logo

పట్టాలు లేక.. పథకాలు అందక

అవి భూదానోద్యమం కింద ఇచ్చిన భూములు.. పేదలకు అవే జీవనాధారం. దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్నారు. వాటికి పట్టాల్లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

Published : 29 May 2022 04:11 IST


దూదేకులపల్లి గ్రామ శివారులో భూదాన్‌ భూములు

ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి, న్యూస్‌టుడే, భూపాలపల్లి: అవి భూదానోద్యమం కింద ఇచ్చిన భూములు.. పేదలకు అవే జీవనాధారం. దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్నారు. వాటికి పట్టాల్లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పట్టాలిచ్చి ధరణి పోర్టల్‌లో నమోదు చేస్తే తమకు ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయని కోరుతున్నారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం దూదేకులపల్లి శివారులో సర్వే నంబరు 89 నుంచి 104 వరకు మొత్తం 166.27 ఎకరాల భూమి ఉంది. భూదాన ఉద్యమ సమయంలో ఓ భూస్వామి ఈ భూములను దానంగా ఇచ్చారు.

సాగులో 100 మందికిపైగా..

భూదాన్‌ యజ్ఞ బోర్డు, మండల రెవెన్యూ అధికారులు కలిసి 1986లో 57 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించారు. అప్పట్లో చెట్లు, పుట్టలతో వ్యవసాయానికి యోగ్యంగా లేదు. కొందరు రైతులు సాగుచేసుకోలేక పోయారు. మరికొందరు ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. ఖాళీగా ఉంటున్న భూములను గ్రామంలోని వంద మందికి పైగా నిరుపేదలు చదును చేసుకుని సాగుకు అనుకూలంగా మార్చుకున్నారు. వీటిని ఆక్రమించుకోవడానికి కొందరు రైతులను బెదిరిస్తున్నారు.

30 ఏళ్లుగా...

ప్రస్తుతం 166.27 ఎకరాలను 36 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలు లేవు. రైతుబంధు, రైతుబీమా, ఇతర పథకాలు పొందలేక పోతున్నారు. పలుమార్లు హైదరాబాద్‌లోని భూదాన యజ్ఞ బోర్డు కార్యాలయం, రెవెన్యూ అధికారుల వద్దకు వెళ్లి తమకు పట్టాలు ఇవ్వాలని కోరారు. అధికారులు పట్టించుకోవటం లేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.


మాకు ఈ భూములే ఆధారం

రవీందర్‌

రైతులకు అన్యాయం చేయొద్ధు పట్టాల కోసం ఎంతో తిరిగాం. అధికారులు, నేతలను కలిశాం. ఎవ్వరూ మా సమస్యను పరిష్కరించడ లేదు. ఆ భూములే మాకు ఆధారం. పట్టాలు పంపిణీ చేసి ఆదుకోవాలి.


సర్వేలు చేశారు

గోస్కుల లక్ష్మయ్య

చాలా మంది భూదాన్‌ భూములను సాగుచేసుకుంటున్నారు. అధికారులు పట్టాలు ఇప్పిస్తామని సర్వేలు చేశారు. ఒక్కరికి కూడా పాసు పుస్తకాలు ఇవ్వలేదు. ముఖ్యంగా ఎమ్మెల్యే, అధికారులు పట్టించుకుని అందరికి న్యాయం చేయాలి.


బీమా సౌకర్యం లేదు

పింగిడి శంకరయ్య

మా తాతల నుంచి ఆ భూములపైనే ఆధారపడి బతుకుతున్నాం. పట్టా లేకపోవడంతో ఎలాంటి ప్రభుత్వ పథకాలు అందటం లేదు. కలెక్టర్‌ చొరవ తీసుకొని.. పట్టాలు ఇప్పించి ఆదుకోవాలి. చనిపోయిన రైతులకు బీమా సౌకర్యం లేకుండా పోతుంది.


ప్రభుత్వం పట్టించుకోలేదు

పింగిడి పద్మ

పట్టాలు ఇప్పించాలని గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం నుంచి నేటి తెరాస సర్కారు చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవటం లేదు. చాలా మంది రైతులు ఆందోళన చెందుతున్నారు. పథకాలు అందక అప్పుల పాలవుతున్నారు.


అర్హులను గుర్తించి న్యాయం చేస్తాం

శ్రీనివాస్‌, ఆర్డీఓ, భూపాలపల్లి

భూదాన్‌ భూములను సర్వే చేపట్టాల్సి ఉంటుంది. గతంలో ఎవరెవరికి కేటాయించారు, ప్రస్తుతం కాస్తులో ఎవరున్నారో తేల్చాలి. ఆయా భూముల వివరాలు రికార్డులకు సరిపోలాలి. ఇవన్నీ దశల వారీగా చేయాల్సి ఉంటుంది. ఈప్రక్రియ పూర్తయిన అనంతరం అర్హులను గుర్తించి, నివేదికల ఆధారంగా తగిన న్యాయం చేస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని