logo

మావంటే.. మావే!!

మహాముత్తారం శివారులో అటవీ-రెవెన్యూ శాఖల మధ్య వివాదాస్పదంగా ఉన్న 487 సర్వే నంబర్‌లోని భూముల్లో బోరు బావులు తవ్వారు. ఈ విషయంలో రెవెన్యూ అధికారులపై కేసు నమోదు చేసే వరకు వెళ్లింది. ఇటీవల ప్రభుత్వం ఆయిల్‌పాం సాగును ప్రోత్సహిస్తోంది.

Published : 29 May 2022 03:48 IST

రెవెన్యూ, అటవీ శాఖల మధ్య వివాదం

●పోడు భూముల్లో బోరుబావులు తవ్వించారని కేసు నమోదు

మహాముత్తారం(జయశంకర్‌ జిల్లా), న్యూస్‌టుడే: మహాముత్తారం శివారులో అటవీ-రెవెన్యూ శాఖల మధ్య వివాదాస్పదంగా ఉన్న 487 సర్వే నంబర్‌లోని భూముల్లో బోరు బావులు తవ్వారు. ఈ విషయంలో రెవెన్యూ అధికారులపై కేసు నమోదు చేసే వరకు వెళ్లింది. ఇటీవల ప్రభుత్వం ఆయిల్‌పాం సాగును ప్రోత్సహిస్తోంది. అధికారులు గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. వాటి సాగుకోసం కోసం 487 సర్వే నెంబర్‌లో వివాదాస్పదంగా ఉన్న భూముల్లో బోరు బావులు తవ్వుకుంటుండగా ఆజాంనగర్‌ రేంజి అటవీశాఖ అధికారులు గత గురువారం అడ్డుకున్నారు. ఈ తరుణంలో మహాముత్తారం తహసీల్దార్‌ మాధవి, డిప్యూటీ తహసీల్దార్‌ సందీప్‌ వెళ్లి.. అవి రెవెన్యూ భూములని, రైతులకు పట్టాలిచ్చామని, బోరు బావుల తవ్వకానికి అనుమతులు ఇచ్చామని చెప్పారు. రెండు రోజుల్లో ఎనిమిది బావులు తవ్వారు. వివాదం మరింత జఠిలమైంది. పోడు భూముల్లో అక్రమంగా బోరుబావుల తవ్వకానికి సహకరిస్తున్నారని తహసీల్దార్‌ మాధవి, డిప్యూటీ తహసీల్దార్‌ సందీప్‌పై కేసు (ప్రాథమిక నేర నివేదిక) నమోదు చేసి కోర్టుకు సమర్పించినట్లు ఆజాంనగర్‌ ఇన్‌ఛార్జి అటవీక్షేత్రాధికారి కిరణ్‌ పేర్కొన్నారు. విచారణ కొనసాగుతున్నట్లు తెలిపారు. ఈవిషయమై మాధవిని ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా నిబంధన ప్రకారమే నడుచుకుంటున్నామని, ఇక్కడి భూముల్లో గతంలో తవ్విన బోరుబావులు పదుల సంఖ్యలో ఉన్నాయని, అప్పుడు అడ్డుపడని అటవీశాఖ అధికారులు ప్రస్తుతం పోడు భూములని అనడం ఏమిటని ప్రశ్నించారు.

నలుగుతున్న వివాదం

ఈ భూములు ఏళ్లుగా వివాదాస్పదంగానే ఉన్నాయి. భూప్రక్షాలనలో భాగంగా 487 సర్వే నంబర్‌కు అక్రమంగా బైనంబర్లు సృష్టించి అప్పటి రెవెన్యు సిబ్బంది పట్టాలు చేశారని అటవీశాఖ అధికారులు ఆరోపిస్తున్నారు. తమ రికార్డుల ప్రకారం కాంపాట్‌మెంట్‌ నంబర్‌ 716లోని పోడు భూములని చెబుతున్నారు. మరో వైపు అటవీ స్థలాలు కావని రెవెన్యూ అధికారులు వాధిస్తున్నారు. రెండు శాఖల మధ్య సమన్వయం లేకపోవడం, సంయుక్త సర్వే చేయకపోవడంతో ఈ సమస్యకు పరిష్కారం దొరకడం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని