logo

కార్మికులు తరలొచ్చి.. సమస్యలు విన్నవించి

ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ ఆధ్వర్యంలో మే డే సందర్భంగా మాసోత్సవాలు ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసిన నేపథ్యంలో కేంద్రం తీరుని

Published : 28 May 2022 02:43 IST

కార్మిక సంఘాల నేతల నుంచి వినతిపత్రాలు తీసుకుంటున్న మంత్రులు మల్లారెడ్డి,

దయాకర్‌రావు, చీఫ్‌విప్‌ వినయ్‌భాస్కర్‌

కాజీపేట, న్యూస్‌టుడే: ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ ఆధ్వర్యంలో మే డే సందర్భంగా మాసోత్సవాలు ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసిన నేపథ్యంలో కేంద్రం తీరుని కార్మికులకు వివరిస్తూనే వారి సమస్యలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తూ చొరవ తీసుకుంటున్నారు. దానిలో భాగంగా శుక్రవారం కాజీపేటలోని తారాగార్డెన్‌లో నిర్వహించిన కార్మిక సదస్సుకు త్రినగరి నుంచి పెద్ద ఎత్తున ఆటో, ట్రాలీ, వివిధ రంగాల్లోని కార్మికులు పెద్దఎత్తున హాజరయ్యారు. ముఖ్య అతిథిగా హాజరైన కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చనిపోయిన కార్మికులకు రావాల్సిన పరిహారంతో పాటు ఇతర దరఖాస్తులు పెండింగులో ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. అధికారులతో సమీక్ష నిర్వహించానని చనిపోయిన కార్మికుల కుటుంబాలకు సంబంధించి పరిహారం త్వరలోనే ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. వచ్చే కార్పొరేషన్‌ ఎన్నికల్లో ప్రత్యేకంగా కార్మికులకు 30 సీట్లు కేటాయించాలని స్థానిక ప్రజాప్రతినిధులను కోరారు. కార్మికుల మాసోత్సవాలు నిర్వహిస్తున్నందుకు చీఫ్‌ విప్‌ వినయ్‌భాస్కర్‌ను మంత్రులు ప్రత్యేకంగా అభినందించారు.

31న లక్ష మందితో బహిరంగ సభ..

వరంగల్‌లోని కార్మికులకు త్వరలో ఉచితంగా పది వేల ద్విచక్రవాహనాలను అందిస్తామని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రకటించారు. రాబోయే రోజుల్లో కార్మికులకు అనేక పథకాలు అమలు చేయనున్నట్లు వివరించారు. చీఫ్‌ విప్‌ వినయ్‌భాస్కర్‌ మాట్లాడుతూ.. 31న కాజీపేట రైల్వే స్టేడియంలో భారీ కార్మిక బహిరంగ సభ నిర్వహిస్తామని, దీనిలో వరంగల్‌లోని లక్షమంది కార్మికులు పాల్గొంటారన్నారు. సభలో వారి సమస్యల పరిష్కారానికి విధివిధానాలు ప్రకటించనున్నట్లు తెలిపారు. త్వరలోనే 9 వేల కార్మిక కుటుంబాలకు రావాల్సిన ప్రయోజనాలు అందించనున్నామని ప్రకటించారు. తెరాస హుజురాబాద్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ అజీజ్‌ఖాన్‌, కార్పొరేటర్లు రాంప్రసాద్‌ మానస, ఎలకంటి రాములు, నర్సింగ్‌, ఇతర తెరాస నాయకులు పాల్గొన్నారు.

రంగంపేట: మంత్రి మల్లారెడ్డి, చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ శుక్రవారం ఉదయం భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు. ఈవో శేషుభారతి, ప్రధానార్చకుడు శేషు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి శేషవస్త్రాలు అందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని