logo
Published : 28 Jun 2022 06:16 IST

సస్యశ్యామలం దిశగా బీడు భూములు


జనగామ మండలం గానుగుపహాడ్‌ శివారు గోవింద్‌తండా వద్ద బొమ్మకూరు రిజర్వాయర్‌ కుడి కాలువ తవ్వకం పనులు

జనగామ రూరల్‌, న్యూస్‌టుడే: జనగామ ప్రాంత భూములు పెద్ద మొత్తంలో ఎగుడు, దిగుడుగా ఉండడంతో సాగుకు ప్రతికూలంగా మారాయి. దీనికితోడే వర్షాభావ పరిస్థితులతో బీడు భూములను చదును చేసి, సాగు చేయడం సవాలుగా మారింది. సరిపడా నీరుంటే రైతులు సాగు దిశగా అడుగులు వేస్తారని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. దేవాదుల ప్రాజెక్టులో నిర్మితమైన రిజర్వాయర్ల నుంచి నేరుగా పొలాలకు సాగు నీరందించేందుకు కాలువ నిర్మాణ పనులు శర వేగంగా నిర్వహిస్తోంది. ఏళ్ల తరబడి పడావుగా ఉన్న బీడు భూముల్లో రైతులు చదును పనులు ముమ్మరం చేశారు. జనగామ మండలంలోని కొన్ని గ్రామాల పరిధిలోనే వేలాది ఎకరాలు ప్రస్తుతం సాగులోకి రానున్నాయి.

కరవు నేలపై వడివడిగా గోదారమ్మ..

జనగామ-నర్మెట్ట మండలాల సరిహద్దులో నిర్మించిన 0.75 టీ.ఎం.సీ సామర్థ్యంతో నిర్మించిన బొమ్మకూరు రిజర్వాయర్‌ నుంచి కుడి కాలువ కాలువ ద్వారా మండలంలోని 10 గ్రామాలకు సాగునీరందించేందుకు 90 కి.మీ పరిధిలో ఈ కాలువల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. 8 ప్రధాన కాలువలు 18 కి.మీ పరిధిలో, 7 ఉప ప్రధాన కాలువలు, 22 సబ్‌ మైనర్‌ కాలువలు 70 కి.మీ పైచిలుకు ఉన్నాయి. ఈ కాలువల ద్వారా బొమ్మకూరు, అడవికేశ్వాపూర్‌, వెంకిర్యాల, గానుగుపహాడ్‌, గోపరాజుపల్లి, పసరమడ్ల, పెద్దపహాడ్‌, ఓబుల్‌కేశ్వాపూర్‌, ఎర్రకుంటతండా, వడ్లకొండ, మరిగడి, ఎర్రగొల్లపహాడ్‌ గ్రామాల పరిధిలో మొత్తం 28 వేల ఎకరాలకు సాగునీరందించేందుకు ప్రభుత్వ యంత్రాంగం చకచకా కాలువ నిర్మాణాలు పూర్తి చేస్తోంది. గొలుసుకట్టు చెరువులు, కుంటలు, వాగులకు నీరు చేరడం మరింత సులువుగా మారనుంది.

ఇక బోరు బావుల్లో సమృద్ధిగా నీరు..

గత రెండేళ్లుగా బీడు భూములు కాలువల నిర్మాణాలతో సాగులోకి వస్తున్నాయి. రైతులు గుట్టలు, రాళ్ల భూములను సైతం సాగులోకి తెచ్చేందుకు ఒక్కో ఎకరాకు లక్షలాది రూపాయలు వెచ్చిస్తున్నారు. తద్వారా బీడు భూములకు జీవం వస్తోంది. భూగర్భ జలాలు భారీగా పెరిగేందుకు ఆస్కారం ఏర్పడడంతో బోర్లు, బావుల్లో సమృద్ధిగా నీరు చేరుతోంది. బొమ్మకూరు రిజర్వాయర్‌ కుడి, ఎడమ కాలువల నిర్మాణాలకు రైతుల నుంచి భూసేకరణ జరిగినప్పటికీ.. ఆయా ప్రాంతాల్లో కొన్ని సమస్యలు తలెత్తాయి. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి రైతులు, అధికారులతో నేరుగా మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తుండడంతో పనుల్లో వేగం పెరిగింది.

పూర్తి కావచ్చిన పనులు.. : - కమలాకర్‌, బొమ్మకూరు రిజర్వాయర్‌, కుడి కాలువ ఏఈ

బొమ్మకూరు రిజర్వాయర్‌ కుడి కాలువ పరిధిలో దాదాపు 80 శాతం పనులు పూర్తికాగా, మరో ఏడాదిలోపు వందశాతం పనులు పూర్తి కానున్నాయి. కాలువ నిర్మాణాలు పూర్తైన పరిధిలో సాగుకు నీరందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వానాకాలం సాగుకు మరో 10-15 రోజుల్లో నీరు అందేందుకు చర్యలు చేపట్టాం.

Read latest Warangal News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని