logo

నష్టాల గనులు

భూపాలపల్లి సింగరేణి ఏరియా నష్టాల్లో కొనసాగుతోంది. బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించలేకపోతోంది. భూగర్భ బొగ్గు గనులు గుదిబండగా మారాయి. ఉత్పత్తి వ్యయం భారీగా పెరుగుతుండటం.

Published : 27 May 2022 03:42 IST

-కోల్‌బెల్ట్‌,  న్యూస్‌టుడే

భూపాలపల్లి సింగరేణి ఏరియా నష్టాల్లో కొనసాగుతోంది. బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించలేకపోతోంది. భూగర్భ బొగ్గు గనులు గుదిబండగా మారాయి. ఉత్పత్తి వ్యయం భారీగా పెరుగుతుండటం.. అందుకు తగట్టు వెలికితీత చేయకపోవడంతో లాభాల దరిచేరలేకపోతున్నాయి. ఉపరితల గనులతో కొంత నష్టాలను పూడ్చుకోవాల్సి వస్తోంది. ఏరియాలో నాలుగు భూగర్భ, రెండు ఉపరితల గనులున్నాయి. ఇందులో 5648 మంది కార్మికులు పని చేస్తున్నారు. అన్ని గనుల్లో రోజుకు 13,560వేల టన్నుల నిర్దేశిత లక్ష్యం ఉంది. కానీ 6,860 టన్నులే వెలికితీస్తున్నారు.

కారణాలు ఇవే!
ఏరియాలో బొగ్గు ఉత్పత్తిలో పుంజుకోవడంలేదు. ఇక్కడి గనుల్లో గ్రేడియంట్‌(ఎత్తు పల్లాలు) ఎక్కువగా ఉంటుంది. దీంతో ఎస్‌డీఎల్స్‌ యంత్రాల పనితీరు అనుకున్న మేరకు ఉండటం లేదు. ఒక్కో యంత్రం 100 టన్నుల బొగ్గు తీయలేకపోతుంది. గనుల్లో పేల్చివేతలకు ఉపయోగించే మందుగుండు కొరత ఏర్పడింది. రోజుకు 200 టన్నులు కావాలి. మరో వైపు కార్మికుల గైర్హాజరు శాతం ఎక్కువగా ఉంది. గతంలో 18 శాతం ఉండగా, ఇప్పుడు 32 శాతానికి చేరుకుంది. ఓసీపీ-2కు సంబంధించిన భూమి సకాలంలో కంపెనీకి అందుబాటులోకి రాలేదు. ఓసీపీ-3కి గతేడాది నుంచి కావాల్సిన భూమి స్వాధీనం కాలేకపోయింది. ఫలితంగా ఉత్పత్తిపై ప్రభావం పడింది.
వ్యయం ఎక్కువ
భూగర్భ గనుల్లో ఉత్పత్తి వ్యయం ఎక్కువవుతోంది. టన్ను తీయడానికి రూ.7,000 వరకు వెచ్చించాల్సి వస్తోంది. టన్ను బొగ్గు మార్కెట్‌లో విక్రయిస్తే రూ.3,500 వరకు వస్తుంది. అమ్మకం ధర కంటే ఉత్పిత్తి ధర రెట్టింపు ఉంది. ఉపరితల గనిలో టన్ను ఉత్పత్తికి రూ.800 నుంచి రూ.1,000 వరకు ఖర్చు అవుతోంది. విక్రయించడం ద్వారా సింగరేణికి రూ.1500 నుంచి రూ.2000 వరకు లాభం వస్తోంది. ఈ లాభాలతో ఏరియాలో కొంత మేరకు నష్టాలు తగ్గుతున్నాయి.


కొత్త ప్రణాళికతో ముందుకు..
- సుబ్బారావు, సింగరేణి జీఎం

నష్టాల నుంచి గట్టెకడానికి కొత్త ప్రణాళికతో ముందుకువెళ్తున్నాం. భూగర్భ గనుల్లో బొగ్గు వెలికితీత పెంచుతాం. వ్యయం తగ్గించడానికి చర్యలు చేపడతాం. ఉపరితల గనుల్లో ఉత్పత్తి మరింత సాధిస్తాం. నిర్దేశిత రవాణా లక్ష్యం అధిగమిస్తాం. కార్మికుల గైర్హాజరు లేకుండా చేస్తాం. ఈ ఏడాది లక్ష్యం చేరుకొని నష్టాల్లో నుంచి బయటపడతామనే నమ్మకం ఉంది. ఇందుకు ఉద్యోగుల కృషి చాలా అవసరం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని