logo

వాణిజ్య భవనంలో భారీ అగ్ని ప్రమాదం

వరంగల్‌చౌరస్తాలోని శివ పేపర్‌మార్ట్‌ వాణిజ్య భవనంలో శుక్రవారం తెల్లవారు జామున 5.35 గంటల సమయంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు

Updated : 28 May 2022 04:03 IST

మంటలను ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది

మట్టెవాడ(వరంగల్‌), న్యూస్‌టుడే: వరంగల్‌చౌరస్తాలోని శివ పేపర్‌మార్ట్‌ వాణిజ్య భవనంలో శుక్రవారం తెల్లవారు జామున 5.35 గంటల సమయంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. శివ పేపర్‌మార్టు దుకాణం యజమాని సతీష్‌ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. మూడు అగ్నిమాపక వాహనాలతో సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. వరంగల్‌ డివిజన్‌ అగ్నిమాపకశాఖ అధికారి మామిడి భగవాన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. భవనంలో మూడో అంతస్తులోని మను రెస్టారెంట్‌లో విద్యుత్తు షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఈ ప్రమాదం జరిగింది. మూడో అంతస్తు పూర్తిగా, నాలుగో అంతస్తు పాక్షికంగా దెబ్బతిన్నాయి. భవనానికి ఏర్పాటు చేసి ఫ్లెక్సీలు, హోర్డింగులతో మంటలు భారీగా వ్యాపించాయి. కింది అంతస్తులో శివపేపర్‌ మార్టు, జ్యూస్‌ సెంటర్‌, బిగ్‌ సీ మొబైల్‌ షోరూలు ఉన్నాయి. మంటలు మొదటి, రెండో అంతస్తులకు వ్యాపించకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. సుమారు రూ.50 లక్షల మేర ఆస్తినష్టం జరిగిందని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఆయన తెలిపారు. భవనంలో ఏర్పాటు చేసిన అగ్నిమాపక పరికరాలు పనిచేయడం లేదని అధికారులు గుర్తించారు. మను రెస్టారెంట్‌ పూర్తిగా కాలిపోయింది. అందులో రూ.10 లక్షల నగదు ఉందని, యజమాని తీర్థయాత్రలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. భవనం ముందు ఉన్న విద్యుత్తు నియంత్రికకు మంటలు వ్యాపించడంతో పేలిపోయింది. అప్పటికే విద్యుత్తు సిబ్బంది కరెంట్‌ సరఫరాను నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. వరంగల్‌, హనుమకొండ అగ్నిమాపక ఎస్సైలు శ్రీనివాసరావు, నాగరాజు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే నరేందర్‌ సందర్శన

మట్టెవాడ : ప్రమాదం జరిగిన భవనాన్ని వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ పరిశీలించారు. అగ్నిమాపకశాఖ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బాధితులకు ధైర్యం చెప్పి అండగా ఉంటామని తెలిపారు. తెరాస నేతలు ప్రదీప్‌రావు, శ్రీహరి పరిశీలించిన వారిలో ఉన్నారు.

భవనాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే నరేందర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని