logo

మనసు వికలమై.. బతుకు భారమై!

నిండునూరేళ్ల ప్రాయాన్ని అర్ధంతరంగా ముగించేస్తున్నారు. మనసులో ఒత్తిడిని తట్టుకోలేక బలవన్మరణాల్ని కోరి తెచ్చుకుంటున్నారు. ఉజ్వలమైన భవిత కళ్లెదుట ఉన్నప్పటికీ.. కాసేపు మనసులో కల్లోలాన్ని సృష్టిస్తున్న వేదన, అలజడిల ముందు ఓడిపోతున్నారు.

Updated : 29 May 2022 04:22 IST

క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్న యువత

భూపాలపల్లి క్రైం, న్యూస్‌టుడే : నిండునూరేళ్ల ప్రాయాన్ని అర్ధంతరంగా ముగించేస్తున్నారు. మనసులో ఒత్తిడిని తట్టుకోలేక బలవన్మరణాల్ని కోరి తెచ్చుకుంటున్నారు. ఉజ్వలమైన భవిత కళ్లెదుట ఉన్నప్పటికీ.. కాసేపు మనసులో కల్లోలాన్ని సృష్టిస్తున్న వేదన, అలజడిల ముందు ఓడిపోతున్నారు. విలువైన ప్రాణాల్ని ఫణంగా పెడుతున్నారు. జల్సాలకు దగ్గరై యువకులు.. అప్పుల ఊబిలో చిక్కుకొని పెద్దలు.. ఆవేశంలో మహిళలు.. అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరణమే శరణ్యమని భావించి.. చితిరాత రాసుకుంటున్నారు. ఆత్మీయులను శోకసంద్రంలో ముంచుతున్నారు. మారుతున్న జీవన విధాన ఫలితమో.. కుటుంబ సభ్యుల మధ్య బలహీనమవుతున్న బంధమో తెలియదు. కానీ ఈ లోకంలో బతకలేమని తనువు చాలిస్తున్న తీరు మాత్రం విషాదాన్ని నింపుతోంది. జిల్లాలో ఏడాదికేడాది ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య పెరిగిపోతూనే ఉంది.

కష్టాలను ధైర్యంగా ఎదుర్కోవాలి : సురేందర్‌రెడ్డి, ఎస్పీ

జీవితంలో ఎదురయ్యే కష్టాలను పెద్ద సమస్యగా భావిస్తున్నారు. తొందరపాటు నిర్ణయాన్ని తీసుకుంటున్నారు. అలా చేయవద్ధు నూరెళ్లు బతకాల్సిన వారు ఆటంకాలు కలిగినప్పుడు, అపజయాలు ఎదురైనప్పుడు బలంగా నిలబడాలి. వాటికి పరిష్కార మార్గాలు అన్వేశించాలి. క్షణికావేశంలో తీసుకున నిర్ణయంతో కుటుంబాలకు తీరని వేదన మిగులుతుంది.

నిపుణుల సలహాలు

* ప్రతి ఒక్కరికీ జీవితంలో ఆటుపోట్లు సహజం. సముద్ర కెరటం ప్రతీసారి పైకిలేచి కిందపడుతుంది. అలానే ప్రతి మనిషి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ప్రయత్నాలు చేయాలి.

* జీవితంలో ఓటమి కామా మాత్రమే ఫుల్‌స్టాప్‌ కాదు. గెలుపు ఏమీ నేర్పించదు, ఓటమీ గుణపాఠాలు నేర్పిస్తుంది.

* ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో నిత్యం సమయం కేటాయించాలి. వారితో సమస్యలు, బాధలు పంచుకోవాలి.

* ప్రపంచంలో మనషులు తప్ప ఏ జీవి ఆత్మహత్య చేసుకోదు. ఉన్నతమైన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకోవాలనుకోవడం ప్రకృతి విరుద్ధం.

కారణాలు అనేకం

* నచ్చిన చదువు చదవలేక, కుటుంబ సభ్యుల ఒత్తిడితో ఇష్టంలేని కోర్సులో చేరి దానిలో ఇమడలేక ఇబ్బంది పడే వారు ఆత్మహత్యల వైపు మొగ్గు చూపుతున్నారు.

* కొంత మంది మద్యం, పేకాట, ఇతరత్రా చెడు వ్యసనాలకు అలవాటు పడి ఆర్థికంగా, మానసికంగా నష్టపోయి రోడ్డున పడుతున్నారు. బతుకు భారమై తనువు చాలిస్తున్నారు.

* సాంకేతిక పరిజ్ఞానం తక్కువ ధరలోనే అందుబాటులో ఉండటం, అర్ధరాత్రుల వరకు అంతర్జాలానికే అతుక్కుపోవడం, చరవాణులతో గంటలకొద్దీ కాలక్షేపం చేయడం వల్ల దుష్ప్రభావాలు సైతం ఎదురవుతున్నాయి.

* చరవాణి కొనివ్వలేదని, తల్లిదండ్రులు మందలించారని ప్రాణాలు తీసుకుంటున్నారు.

* చిన్న వయసులోనే ప్రేమ వ్యవహారాల్లో తలదూర్చడం, స్కూళ్లలో సైతం ఈ వికృత పోకడలు పెరిగిపోవడం మరో కారణం.

* ఈనెల 15వ తేదిన భూపాలపల్లి పట్టణానికి చెందిన ఓ కాంట్రాక్ట్‌ ఉద్యోగి తన భార్యతో ఓ విషయంలో గొడవపడ్డాడు. క్షణికావేశంలో భార్యను కత్తితో పొడిచి తాను కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆవేశంతో తీసుకున్న నిర్ణయంతో ఒక ప్రాణం గాలిలో కలిసిపోయింది.

* నెలన్నర క్రితం చిట్యాల మండలం చల్లగరిగెకు చెందిన ప్రభుత్వ ఉద్యోగి.. అనివార్య కారణాలతో కొలువు పోయిందని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

* మొగుళ్లపల్లి మండలం ఇస్సీపేటకు చెందిన ఓ యువకుడు రెండు నెలల కిత్రం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆవేశంతో చితిరాత రాసుకున్నాడు.

* గణపురం మండలం గాంధీనగర్‌లోని భార్యాభర్తల మధ్య కుటుంబ సమస్యల కారణంగా తరచూ గొడవలు జరుగుతున్నాయి. రెండు నెలల క్రితం భార్య పుట్టింటికి వెళ్లడంతో ఆవేశంతో ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.


తనువు చాలించిన నవవధువు


విజయ(పాతచిత్రం)

కాటారం మండలం ఒడిపిలవంచలో విజయ(28) నవ వధువు శనివారం ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై శ్రీనివాస్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మహాముత్తారం మండలం వజినేపల్లి గ్రామానికి చెందిన విజయతో నెల క్రితం ఒడిపిలవంచకు చెందిన శ్రీకాంత్‌కు వివాహం జరిగింది. ఈనెల 24న పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబసభ్యులు హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. శ్రీకాంత్‌ వేధింపులు తట్టుకోలేకనే ఆత్మహత్య చేసుకుందని మృతురాలి సోదరుడు రాజు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

-న్యూస్‌టుడే, కాటారం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని