logo
Published : 28 Jun 2022 06:16 IST

రామగుండం వైపు ఇంటర్‌సిటీ ఒక్కటే దిక్కు


బల్లార్షా మార్గంలో రైళ్లు రద్దు కావడంతో బుకింగ్‌ కౌంటర్‌ వద్ద ప్రయాణికులు

కాజీపేట, న్యూస్‌టుడే: బల్లార్షా వైపు ప్రయాణించేందుకు ఇప్పుడు హైదరాబాదు-సిర్‌పూర్‌ కాగజ్‌నగర్‌ల మధ్య నడిచే ఇంటర్‌సిటీ ఒక్కటే దిక్కయింది. జమ్మికుంట- ఉప్పల్‌ రైల్వేస్టేషన్ల మధ్య మూడోలైను పనుల కారణంగా సోమవారం నుంచి వచ్చే నెల 20వ తేదీ వరకు ముఖ్యమైన రైళ్లను రద్దు చేయడమే కాకుండా 12 రైళ్లను దారి మళ్లించారు. సోమవారం ఉదయం నుంచి ఇది అమలులోకి రావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. సిర్‌పూర్‌కాగజ్‌నగర్‌-సికింద్రాబాదుల మధ్య నడిచే 12757/58 నంబరు గల కాగజ్‌నగర్‌ ఎక్స్‌ప్రెస్‌, కాజీపేట-సిర్‌పూర్‌టౌన్‌ల మధ్య నడిచే 17003/04 నంబరు గల రామగిరి ప్యాసింజరు రైళ్లను పూర్తిగా రద్దు చేశారు. భద్రాచలం రోడ్‌-బల్లార్షాల మధ్య నడిచే సింగరేణి ప్యాసింజరు.. భద్రాచలం రోడ్‌ నుంచి వరంగల్‌ వరకు మాత్రమే నడుస్తుది. సికింద్రాబాదు- బల్లార్షా మధ్య నడిచే భాగ్యనగర్‌ ఎక్స్‌ప్రెస్‌ కాజీపేట వరకు మాత్రమే నడుస్తుంది. మరో 12 రైళ్లను నిజామాబాద్‌ మీదుగా దారి మళ్లించారు.

రైలు మార్గంలేక ఇబ్బందులు

బల్లార్షా వైపు ఉన్న రామగుండం, మంచిర్యాల, పెద్దపల్లి ప్రాంతాలకు వెళ్లాలంటే ఉమ్మడి వరంగల్‌ జిల్లా ప్రజలకు రోడ్డు, రైలు మార్గమే సులువుగా ఉంటుంది. రోడ్డు మార్గంలో వెళ్లాలంటే కరీంనగర్‌ మీదుగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇది చాలా దూరమే కాకుండా అధిక సమయం పడుతుంది. దీంతో ఎక్కువగా ఈ మార్గంలో వెళ్లే ప్రయాణికులు రైళ్లనే ఆశ్రయిస్తారు. మూడోలైను పనుల కారణంగా కేవలం ఇంటర్‌సిటీ (కాజీపేటలో ఉదయం 7.20 గంటలకు) ఒక్కటే ఇప్పుడు అందుబాటులో ఉంది. హైదరాబాదు- న్యూదిల్లీ మధ్య నడిచే తెలంగాణ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ కూడా ఉంది కానీ.. ఇందులో కేవలం నాలుగు జనరల్‌ బోగీలు మాత్రమే ఉంటాయి. మిగతావన్నీ రిజర్వేషన్‌తో ఉంటాయి. సాధారణంగానే తెలంగాణ రైలులో జనరల్‌ బోగీలు కిక్కిరిసి ఉంటాయి. అందుకే ఇందులో ప్రయాణం కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. ఇది కేవలం మంచిర్యాల, రామగుండంలో మాత్రమే ఆగుతుంది. మిగతా రైల్వే స్టేషన్లకు వెళ్లే ప్రయాణికులు లేదా అక్కడి నుంచి వచ్చే ప్రయాణికులు ఇంటర్‌సిటీని మాత్రమే ఆశ్రయించాల్సి ఉంటుంది.

కాషన్‌ ఆర్డర్‌తో నడపవచ్చు

24 రోజుల పాటు ముఖ్యమైన రైళ్ల రద్దు కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి కాషన్‌ ఆర్డర్‌ లేదా మ్యానువల్‌గా భాగ్యనగర్‌ లాంటి డిమాండ్‌ గల రైళ్లను నడిపించవచ్చని రైల్వే నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని పనులను త్వరగా పూర్తి చేసి కాస్త ఆలస్యంగా నడిచినా మరో రైలును నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Read latest Warangal News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని