logo

స్వయం ఉపాధి.. మహిళా శక్తికి పెన్నిధి

జిల్లాకు చెందిన పలువురు మహిళలు వ్యాపార రంగంలో రాణిస్తూ స్వయం ఉపాధి పొందుతున్నారు. కుటుంబ భారాన్ని మోస్తూ భేష్‌ అనిపించుకుంటున్నారు.

Updated : 30 May 2022 05:54 IST

ములుగు, న్యూస్‌టుడే: జిల్లాకు చెందిన పలువురు మహిళలు వ్యాపార రంగంలో రాణిస్తూ స్వయం ఉపాధి పొందుతున్నారు. కుటుంబ భారాన్ని మోస్తూ భేష్‌ అనిపించుకుంటున్నారు. ఆసక్తి ఉండి ముందుకు వచ్చిన మహిళలకు జిల్లా గ్రామీణాభివృద్ధి, జీసీసీ లాంటి సంస్థలు తోడ్పాటునందిస్తుండడంతో ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలు డీఆర్‌డీఏ ద్వారా పొందిన రుణాలతో వ్యాపారాలు కొనసాగిస్తూ ఆర్థికాభివృద్ధి చెందుతున్నారు. మరికొందరికి ఉపాధి కల్పిస్తున్నారు.

విభిన్న వ్యాపారాల్లో రాణిస్తూ..

ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో సాఫీగా సాగి లాభాలు వచ్చే వ్యాపారాలనే ఎంచుకుంటున్నారు. ఇందులో ప్రధానంగా కిరాణం, దుస్తుల వ్యాపారం, పిండి గిర్ని, ఎంబ్రాయిడరీ, ఓవర్‌లాక్‌, కుట్టు, హోటల్‌, కంప్యూటర్‌, జిరాక్స్‌, డెకరేషన్‌, సౌండ్‌ సిస్టం, వ్యవసాయం, విస్తారాకుల తయారీ, కారం మిల్లు, పిండి వంటలు మొదలగు వ్యాపారాలు చేస్తున్నారు. ఇలాంటి వ్యాపారాల ద్వారా మహిళల స్థితిగతులు మారిపోతున్నాయి.


రోజుకు రూ.4 వేలు సంపాదిస్తున్నా..

- బాషబోయిన తిరుమలత, మల్లంపల్లి

సంఘం ద్వారా వచ్చిన రుణంలో పండ్ల కొట్టు ఏర్పాటు చేసుకున్నాం. దానికి తోడుగా కూరగాయలు కూడా విక్రయిస్తున్నాం. ఒక ట్రాలీ ఆటో కొనుగోలు చేసి వ్యాపారం చేస్తున్నాం. రోజుకు సుమారు రూ.4 వేల వరకు సంపాదిస్తున్నా. వివిధ దశల్లో మొత్తం రూ. 3.43 లక్షలు రుణం తీసుకున్నా. అది ఎంతగానో ఉపయోగపడుతోంది. ఇప్పుడు మా కుటుంబం సాఫీగా సాగుతోంది.


ఆర్థికంగా స్థిరపడ్డా..

- కల్లెబోయిన ధనలక్ష్మి, తాడ్వాయి

సంఘంలో తీసుకున్న రుణంతో ప్రారంభించిన కూల్‌ డ్రింక్స్‌, టీ కొట్టు నాకు జీవనాధారమైంది. 14 సంవత్సరాల వయసులోనే పెళ్లి చేశారు. భర్త ఇల్లు విడిచి ఎక్కడికో వెళ్లిపోయాడు. ఏం చేయాలో ఎలా బతకాలో తెలియని పరిస్థితుల్లో మహిళా సంఘం భరోసానిచ్చింది. వ్యాపారాన్ని ప్రారంభించి ఆర్థికంగా స్థిరపడ్ఢా ఇల్లు నిర్మించుకున్నా. ఇద్దరు పిల్లలను చదివించుకుంటున్నా.


మేకల పెంపకమే జీవనాధారం..

- పెనక ఉపేంద్ర, లింగాల, తాడ్వాయి మండలం

మేకల పెంపకం నాకు జీవనాధారమైంది. మాది నిరుపేద కుటుంబం. భర్త కూలీ పని చేస్తుంటాడు. ఆదాయం అంతంత మాత్రమే. కుటుంబం గడవడం చాలా కష్టంగా ఉండేది. సంఘం తరఫున రూ. 50 వేల అప్పు ఇచ్చారు. ఆ సొమ్ముతో 10 మేకలు కొనుగోలు చేసుకున్నాను. ప్రస్తుతం వాటి విలువ సుమారు రూ. 3.78 లక్షలకు చేరింది. పేదరికం నుంచి బయటపడి ధైర్యంగా జీవిస్తున్నా.


సంఘం భరోసానిచ్చింది..

- తప్పెట్ల నాగమణి, జాకారం, ములుగు మండలం

నేను రోజు కూలీ చేసుకునేదాన్ని. మాకున్న 20 గుంటల పొలంలో వ్యవసాయం చేసుకుంటున్నాం. గ్రామంలోని మహిళలమంతా ఒక సంఘంగా ఏర్పడ్డాం. సంఘం ద్వారా వచ్చిన సొమ్ముతో కుట్టుమిషన్‌ కొనుగోలు చేసుకున్నాను. కూలీగా రోజుకు రూ. 100 మాత్రమే సంపాదించేదాన్ని. కుట్టు మిషన్‌ ద్వారా రోజుకు సుమారు రూ. 600 సంపాదిస్తున్నా. పిల్లలను బాగా చదివిస్తున్నా. సంఘంలో చేరడం జీవితానికి భరోసానిచ్చింది.


శిక్షణ ఇస్తూ ప్రోత్సహిస్తున్నాం..

- శ్రీనివాస్‌, డీఆర్‌డీఏ ఏపీడీ

మహిళలు స్వయం ఉపాధితో అభివృద్ధి చెందేందుకు అవసరమైతే వారు ఎంచుకున్న రంగంలో శిక్షణ కూడా ఇస్తున్నాం. సంఘంలో వారు తీసుకున్న అప్పు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునే విధంగా అవగాహన కల్పిస్తున్నాం. స్వయం ఉపాధికి అందిస్తున్న రుణాలతో జీవన స్థితిగతుల్లో మంచి మార్పు వస్తోంది.


నిరుపేద కుటుంబానికి ఆసరాగా..

- పడమటింటి కవిత, ములుగు

సంఘం నుంచి తీసుకున్న అప్పు మా కుటుంబానికి ఎంతో ఉపయోగపడుతోంది. తొలుత సుమారు రూ. 40 వేలు అప్పుగా తసుకొని కిరాణ దుకాణం నడుపుతున్నాం. దశల వారీగా అభివృద్ధి చేసుకున్నాం. రూ. 4 లక్షల పెట్టుబడితో వ్యాపారాన్ని అభివృద్ధి చేసి నెలకు రూ. 20 వేల ఆదాయం ఆర్జిస్తున్నాం. మాకు కనీసం ఇల్లు కూడా లేదు. కిరాయికి ఉన్న ఇంట్లోనే దుకాణం పెట్టి జీవనం సాగిస్తున్న సమయంలో సంఘం నుంచి తీసుకున్న అప్పు మాకు తోడైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని