లు సైతం మారుతుండటం ఇలాంటి ప్రతికూల వాతావరణం నెలకొనడానికి కారణం. కుటుంబసభ్యుల మీద కన్నా యంత్ర పరికరాల మీద ఆధార పడటం ఎక్కువైనందున బంధాలు, బాధ్యతలు కనుమరుగవుతున్నాయి. భూముల విలువలు పెరగడం కూడా కుటుంబాల్లో స్వార్థానికి, తద్వారా విరోధానికి బీజం వేస్తోంది.


పోలీసులను ఆశ్రయిస్తే న్యాయం జరుగుతుంది
ఇస్లావతు శ్రీనివాస్‌నాయక్‌, సీఐ, డోర్నకల్‌

ఒక కుటుంబంలో కలతలు ఉన్నాయని తెలిస్తే ఇరుగు పొరుగు వారు కాస్త బాధ్యతతో మెలిగితే బాగుంటుంది. కాదనుకుంటే సామాజిక, స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవాలి. మొగ్గ దశలోనే అసూయ, ద్వేషం, పోటీ, స్వార్థాలను నివారించే ప్రయత్నం జరగాలి. కుటుంబ బంధాల విలువలు, ప్రేమ, అనురాగం, బాధ్యత పెంచేందుకు పోలీసులూ క్రీయాశీలక పాత్ర పోషిస్తారు. ప్రాణాలు తీయడం, గొడవ పడటం శ్రేయస్కరం కాదు. పోలీసులను ఆశ్రయిస్తే తప్పక న్యాయం జరుగుతుంది. హత్యలతో చనిపోయిన వారి కుటుంబీకులే కాదు.. నిందితుల తాలూకు కుటుంబ సభ్యులూ ఇబ్బందులు పడతారు. మానసిక స్థైర్యం కోల్పోతారు. విలువైన జీవితం నాశనమవుతుంది. చట్టం కళ్లు గప్పి ఎవరూ తప్పించుకోలేరు.



 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని