logo

పీఎం స్వనిధి రుణం.. వీధి వ్యాపారులకు వరం..

వీధి వ్యాపారులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి స్వనిధి, ఆత్మ నిర్బర్‌ పథకం ద్వారా రుణాలు మంజూరు చేస్తోంది. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో రెండేళ్ల

Updated : 28 May 2022 03:58 IST

భూపాలపల్లి, న్యూస్‌టుడే: వీధి వ్యాపారులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి స్వనిధి, ఆత్మ నిర్బర్‌ పథకం ద్వారా రుణాలు మంజూరు చేస్తోంది. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో రెండేళ్ల క్రితం కరోనా కారణంగా దెబ్బతిన్న చిరు వ్యాపారులను గట్టక్కించేందుకు బ్యాంకుల ద్వారా రూ.10 వేలు మంజూరు చేశారు. మొదట్లో కొందరే ముందుకురాగా లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు మెప్మా ఆధ్వర్యంలో సిబ్బంది రంగంలోకి దిగారు. వీధి వ్యాపారం చేసే చోటుకు వెళ్లి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. దీంతో ఎక్కువ మందికి రుణాలు అందించారు.

రెండో విడతకు చర్యలు..

మొదటి విడతలో మంజూరైన లబ్ధిదారులకు రెండో విడతలో రుణాలు ఇచ్చేలా చర్యలు చేపట్టారు. మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించిన వారికే రెట్టింపు రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు. మొదటి విడతలో రుణాలు తీసుకొని వాయిదాలు సక్రమంగా చెల్లించలేదు. అర్హులుగా సగం మంది కూడా తేలకపోగా, తీసుకున్న మొత్తాన్ని చెల్లించేందుకు మళ్లీ రుణం పొందేందుకు అవకాశం కల్పించారు. కొంత మంది లబ్ధిదారులు క్రమం తప్పకుండా చెల్లిస్తున్నారు. దీంతో ప్రభుత్వం ఆత్మనిర్బన్‌ పథకం ద్వారా రూ.20 వేలు రుణం మంజూరు చేసేందుకు ముందుకొచ్చింది.

ఎంతమందికి లబ్ధి అంటే..

భూపాలపల్లి పురపాలక సంఘం పరిధిలో మొత్తం 3,186 మంది వీధి వ్యాపారులుండగా.. వీరిలో 2,445 మంది రుణాల కోసం ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకున్నారు. మొదటి విడతలో 1,974 మందికి లబ్ధి చేకూరగా, రెండో విడత వచ్చే సరికి ఆ సంఖ్య తగ్గింది. ఇందులో 1,030 మందికి రుణం మంజూరు చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు 194 మంది ఖాతాల్లో జమయ్యాయి. రెండో విడత రుణాలు మంజూరు చేసేందుకు మెప్మా అధికారులు, ఆర్‌పీలు, సిబ్బంది కృషిచేస్తున్నారు. గడువు ప్రకారం రుణాలు అందిస్తే చిరు వ్యాపారులకు ప్రయోజనం చేకూరనుంది.

రుణాల మంజూరు వివరాలు..

మున్సిపాలిటీ పేరు

భూపాలపల్లి

వీధి వ్యాపారులు 3,186

మొదటి విడత మంజూరు 1,974

రెండో విడత.. 1,030

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని