logo

ఒకటి రెండు వర్షాలకే విత్తనాలు వేయొద్దు

వేసవిలో దుక్కులను లోతుగా వాలుకు అడ్డంగా దున్నాలి. ఇలా చేయడం వల్ల అడపాదడపా కురిసే వర్షాలతో భూమిలోకి నీరు ఇంకుతుంది

Published : 27 May 2022 03:35 IST

వేసవిలో దుక్కులను ఏవిధంగా సిద్ధం చేయాలి

శాస్త్రవేత్త: వేసవిలో దుక్కులను లోతుగా వాలుకు అడ్డంగా దున్నాలి. ఇలా చేయడం వల్ల అడపాదడపా కురిసే వర్షాలతో భూమిలోకి నీరు ఇంకుతుంది. భూమి లోపలి పొరల్లోని శిలీంద్ర బీజాలు, పురుగు నిద్రావస్థ దశలు, కలుపు విత్తనాలు పై పొరల్లోకి వస్తాయి. అధిక ఉష్ణోగ్రతలకు అవి నశిస్తాయి. వర్షాలకు కలుపు విత్తనాలు మొలకెత్తినా మళ్లీ దుక్కి  తయారీలో నశిస్తాయి.
అధిక సాంద్రత పద్ధతిలో పత్తి వేయడం వల్ల లాభం ఏమిటి? కేవీకే ఆధ్వర్యంలో ప్రదర్శన క్షేత్రాలు నిర్వహిస్తున్నారా?
శాస్త్రవేత్త: పత్తిసాగు అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేయడం వల్ల ప్రయోజనాలున్నాయి. ఎకరానికి మొక్కల సంఖ్య బాగా పెరుగుతుంది. పత్తి అంతా ఒకేసారి ఏరేందుకు అనుకూలంగా ఉంటుంది. రైతులకు ఈ సాగు పద్ధతిని తెలియజేయడానికి వ్యవసాయశాఖ ద్వారా సుమారు 500 ఎకరాలలో ప్రదర్శన క్షేత్రాలు నిర్వహించాలని నిర్ణయించాం. కేవీకే ఆధ్వర్యంలో కూడా 100 చేపట్టాలని నిర్ణయించాం. ఈ పద్ధతి సాగుకు రైతులు అనుకూలమైన హైబ్రిడ్‌ రకాలను ఎంచుకోవాలి.
వరి సాగులో ఖర్చులు తగ్గించుకోవడం ఎలా?
శాస్త్రవేత్త: నేరుగా విత్తే విధానాన్ని పాటించాలి. ఈ పద్ధతిలో సాగు విస్తీర్ణం పెరగాల్సి ఉంది. తొలకరి వర్షాలకి దుక్కి తయారు చేసుకుని పొడి దుక్కిలో ఆరుతడి వరి విత్తనాలు విత్తాలి. పంట కొంచెం ఎదిగిన తరువాత మామూలు వరిసాగులా నీరు పెట్టడం ఒక విధానం. దుమ్ము చేసిన పొలంలో నానబెట్టి ముక్కు పగిలిన వడ్లను వెదజల్లి వరిసాగు చేయడం మరో విధానం. వీటితో నారుమడి పెంచే శ్రమ తగ్గుతుంది. నీటి ఆదా అవుతుంది. పంట కాలం పది రోజులు, కూలీల అవసరం తగ్గుతుంది.
భూసారం పెంపునకు పాటించిన పద్ధతులు ఏమిటి?
శాస్త్రవేత్త: వానాకాలంలో వరి, మిర్చి సాగు చేసే రైతులు విధిగా పచ్చిరొట్ట ఎరువు పంటలైన జనుము, జిలుగ, పెసర, పిల్లిపెసర లాంటి పంటలను సాగు చేసుకోవాలి. 50శాతం పూత దశలో దుక్కిలో కలియదున్నడం వల్ల భూమిలో భూసారం, నీటి నిల్వ సామర్థ్యం పెంచవచ్చు. ఈఏడాది వ్యవసాయశాఖ, వ్యవసాయ విశ్వవిద్యాలయం పెద్దఎత్తున రైతులు కొన్ని పద్ధతులను పాటించాలని సూచించింది.
నకిలీ విత్తనాల బెడద నుంచి ఎలా బయటపడాలి?
శాస్త్రవేత్త: రైతులు గ్రామాల్లోకి వచ్చి విత్తనాలను విక్రయించే వారి నుంచి కొనుగోలు చేయరాదు. అధీకృత డీలర్‌ వద్దనే కొనుగోలు చేసి రశీదు పొందాలి. కొనుగోలు చేసిన విత్తనాల్లోంచి 100 విత్తనాలు తీసుకుని ఒక వస్త్రంలో పెట్టి నీళ్లు పోస్తే రెండు, మూడు రోజుల్లో మొలక శాతం తెలుస్తుంది. ఒకటి, రెండు వానలకే విత్తనాలు వేయొద్దు. వరసగా కురిసిన వర్షాలు 5 నుంచి 6 సెంటిమీటర్లు కురిసిన అనంతరమే నాటాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు