logo

పరువు తీశారని ప్రాణం తీసుకున్న వివాహిత

తనను వేధించిన వ్యక్తిని మందలించాలని సర్పంచికి ఫోన్‌లో విన్నవించిన సంభాషణ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడం.. కుల పెద్దమనుషుల సమక్షంలో....

Published : 28 Jun 2022 06:45 IST


స్వాతి (పాత చిత్రం)

ఈనాడు డిజిటల్‌, మహబూబాబాద్‌, న్యూస్‌టుడే, బయ్యారం: తనను వేధించిన వ్యక్తిని మందలించాలని సర్పంచికి ఫోన్‌లో విన్నవించిన సంభాషణ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడం.. కుల పెద్దమనుషుల సమక్షంలో జరిగిన పంచాయితీలోనూ న్యాయం జరగకపోగా పరువు తీశారనే అవమానంతో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం మండలం గౌరారంలో ఆదివారం రాత్రి జరిగింది. స్థానికులు, కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ముక్తి స్వాతి (38), నాగేశ్వర్‌రావు దంపతులకు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కుమార్తెకు ఇటీవల వివాహం జరిగింది. కల్యాణలక్ష్మి పథకం దరఖాస్తు కాగితాలపై సంతకం పెట్టించేందుకు ముక్తి స్వాతి పది రోజుల కిందట పంచాయతీ కార్యదర్శి మంగీలాల్‌ వద్దకు వెళ్లారు. ఆ సమయంలో మంగీలాల్‌ తనను వేధించాడంటూ గ్రామానికి చెందిన యువకుడు చింత అరవింద్‌ దృష్టికి తీసుకెళ్లింది. ఆయన పంచాయతీ కార్యదర్శిని మందలించడంతో పాటు వాట్సాప్‌లో దుర్భాషలాడుతూ ఛాటింగ్‌ చేసి బెదిరించాడు. మరోవైపు బాధితురాలు తనతో పంచాయతీ కార్యదర్శి వ్యవహరించిన తీరును ఫోన్‌లో సర్పంచి తాటి వెంకన్నకు విన్నవించింది. ఈ సంభాషణ స్వాతి ఫోన్‌లో రికార్డు అయింది. దీనిని చూసిన అరవింద్‌ కుల పెద్దలు ఏర్పాటు చేసిన వాట్సాప్‌ గ్రూప్‌నకు ఆదివారం మధ్యాహ్నం పంపించాడు. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. దీంతో సర్పంచి, కులపెద్దలు సాయంత్రం 4 గంటలకు పంచాయితీ పెట్టి అరవింద్‌, అతడి తల్లిదండ్రులు, స్వాతితోపాటు ఆమె ఆడపడుచు సైదమ్మను పిలిపించి మాట్లాడారు. ఈక్రమంలో తన అన్న పరువు ఎందుకు తీస్తున్నావంటూ సైదమ్మ స్వాతిపై చేయి చేసుకుంది. అరవింద్‌ తల్లి భద్రమ్మ కూడా తన కొడుకు జీవితాన్ని నాశనం చేస్తున్నావంటూ దాడి చేసింది. ఈ సంఘటనతో కులపెద్దల ఎదుట తన పరువు పోయిందని భావించిన స్వాతి మనవేదనతో ఇంటికి వచ్చి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతురాలి సోదరుడు కల్తీ ప్రవీణ్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్‌ ప్రభుత్వాసుపతికి తరలించారు. ఈ విషయంపై గార్ల, బయ్యారం సీఐ బాలాజీ మాట్లాడుతూ అరవింద్‌, భద్రమ్మ, పుల్లయ్య, సైదమ్మపై కేసు నమోదు చేశామన్నారు. పంచాయతీ కార్యదర్శి మంగీలాల్‌ అసభ్యంగా ప్రవర్తించాడని విచారణలో తేలితే అతడిపై కూడా కేసు నమోదు చేస్తామని చెప్పారు. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి మంగీలాల్‌ను వివరణ కోరగా కావాలని తనపై ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని