logo

ఈకేవైసీ నమోదు అంతంతే..!

రాష్ట్రంలో రైతు బంధు మాదిరిగానే కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ పనుల అవసరాల కోసమని ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం అమలు చేస్తోంది. దీని ద్వారా రైతుకు రూ.2 వేలు చొప్పున ఏటా మూడుసార్లు మొత్తం రూ.6 వేలు అన్నదాత ఖాతాల్లో జమ అవుతుంది.

Published : 29 May 2022 03:48 IST

జిల్లాలో 45 శాతమే

డోర్నకల్‌, మానుకోట, న్యూస్‌టుడే


గార్ల మండలం రాంపూర్‌లో శనివారం ఈ కేవైసీ ప్రక్రియలో పాల్గొన్న జిల్లా వ్యవసాయాధికారి చత్రునాయక్‌, ఏఓ రామారావు

రాష్ట్రంలో రైతు బంధు మాదిరిగానే కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ పనుల అవసరాల కోసమని ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం అమలు చేస్తోంది. దీని ద్వారా రైతుకు రూ.2 వేలు చొప్పున ఏటా మూడుసార్లు మొత్తం రూ.6 వేలు అన్నదాత ఖాతాల్లో జమ అవుతుంది. కాగా, ఈకేవైసీ నమోదు చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం జులై 31 వరకు గడువును పొడిగించింది. ఈ మేరకు శనివారం కేంద్ర ప్రభుత్వ వ్యవసాయశాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. రైతుల ఖాతాల్లో జమ కావాలంటే అర్హులైన రైతులు విధిగా ఈ-కేవైసీ చేసుకోక తప్పదు. బ్యాంకు ఖాతాల్లో చరవాణి సంఖ్యకు అనుసంధానం సక్రమంగా లేకపోవడానికి తోడు మరణించిన వారి వివరాలు తొలగించకపోవడం వంటి కారణాలతో అనర్హులు కొందరికి నిధులు జమ అవుతున్నట్లు కేంద్రం గుర్తించింది. అవినీతి, అక్రమాలకు తావు లేకుండా చూడాలనే ఉద్దేశంతో ఈసారి ఈ-కేవైసీని తప్పనిసరి చేసింది.

స్మార్ట్‌ఫోన్‌ చెంత ఉంటే..!

* పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి సొమ్ము కోసం ఈ-కేవైసీ ధ్రువీకరణ చేసుకోవడానికి పీఎం కిసాన్‌ పోర్టల్‌, పీఎం కిసాన్‌ యాప్‌ని కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. వీటిని వినియోగించుకోవడానికి స్మార్ట్‌ఫోను చెంత ఉంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.పీఎంకేఐఎస్‌ఏఎన్‌.జీవోవీ.ఐఎన్‌ లింకు తెరవండి. తెరపై ప్రత్యక్షమయ్యే ఈ-కేవైసీ అప్‌లోడ్‌ కనిపిస్తుంది. దీనిపై క్లిక్‌ చేసి ఆధార్‌ సంఖ్య నమోదు చేయండి. అప్పుడు ఆధార్‌ లింకుతో ఉన్న చరవాణికు ఓటీపీ వస్తుంది. దీనిని నమోదు చేసి గెట్‌ పీఎం కిసాన్‌ ఓటీపీ ఆప్షన్‌ మీద క్లిక్‌ చేయండి. చరవాణికి వచ్చే ఓటీపీని అక్కడ నమోదు చేసి సిబ్మిట్‌ని క్లిక్‌ చేస్తే ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తవుతుంది. ఇందుకోసం మీరు కొంత సమయాన్ని తీరక చేసుకుంటే పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి మేలు చేకూరుస్తుంది.

* ఒక వేళ స్మార్ట్‌ఫోన్‌ లేకపోయినా, నమోదుపై అవగాహన లేని పక్షంలో సమీపంలోని మీ-సేవ కేంద్రాలకు వెళ్లి బయోమెట్రిక్‌ వేసి అనుసంధానం చేయించుకుంటే సరిపోతుంది. వెంట బ్యాంకు ఖాతాకు లింకు అయిన చరవాణి, ఆధార్‌ కార్డు వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆధార్‌-మొబైల్‌ లింకు చేయించని రైతులతో పాటు ఇతర ఇబ్బందులు ఉన్న అన్నదాతలకు మీ-సేవ కేంద్రాలే సరైన వేదిక. ఇక్కడ ఈ-కేవైసీ కోసం నిర్వాహకులు రైతుల చేత బయోమెట్రిక్‌ చేయిస్తారు. మీ-సేవ అందుబాటులో లేని పక్షంలో మండల వ్యవసాయాధికారులు(ఏవోలు), వ్యవసాయ విస్తరణాధికారులు(ఏఈవోలు) దగ్గరకు వెళితే వారు పరిశీలించి సాయ పడతారు.

జిల్లా 45 శాతమే

రైతులు విధిగా ఈ కేవైసీ చేసుకోవలసి ఉంది. శనివారం గణాంకాల ప్రకారం జిల్లాలో ఈ ప్రక్రియ కేవలం 45 శాతం జరిగింది. జిల్లాలో ఈ పథకం లబ్ధిదారులు 96,248 మంది రైతులు ఉండగా కేవలం 42,912 మంది నమోదు మాత్రమే జరిగింది. మండలాల వారీగా నమోదు శాతం వివరాలు ఇలా ఉన్నాయి.

మండలాల వారీగా నమోదు శాతం

కురవి : 50, గార్ల : 48, మరిపెడ : 47,  కేసముద్రం : 38,  చిన్నగూడూరు : 33, నెల్లికుదురు : 36, మహబూబాబాద్‌ : 36, తొర్రూరు : 37, పెద్దవంగర : 38, గూడూరు : 43, నర్సింహులపేట : 47,  డోర్నకల్‌ : 52, గంగారం : 54, కొత్తగూడ : 58, దంతాలపల్లి : 67

సత్వరమే చేయించుకోవాలి : బి.చత్రునాయక్‌, జిల్లా వ్యవసాయాధికారి

ఈ కేవైసీీ నమోదు ప్రక్రియను పీీఎం కిసాన్‌ నిధి లబ్ధిదారులైన రైతులు విధిగా చేయించుకోవాలి. ఈ నమోదు జరగకుంటే 11వ విడత నిధులు జమకావు. మీ సేవలోనూ నమోదు చేయించవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని