logo

రైతు వేదికలు...ఇక ప్రభుత్వ కార్యాలయాలు

మొన్నటిదాక అవి రైతు వేదికలు. ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాలు. రూ.కోట్ల వ్యయంతో నిర్మించిన రైతు వేదికలు అడపాదడపా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన రైతు అవగాహన సదస్సుల నిర్వహణకు ఉపయోగపడ్డాయి.

Published : 27 May 2022 03:35 IST

  గొల్లచర్లలోని రైతు వేదిక

డోర్నకల్‌, న్యూస్‌టుడే: మొన్నటిదాక అవి రైతు వేదికలు. ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాలు. రూ.కోట్ల వ్యయంతో నిర్మించిన రైతు వేదికలు అడపాదడపా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన రైతు అవగాహన సదస్సుల నిర్వహణకు ఉపయోగపడ్డాయి. మిగతా రోజుల్లో ఇవి అలంకారప్రాయంగా ఉంటున్నందున వీటిని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకుని రావాలని భావించి ప్రభుత్వం వ్యవసాయ సహాయ విస్తరణాధికారి (ఏఈవో) కార్యాలయాలుగా మార్చాలని సంకల్పించింది. ఈ నిర్ణయంతో ప్రభుత్వ పథకాలు వెంట వెంటనే క్షేత్ర స్థాయిలోకి వెళతాయనే భావన ఏర్పడింది. అంతేకాదు ఇక మీదట వ్యవసాయ రంగాలకు సంబంధించిన అన్ని రకాల కార్యకలాపాలు రైతు వేదికల్లోనే నిర్వహించుకునే వెసలుబాటు కల్పించారు. జిల్లాలో అందుకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక మొదలు కానుంది.
నెరవేరనున్న లక్ష్యం
జిల్లా పరిధిలోని 16 మండలాల్లో వ్యవసాయ శాఖ 86 క్లస్టర్లను ఏర్పాటు చేసింది. ప్రతి క్లస్టర్‌కు ఒక రైతు వేదికను నిర్మించారు. దీనికి శాఖాపరంగా రూ.12 లక్షలు, ఉపాధి హామీ పథకం కింద రూ.10 లక్షలు చొప్పున ఒక్కొక్క రైతు వేదికకు రూ.22 లక్షలు ఖర్చు చేశారు. ఆయా ప్రాంతాల్లో ఖర్చు చేసిన పైకం అక్షరాల రూ.18.92 కోట్లు. రైతు వేదికలు కొన్ని చోట్ల గ్రామ సమీపంలో ఉండగా మరికొన్నింటిని ఊరి వెలుపల నెలకొల్పారు. దూరంగా ఉన్న రైతు వేదికల దగ్గరకు వెళ్లడానికి ఎవరు కూడ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఇప్పుడివి ప్రభుత్వ కార్యాలయాలుగా మారనున్నందున ప్రభుత్వ లక్ష్యం నెరవేరబోతుంది

రోజూ అందుబాటులో..
జిల్లాలో ప్రస్తుతం 78 మంది వ్యవసాయ విస్తరణాధికారులు విధులు నిర్వహిస్తున్నారు. వీరు రోజూ ఉదయం 9 గంటలకు రైతు వేదిక వద్దకు వచ్చి 10 తర్వాత తర్వాత పంట పొలాలకు వెళ్లాలి. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రైతు వేదికల వద్ద ఉండాలి. సాగు సమస్యలపై ఎప్పటికప్పుడు రైతులతో సమావేశాలు నిర్వహిస్తూ వారి సందేహాలు నివృత్తి చేయాలి. ప్రతి క్లస్టర్‌ పరిధిలో 5 నుంచి 8 గ్రామాలు, విస్తీర్ణం 5 వేల నుంచి 7500 ఎకరాల వరకు ఉంటుంది. ఈ కారణంగా అనేక సందర్భాల్లో ఏఈవోలు ఎక్కడ ఉన్నారనేది తెలుసుకోవడం రైతులకు కష్టంగా మారింది. దీనిని మార్చేందుకు ప్రభుత్వం రైతు వేదికలను కార్యాలయాలుగా మార్చింది.
బహుళ ప్రయోజనం
జిల్లాలోని రైతు వేదికలు ప్రభుత్వ కార్యాలయాలుగా మారితే అటు వ్యవసాయశాఖ సిబ్బందికి, ఇటు అన్నదాతలకు బహుళ ప్రయోజనకరంగా ఉంటుంది. కార్యాలయాల నిర్వహణకు ప్రభుత్వం ప్రతి నెల రూ.9 వేలు సమకూర్చనుంది. గతంలోనే రైతు వేదికలకు అవసరమైన ఫర్నిచర్‌ సరఫరా చేశారు. బీరువాలూ ఉన్నాయి. వేదికల్లో శౌచాలయాల వ్యవస్థ కూడ ఉంది. నీటి సరఫరా కల్పించారు. వివిధ వర్గాల నుంచి అందే సమాచారాన్ని అంతర్జాలంలో భద్రపరుచుకునేందుకు అవసరమైన వనరులను అందుబాటులో ఉంచుకోవాలి. వ్యవసాయ శాఖ సమాచారాన్ని రైతులకు ఎప్పటికప్పుడు అక్కడ ప్రదర్శించాలి. రైతు వేదికలోని ఒక గదిని ఏఈవో, మరొక గదిని రైతు బంధు బాధ్యుడికి కేటాయించనున్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని