logo

దొరకని ఆసరా

రెక్కల కష్టంతో కాలం వెల్లదీసే పేదవాళ్లకు వయసు మీద పడితే ఏ పని చేయలేక ఇంటి పట్టునే ఉండిపోతారు.. అలాంటి వృద్ధులకు పూట గడవడమే కష్టం. వారికి ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం ఆసరా పింఛన్లను ఇస్తోంది.

Published : 28 Jun 2022 06:16 IST

పింఛన్ల కోసం 5094 మంది నిరీక్షణ

ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి: రెక్కల కష్టంతో కాలం వెల్లదీసే పేదవాళ్లకు వయసు మీద పడితే ఏ పని చేయలేక ఇంటి పట్టునే ఉండిపోతారు.. అలాంటి వృద్ధులకు పూట గడవడమే కష్టం. వారికి ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం ఆసరా పింఛన్లను ఇస్తోంది. అయితే కొంతకాలంగా నూతనంగా దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రం నిరాశే మిగులుతోంది. జిల్లాలో 5094 దరఖాస్తులు పెండింగ్‌ ఉన్నాయి. 2019 జులై నుంచి కొత్తవి మంజూరు చేయడం లేదు. దరఖాస్తుదారులు పింఛన్‌ ఎప్పుడు వస్తుందని కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. మంజూరు చేస్తే ఇతరుపై ఆధారపడకుండా గౌరవంగా జీవనం సాగిద్దామనుకుంటున్న వారి ఆశలు అడియాసలే అవుతున్నాయి. ఇప్పటికైనా ఇవ్వాలని కోరుతున్నారు.

రెట్టింపైన నాటి నుంచి నిరీక్షణ

2019 మే నెలలో ఆసరా పింఛన్లను ప్రభుత్వం రెట్టింపు చేసింది. లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. దివ్యాంగులకు రూ. 1500 నుంచి రూ. 3016, వృద్ధాప్య, వింతంతువు, గీత, చేనేత, బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు రూ. 1000 నుంచి రూ. 2016కు పెంచారు. పింఛన్లను రెట్టింపు కంటే ఎక్కువే చెల్లిస్తున్నారు. కానీ కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రం మంజూరు చేయకపోవడంతో నిరీక్షిస్తున్నారు.

వయసు తగ్గించినవి ఎప్పుడో..

వృద్ధాప్య పింఛన్ల వయసు 65 నుంచి 57 ఏళ్లకు తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 57 ఏళ్లు దాటిన 9649 మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకున్నారు. కొత్త పింఛన్లపై కూడా నిర్ణయం తీసుకోవాలని, పెండింగ్‌ దరఖాస్తుదారులకు మంజూరు చేయాలని పలువురు కోరుతున్నారు.

ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది - పురుషోత్తం, డీఆర్డీఓ

అర్హులు దరఖాస్తులు చేసుకున్నారు. అన్నీ ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ అయ్యాయి. కొత్త పింఛన్ల మంజూరు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే నేరుగా లబ్ధిదారులకు పింఛన్లు వస్తాయి. త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.


తరాల రాములుకు ఐదేళ్ల నుంచి కళ్లు కనిపించడం లేదు. ఆయన భార్యే కూలీ పనులకు వెళ్లి సాకుతోంది. సదరం ధ్రువపత్రం ఉన్నా పింఛన్‌ రావడం లేదు. వృద్ధాప్య పింఛనుకూ అర్హుడే. ఆర్థిక పరిస్థితి అంతంతే. పింఛన్‌ వస్తే ఎంతో కొంత ఆసర అవుతుందని ఆశతో ఎదురుచూస్తున్నాడు.


ఈమె పేరు ముదురుకోల పార్వతమ్మ. భూపాలపల్లి మండలం ఆజంనగర్‌. 61 సంవత్సరాలు. 57 ఏళ్లు పైబడిన వారికి వృద్ధాప్య పింఛన్‌ వస్తుందని దరఖాస్తు చేసుకుంది. రాకపోవడంతో నిరాశ చెందుతోంది.


ఈమె పేరు జనగామ సమ్మక్క. పలిమెల మండల కేంద్రంలో ఉంటుంది. పుట్టుకతోనే దివ్యాంగురాలు. సరిగా నడవలేదు. గతంలో పింఛన్‌ వచ్చేది. రూ. 3016కు పెంచిన నాటి నుంచి రావడం లేదు. సదరం ధ్రువపత్రం కూడా ఉంది. తిరిగి దరఖాస్తు చేసి ఆర్నెళ్లవుతోంది. కాని పింఛన్‌ మాత్రం ఇప్పటికి రావడం లేదని వాపోతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని