logo

ఈసారీ పాఠ్య పుస్తకాలు ఆలస్యమే..

పాఠశాలలు తెరిచే సమయానికి విద్యార్థుల చేతికి పాఠ్యపుస్తకాలు అందేలా కనిపించడం లేదు. ఏటా మూడు నెలల ముందు నుంచే పుస్తకాలు జిల్లా కేంద్రానికి చేరుకుంటాయి.

Updated : 28 May 2022 03:53 IST

మరో 16 రోజుల్లో ప్రారంభం కానున్న బడులు

భూపాలపల్లి, న్యూస్‌టుడే: పాఠశాలలు తెరిచే సమయానికి విద్యార్థుల చేతికి పాఠ్యపుస్తకాలు అందేలా కనిపించడం లేదు. ఏటా మూడు నెలల ముందు నుంచే పుస్తకాలు జిల్లా కేంద్రానికి చేరుకుంటాయి. ఇప్పటివరకు జిల్లా విద్యాశాఖకు పుస్తకాలు రాలేదు. దీంతో సమయానికి విద్యార్థులకు పుస్తకాలందడం అనుమానమే. 2019 నుంచి ప్రభుత్వం ముందస్తుగా పాఠ్యాంశాల ముద్రణ ప్రారంభించి, విద్యా సంవత్సరం ముగింపులోనే అంటే మార్చిలో రానున్న విద్యా సంవత్సరానికి సరఫరా ప్రారంభించేది. పాఠశాలల పునఃప్రారంభానికి ముందే ఎంఆర్సీలకు తరలించి, మొదటి రోజే విద్యార్థులకు కొత్త పుస్తకాలు అందించే వారు. కొవిడ్‌ సమయంలోనూ జాప్యం జరగలేదు. ఈసారి మాత్రం మొదటిరోజు అందించడంపై అనుమానాలు నెలకొన్నాయి.

అన్నీ రాకుంటే గత సమస్యలే..

పూర్తిస్థాయిలో పుస్తకాల సరఫరా కాకపోతే గత సమస్యలే మొదలయ్యే అవకాశం ఉంది. గతేడాది పాఠ్యపుస్తకాలు ముందుగా వచ్చినా.. కొన్ని తరగతులకు రాలేదు. ముఖ్యంగా ఆంగ్ల మాధ్యమం పుస్తకాలు 50 శాతమే వచ్చాయి. హిందీ పాఠ్యపుస్తకాల కొరత కనిపించింది. దీంతో చదువుకునేందుకు ఉన్నత తరగతుల విద్యార్థులు ఇబ్బందిపడ్డారు. ఈసారైనా పూర్తిస్థాయిలో అందేలా విద్యాశాఖ అధికారులు దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

జిల్లాలో అవసరం ఇలా..

యూడైస్‌ ఆధారంగా ఒక్కో విద్యార్థికి తరగతిని బట్టి 5 నుంచి 11 పుస్తకాలు అవసరం. 2021-22 యూడైస్‌ ప్రకారం జిల్లాలో 468 పాఠశాలల్లో 42,381 మంది విద్యార్థులకుపైగా చదువుకుంటున్నారు. వీరందరికీ కలిపి సుమారు 1,60,080 పాఠ్యపుస్తకాలు అవసరం. రాష్ట్రస్థాయిలో పుస్తకాల ముద్రణ పూర్తి కాకపోవడంతో జిల్లాకు చేరుకోలేదని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.

మార్పులతో జాప్యం..

- శ్రీనివాస్‌రెడ్డి, డీఈవో, భూపాలపల్లి

జిల్లాకు అవసరమైన పాఠ్యపుస్తకాలు ఈసారి ఇంకా చేరుకోలేదు. గతంలోనే విద్యార్థుల వివరాలను ఉన్నతాధికారులకు నివేదించాం. దాని ఆధారంగా పుస్తకాలు రావాల్సి ఉంది. ఆంగ్లం, తెలుగు మాధ్యమం పుస్తకాల ముద్రణలో మార్పులు చోటు చేసుకోవడంతో జాప్యం అవుతుందని ఉన్నతాధికారులు చెబుతున్నా.. త్వరలోనే పుస్తకాలు జిల్లాకు వచ్చే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు