logo

అర్ధరాత్రి అడ్డదారుల్లో అక్రమాలు

దేవరుప్పుల వాగు నాణ్యమైన ఇసుకకు మారుపేరుగా నిలుస్తోంది. ఇక్కడ లభించే దానికి మంచి డిమాండ్‌ ఉంటుంది. కానీ కొందరు అక్రమంగా తరలిస్తూ.. డబ్బులు దండుకుంటున్నారు.

Updated : 28 May 2022 03:56 IST

పోలీసులు పట్టుకున్న ఇసుక ట్రాక్టర్లు

పాలకుర్తి, న్యూస్‌టుడే: దేవరుప్పుల వాగు నాణ్యమైన ఇసుకకు మారుపేరుగా నిలుస్తోంది. ఇక్కడ లభించే దానికి మంచి డిమాండ్‌ ఉంటుంది. కానీ కొందరు అక్రమంగా తరలిస్తూ.. డబ్బులు దండుకుంటున్నారు. వాగు పరివాహక రైతులు అడపాదడపా అడ్డుకుంటున్నా షరా మాములుగానే దందా కొనసాగుతోంది. కొన్నిసార్లు పోలీసులు తనిఖీ చేసి ట్రాక్టర్లు పట్టుకుంటున్నా.. వ్యాపారం మాత్రం ఆగడం లేదు. దళారులు ఈ అక్రమానికి అర్ధరాత్రిని ఎంచుకుంటున్నారు. ఏయే మార్గాల్లో.. ఏయే సమయంలో ఈ దందా కొనసాగుతోందన్న అంశాలపై ‘న్యూస్‌టుడే’ కథనం.

రాత్రి సమయం ఎందుకంటే..

రాత్రి పూట అయితే పోలీసుల నిఘా తక్కువగా ఉంటుంది. ఫిర్యాదు చేసే వారు కూడా ఉండరు. అధికారులు కూడా ఆ సమయంలో రాలేరు. దీనిని గ్రహించిన దళారులు రాత్రిని ఎంచుకుంటున్నారు. కొన్నిసార్లు ఆ సమయంలో పోలీసులు గస్తీకి వెళ్లినా దొరుకుతుంది మాత్రం అరకొర ట్రాక్టర్లనే. ఎందుకంటే కొందరు ముందుగా ద్విచక్రవాహనంపై రెక్కీ నిర్వహించి రవాణాకు అడ్డంకులు లేవని ఫోన్‌ చేసి చెబితే.. ట్రాక్టర్‌ బయలుదేరుతుంది. శని, ఆదివారాల్లో ఈ దందా ఎక్కువగా ఉంటోంది.

మట్టి రోడ్ల మీదుగా..

దేవరుప్పుల నుంచి కొడకండ్ల, పాలకుర్తికి ఇసుక ట్రాక్టర్లు పదుల సంఖ్యలో అక్రమ దారుల్లో నడుస్తున్నాయి. ఈ మార్గంలో గస్తీ ఉండే పోలీసుల అండదండలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. అక్రమార్కులు ప్రధాన మార్గం కాకుండా ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. దేవరుప్పుల వాగు నుంచి మారుమూల తండాలకు మట్టి రహదారి నుంచి చెన్నూరు, మైలారం, విస్నూరు మీదుగా ట్రాక్టర్లు పాలకుర్తికి వస్తున్నాయి. మొండ్రాయి, రామవరం మీదుగా కొడకండ్లకు వెళ్తున్నాయి. మండల కేంద్రాలకు చేరిన తర్వాత ఒక్కో ట్రాక్టరుకు సుమారు రూ.5500 నుంచి రూ.6500 వరకు వసూలు చేస్తున్నారు.

ప్రభుత్వ పథకాల పేరుతో..

ఇక ప్రభుత్వ పథకాలతోపాటు రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాల పేరుతో కూడా పక్కదారి పట్టినట్లు తెలుస్తోంది. రెవెన్యూ అధికారుల అనుమతితో కొందరు గుత్తేదారులు ఎక్కువ మొత్తంలో తీసుకొచ్చి నిర్మానుష్య ప్రదేశాల్లో డంపింగ్‌ చేస్తున్నారు. అనంతరం స్థానికంగా అమ్ముకుంటున్నారని ఆరోపణలున్నాయి. ట్రాక్టర్లు పట్టుబడుతున్నా యజమానులు కోర్టుల్లో జరిమానాలు చెల్లించి తిరిగి వస్తున్నారు. వాహనాల శబ్దం, అలజడితో కంటిమీద కునుకు లేకుండా ఉంటోందని పలు గ్రామాల వాసులు వాపోతున్నారు.

కొరవడిన అధికారుల నిఘా..

దేవరుప్పుల వాగు పరివాహక ప్రాంతాల నుంచి నిత్యం వందల సంఖ్యలో ట్రాక్టర్లు, లారీలు హైదరాబాద్‌తోపాటు జనగామ, పాలకుర్తి, తిర్మలగిరి, కొడకండ్ల, దేవరుప్పుల మండలాలకు తరలిస్తున్నాయి. కొందరు యజమానులు, స్థానిక గ్రామాల పెద్దలు ఈ రంగంలో దశాబ్దాలుగా పాతుకుపోయారు. దేవరుప్పుల మండలంలోని ఓ చిన్న పల్లెలో ఈ దందా కోసమే ఏకంగా 50 ట్రాక్టర్లు కొనుగోలు చేశారు కూడా. రెవెన్యూ, మైనింగ్‌ అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో ఇంకాస్త జోరుగానే దందా సాగుతోంది.

యువతే లక్ష్యంగా..

జిల్లాలో కొనసాగుతోన్న ఇసుక దందాకు నిరుపేద యువకులు ఎక్కువగా ప్రేరేపితమవుతున్నారు. ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి రాత్రుళ్లు ట్రాక్టర్లు నడపడానికి సాహసం చేస్తున్నారు. ఇటీవల ఓ తండాలో ట్రాక్టరు నడిపి పేద కుటుంబానికి చెందిన యువకుడి దుర్మరణం పాలయ్యాడు.

అక్రమంగా తరలిస్తే చర్యలు తప్పవు

- గొల్ల రమేశ్‌, ఏసీపీ, వర్ధన్నపేట

రెవెన్యూ, మైనింగ్‌శాఖల సహకారంతో ఇసుకను అక్రమంగా తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. రాత్రి సమయంలో నిఘా పెంచుతాం. ఇసుక అక్రమ తరలింపుపై గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతాం. ప్రజల సహకారంతోనే నిర్వహిస్తాం.

జనవరి నుంచి మే 20 వరకు

మండలం    పట్టుకున్న ట్రాక్టర్లు

కొడకండ్ల 2

పాలకుర్తి 2

దేవరుప్పుల 4

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని