logo

ఆగ్రహించిన నారాయణపురం రైతులు

పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలని కోరుతూ కేసముద్రం మండలం నారాయణపురం గ్రామంతోపాటు శివారు తండాలకు చెందిన సుమారు 300 మంది రైతులు సోమవారం ఆందోళన బాట పట్టారు. అడ్డుకోవాలని వచ్చిన పోలీసుల కాళ్లపై పడి గిరిజన మహిళా రైతులు వేడుకున్నారు. పాసుపుస్తకాలు ఇప్పించాలని ...

Published : 28 Jun 2022 06:45 IST


పోలీసులను వేడుకొంటున్న గిరిజన మహిళా రైతులు

కేసముద్రం, న్యూస్‌టుడే: పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలని కోరుతూ కేసముద్రం మండలం నారాయణపురం గ్రామంతోపాటు శివారు తండాలకు చెందిన సుమారు 300 మంది రైతులు సోమవారం ఆందోళన బాట పట్టారు. అడ్డుకోవాలని వచ్చిన పోలీసుల కాళ్లపై పడి గిరిజన మహిళా రైతులు వేడుకున్నారు. పాసుపుస్తకాలు ఇప్పించాలని నాలుగేళ్లుగా తాము పడుతున్న బాధలను ఏకరవు పెట్టారు. 43 సర్వే నెంబర్లతో 1827ఎకరాల విస్తీర్ణం కలిగిన నారాయణపురం రెవెన్యూ గ్రామాన్ని 31మే 2018 లో కేసముద్రం మండంలో చేర్చారు. అధికారుల తప్పిదంతో 222 ఎకరాలు పట్టాభూమి 1605 ఎకరాలు అటవీభూమిగా రికార్డుల్లో నమోదైంది. భూరికార్డుల ప్రక్షాళనతో అటవీభూమిగా ప్రకటిస్తూ నారాయణపురం రైతులకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ నిలిపేశారు. దీంతో ఆ గ్రామ రైతులు దశల వారీగా ఆందోళనతో రెవెన్యూ, అటవీ అధికారులు సర్వే నిర్వహించి నారాయణపురం రెవెన్యూ పరిధిలోని భూములను పట్టాభూములుగా ప్రకటించారు. జూన్‌ 2021లో ఎంజాయిమెంట్‌ సర్వే నిర్వహించిన రెవెన్యూ అధికారులు 1403 ఎకరాలకు త్వరలో పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేస్తామని ప్రకటించారు. పాసుపుస్తకాల కోసం సుమారు 1200 మంది రైతులు ఎంతో ఆశగా ఎదురు చూస్తుండగా ఎంజాయిమెంట్‌ రికార్డు, పాత పట్టాదారు పాసుపుస్తకాల్లో ఒకే సర్వే నెంబరు కలిగిన రైతులకు మాత్రమే మొదటగా పాసుపుస్తకాలు పంపిణీ చేయనున్నట్లు అధికారులు ప్రకటించడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. అధికారులు దాటవేత ధోరణి అనుసరిస్తుండటంతో ఆగ్రహించిన రైతులు సోమవారం అందోళన బాట పట్టారు. తహసీల్దారు కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష చేసేందుకు శివారు తండాలకు చెందిన సుమారు 300మంది రైతులు ఒక్కటిగా కదిలారు. నారాయణపురం నుంచి మండల కేంద్రానికి ర్యాలీగా బయలుదేరుతుండగా సీఐ రవికుమార్‌, ఎస్సై రమేశ్‌బాబులు వారిని అడ్డుకున్నారు. ర్యాలీగా వెళ్లేందుకు రైతులు పట్టుబట్టడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చివరకు అక్కడికి చేరుకున్న తహసీల్దారు ఫరీద్‌, డీటీ కోమల రైతులతో మాట్లాడుతూ సమస్య కలెక్టరు దృష్టికి తీసుకెళ్లామని త్వరలో పరిష్కరించి అర్హత కలిగిన ప్రతి రైతుకు పట్టాదారు పాసుపుస్తకం అందజేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని