logo

పల్లె మురిసేలా ప్రగతి మెరవాలె

జూన్‌ 3 నుంచి ప్రారంభం కానున్న ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి పల్లె మురిసేలా ప్రగతి సాధించాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు.

Published : 29 May 2022 03:56 IST


మొక్కలు ఎలా రక్షించాలో ప్రత్యక్షంగా చూపుతున్న సిబ్బంది, వేదికపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, తదితరులు

జనగామ అర్బన్‌, న్యూస్‌టుడే: జూన్‌ 3 నుంచి ప్రారంభం కానున్న ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి పల్లె మురిసేలా ప్రగతి సాధించాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై అధికారులు, ప్రజాప్రతినిధులతో జిల్లా స్థాయి సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పల్లెప్రగతి ద్వారా రాష్ట్రంలోని పల్లెలు బాగుపడుతున్నాని, దేశంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో ముందంజలో ఉందని అందుకు తగ్గట్టుగా ప్రగతిని మరింత మెరుగుపరచాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశానుసారం పల్లెప్రగతిని విజయవంతం చేసే బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికారులు తీసుకోవాలన్నారు. పల్లెప్రగతిలో 20 పంచాయతీలు గుర్తింపు పొందగా అందులో 19 పంచాయతీలు జనగామ జిల్లాలో ఉండడం గర్వకారణమంటూ అందుకు కారకులైన ప్రతి ఒక్కరిని అభినందించారు. ధాన్యం కొనుగోళ్లలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో ప్రభుత్వం సంక్షేమ పథకాలతో లబ్ధి పొందిన వారి వివరాలను పొందపరచాలన్నారు. పట్టణప్రగతిలో రూ.8కోట్లు మురుగుకాల్వల నిర్మాణాలకు కేటాయించామని పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డి, అదనపు కలెక్టర్లు భాస్కర్‌రావు, అబ్దుల్‌ హమీద్‌, జడ్పీ సీఈవో విజయలక్ష్మి, డీఆర్డీవో రాంరెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

ఎవరెవరు ఏమన్నారంటే..

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మాట్లాడుతూ.. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలన్నారు. ఈ సందర్భంగా హరితహారంలో నాటిన మొక్కలకు సర్కార్‌ తుమ్మ రెమ్మలు కట్టి ఎలా రక్షించాలో అధికారులకు, ఎంపీపీ, జడ్పీటీసీలకు ఎమ్మెల్యే వివరిస్తూ.. సిబ్బందితో ప్రత్యక్ష ప్రదర్శన(డెమో) చేయించారు.

స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య : సకాలంలో వర్షాలు పడకపోవడం ఉష్ణోగ్రత తీవ్రత కారణంగా పల్లె, పట్టణ ప్రగతి కొంత ఆలస్యమైంది. పాడుబడిన బావులను, బోరుబావులను ఈ కార్యక్రమంలో గుర్తించి పూడ్చాలి.

ఎమ్మెల్సీ కడియం శ్రీహరి : ఈ ప్రగతి కార్యక్రమాల ద్వారా పల్లెలు, పట్టణాలు ప్రగతిపథంలో నడుస్తున్నాయి.

జిల్లా పాలనాధికారి సీహెచ్‌.శివలింగయ్య : గ్రామ పంచాయతీలలో జవాబుదారీతనాన్ని పెంచుతామని పారదర్శకతను చేపడతాం. ఉదయం ఆరు గంటలకే చెత్త సేకరణ ఇంటింటికి జరిగేలా చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ భవనాల్లో చేపట్టిన పరిశుభ్రతను రిజిస్టర్లో తప్పనిసరిగా నమోదు చేసేలా చర్యలు తీసుకుంటాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని