logo

వారధులు లేక.. అడవి బిడ్డల ఆవేదన..!

జిల్లాలోని కొత్తగూడ, గంగారం, బయ్యారం, గూడూరు ఏజెన్సీలోని అడవి బిడ్డలుండే గ్రామాల అభివృద్ధిలో మార్పు గోచరించడం లేదు. వాగులపై వంతెన, కల్వర్టుల నిర్మించకపోవడంతో వర్షాకాలంలో వచ్చే  

Updated : 28 May 2022 03:55 IST

జిల్లాలోని కొత్తగూడ, గంగారం, బయ్యారం, గూడూరు ఏజెన్సీలోని అడవి బిడ్డలుండే గ్రామాల అభివృద్ధిలో మార్పు గోచరించడం లేదు. వాగులపై వంతెన, కల్వర్టుల నిర్మించకపోవడంతో వర్షాకాలంలో వచ్చే వరదలతో అవస్థలు పడుతున్నారు. వాగులను దాటేందుకు ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేసుకోవాల్సి వస్తోంది. దీనికి తోడు రోడ్డు సౌకర్యం సరిగా లేక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆపద వస్తే వారికి ఆవేదనే మిగులుతోంది.

ఈనాడు డిజిటల్‌, మహబూబాబాద్‌, న్యూస్‌టుడే, బయ్యారం

ఈ చిత్రంలో కనిపిస్తున్నది చిన్న వాగు గూడూరు మండలం మాట్టేవాడ గ్రామపంచాయతీ పరిధిలోని దొరవారి తిమ్మాపురానికి వెళ్లే దారి ఇది. 20 నివాస గృహాలు 96 మంది జనాభా కలిగిన ఈ గూడెనికి వెళ్లే దారిలో రెండు వాగులుంటాయి. వాటిపై కనీసం లోలెవల్‌ వంతెనలు కూడా లేవు. వర్షాలు వస్తే వాగుల్లోని వరద ప్రవాహం అధికమై ప్రజలు గూడేనికే పరిమితమవుతారు. అత్యవసర పనుల కోసం వెళ్లేందుకు ముందస్తుగా చెట్లకు తాళ్లను కట్టిపెట్టుకుంటున్నారు. 2020, 2021 వర్షాకాలంలో వాగులోని వరద ప్రవాహం పెరగడంతో తాళ్ల సహాయంతోనే ప్రజలు ఇళ్లకు చేరుకున్న సందర్భాలున్నాయి.


ఈ లోలెవల్‌ వంతెన బయ్యారం మండలంలోని మొట్ల తిమ్మాపురానికి వెళ్లే దారిలోనిది. వర్షాకాలంలో వరద ప్రవాహంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. గత ఏడాది వచ్చిన భారీ వరదలకు ఈ ప్రాంతంలో గ్రామానికి చెందిన వ్యక్తి ఒకరు వరదను దాటేందుకు ప్రయత్నించగా కొట్టుకుపోయి చనిపోయాడు. ఈ ప్రాంతంలో వంతెన నిర్మాణం చేపట్టాలని ఆ ప్రాంత ప్రజలు ఏళ్ల నుంచి విజ్ఞప్తి చేస్తున్నారు.


బయ్యారం మండలం కాచనపల్లి పెద్దవాగు వరద ఉద్ధృతితో రైతులు వ్యవసాయ పొలాల వద్దకు వాగును దాటేందుకు 2021లో వర్షాలకు కర్రల సహాయంతో ఇలా వంతెన ఏర్పాటు చేసుకున్నారు.

* కాచనపల్లి ప్రాంతంలో మూలపోచారం, కిష్టాపురం, రామన్నపేటకు చెందిన రైతుల, అవలి వైపున కాచనపల్లి రైతులకు సుమారు 150 ఎకరాల సాగు భూము ఉంది. వర్షాకాలంలో పొలాల వద్దకు వెళ్లడానికి వాగును దాటాలి. ప్రవాహం ఎక్కువైతే పంటల వద్దకు వెళ్లడానికి వ్యయ ప్రయాసలు పడేవారు. వాగుపై వంతెన నిర్మాణ ప్రతిపాదన ఉన్నా పట్టించుకోకపోవడంతో రైతులే దూరభారాన్ని తగ్గించుకునేందుకు ప్రత్యామ్నాయంగా కర్రల సహయంతో వారధిని ఏర్పాటు చేసుకుని పొలాల వద్దకు వెళ్తున్నారు.


వైద్యం కోసం నరకయాతన:
గూడేలు, తండాలు, గ్రామాల్లో అనారోగ్య సమస్య ఎదురైతే కనీసం ప్రథమ చికిత్స చేసే వారు కూడా అందుబాటులో ఉండడం లేదు. సరైన రోడ్డు మార్గం లేదని 108 వాహనం రాదు. కొన్ని సందర్భాల్లో బాధితుల పరిస్థితి విషమంగా మారుతోంది.

దృష్టి సారిస్తేనే మేలు
ఈసారి వర్షాకాలన్ని దృష్టిలో పెట్టుకుని సమస్యలున్న గూడెల్లో ముందస్తుగా ప్రత్యామ్నాయ వసతుల ఏర్పాట్లపై అధికారులు దృష్టిసారించాలని అయా ప్రాంతాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యంగా రేషన్‌ సరకులు, పింఛన్లు, చిన్న పిల్లలకు టీకాల పంపిణీ సమయానికి జరిగేలా చూడాలి. గర్భిణులను గుర్తించి ప్రసవ సమయంలో ఆసుపత్రికి వెళ్లడానికి ఏర్పాట్లు చేయాలి.

అటవీ అనుమతులే సమస్య
కొత్తగూడ మండలం ముస్మి నుంచి కర్నెగండి వరకు, గూడూరు మండలం ఊట్ల నుంచి కొత్తగూడ మండలం కార్లాయి వరకు, కొత్తగూడ మండలం చెరువుముందు తండా నుంచి దొరవారి వెంపల్లి వరకు రహదారి, మధ్యలో వంతెనల నిర్మాణానికి సర్కారు నిధులు మంజూరు చేసింది. అయా చోట్ల పనులు చేయడానికి అటవీశాఖ అనుమతులే ప్రధాన సమస్యగా మారింది. దాంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి.

వారానికి సరిపడా సరకులు
నిత్యావసర సరకుల కొనుగోలుకు ప్రజలంతా సమష్టిగా వారానికి ఒక రోజు ట్రాక్టర్‌, ఇతర ప్రైవేట్‌ వాహనాల్లో మండలకేంద్రానికి వచ్చి వారం రోజుల వరకు సరకులను కొనుగోలు చేసుకుని నిల్వ చేసుకుంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని